సాక్షి, అమరావతి: రాయలసీమ, నెల్లూరు జిల్లాల తాగు, సాగునీటి అవసరాలను తీర్చేందుకు ఉద్దేశించిన రాయలసీమ ఎత్తిపోతల పథకంపై జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) గురువారం తన నిర్ణయాన్ని వెలువరించింది. రాయలసీమ, నెల్లూరు జిల్లాల తాగు, సాగునీటి అవసరాలకు ఈ ప్రాజెక్టు ఆవశ్యకమని ట్రిబ్యునల్ స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం అందచేసిన ఈ ప్రాజెక్టు స్కీంను పరిశీలిస్తే ప్రధానంగా రాయలసీమ కరువు తీర్చేందుకు తాగు, సాగునీటి అవసరాల కోసం రోజూ 8 టీఎంసీల వరద నీటిని మళ్లించి, వీలైనంత తక్కువ వరద జలాలు సముద్రంలో కలిసేందుకు ఉద్దేశించిన పథకమని తెలిపింది. అయితే ఈ ప్రాజెక్టులో సాగునీటి అంశం కూడా ముడిపడి ఉన్నందున నిర్మాణానికి ముందు పర్యావరణ అనుమతి అవసరమని ట్రిబ్యునల్ స్పష్టం చేసింది.(చదవండి: సాఫీగానే ‘సీమ ఎత్తిపోతల’)
ఈ ఎత్తిపోతలకు సంబంధించిన సమగ్ర ప్రాజెక్ట్ నివేదిక (డీపీఆర్)ను కృష్ణా నదీ జలాల నిర్వహణ బోర్డు (కేఆర్‌ఎంబీ)కు సమర్పించకుండా ముందుకెళ్లవద్దంటూ కేంద్ర జలశక్తి శాఖ ఇప్పటికే ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించిందని హరిత ట్రిబ్యునల్ గుర్తు చేసింది. రాయలసీమ ఎత్తిపోతల పథకానికి కేఆర్‌ఎంబీ నుంచి ముందస్తు అనుమతి అవసరమా? లేదా? అన్న అంశం జోలికి తాము వెళ్లడం లేదని పేర్కొంది. ఈ మేరకు ఎన్జీటీ దక్షిణ ప్రాంత బెంచ్ జ్యుడీషియల్ మెంబర్ జస్టిస్ కె.రామకృష్ణన్, ఎక్స్‌పర్ట్ మెంబర్ సైబల్ దాస్ గుప్తాలతో కూడిన ధర్మాసనం 134 పేజీల తీర్పు వెలువరించింది. రాయలసీమ ఎత్తిపోతల పథకానికి పర్యావరణ అనుమతులు లేవని, ఈ పథకం వల్ల తెలంగాణలోని పలు ప్రాజెక్టుల ఆయకట్టుతో పాటు హైదరాబాద్‌కు తాగునీటి సమస్య ఏర్పడుతుందంటూ తెలంగాణ, నారాయణపేట జిల్లాకు చెందిన గవినోళ్ల శ్రీనివాస్ ఎన్జీటీలో పిటిషన్ దాఖలు చేయడం తెలిసిందే. తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ ప్రాజెక్టుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ వాదనలు వినిపించిన సంగతి విదితమే.(చదవండి: రూ.17,300 కోట్లతో వైద్య రంగానికి చికిత్స)
Comments
Please login to add a commentAdd a comment