ఖజానాకు తాళం
Published Tue, Feb 7 2017 4:17 PM | Last Updated on Wed, Mar 28 2018 11:26 AM
అన్ని బిల్లుల చెల్లింపులను నిలిపివేసిన ప్రభుత్వం
ఉద్యోగుల వేతనాలు, పెన్షన్లకు మినహాయింపు
సాక్షి, రంగారెడ్డి జిల్లా: బిల్లుల చెల్లింపులపై ఆంక్షలు విధించారు. ఉద్యోగుల వేతనాలు, పెన్షన్లకు అవసరమైన డబ్బులకు మాత్రమే మినహాయింపునిచ్చారు. ఇవిగాక ఇతర ఏ బిల్లులనైనా నిలిపివేయాలని ప్రభుత్వం ఆదేశించినట్లు తెలిసింది. ఆర్థిక సంవత్సరం చివర దశకు చేరుకున్న క్రమంలో కార్యాలయాల నిర్వహణ బిల్లులు వివిధ శాఖలు డ్రా చేసుకునే ప్రయత్నంలో ఉన్నాయి. ఫ్రీజింగ్ నెలకొనండంతో కొన్ని రోజుల వరకు డబ్బులు పొందే పరిస్థితి కనిపించడం లేదు. మరోపక్క కీలకమైన మధ్యాహ్న భోజన పథకం, వసతి గృహాలకు డైట్ బిల్లులు, ఉద్యో గుల మెడికల్ రియింబర్స్‌మెంట్ తదితర బిల్లుల చెల్లింపుల ప్రక్రియ స్తంభించిపోయినట్లేనని తెలుస్తోంది. నెలన్నరలో 2016–17 ఆర్థిక సంవత్సరం ముగియనుండగా.. ఫ్రీజింగ్ నెలకొనడం అన్ని శాఖలకు తీవ్ర ఇబ్బందులు తప్పడం లేదు.
తరచూ ఫ్రీజింగ్...
గతంలో ఏడాదికి ఒకటి లేదా రెండు సార్లు మాత్రమే ఫ్రీజింగ్ విధించేవారు. కొంతకాలంగా ఇందుకు భిన్నమైన పరిస్థితులు నెలకొంటున్నాయి. రెండు మూడు నెలలకోసారి ఫ్రీజింగ్ పెట్టడంతో.. బిల్లుల చెల్లింపులు నిలిచిపోతున్నాయి. ఫలితంగా పలు అభివృద్ధి పనులకు విఘాతం కలుగుతోంది. దీంతో కొన్ని శాఖలు నిర్దిష్ట సమయాల్లోనే బిల్లులు డ్రా చేసుకుంటూ ఫ్రీజింగ్ నుంచి ఊరట పొందుతున్నాయి. తాజాగా మళ్లీ ఫ్రీజింగ్ ఏర్పడడంతో.. చెల్లింపులు ఆగిపోతున్నాయి. ముఖ్యంగా నిర్మాణాలకు సంబంధించిన బిల్లులు పూర్తిగా స్తంభించిపోతున్నాయి. తద్వారా నిధులు మురిగిపోనున్నాయి. గ్రామ పంచాయతీల్లో చేపట్టే అభివృద్ధి పనులు, తాగునీటి పథకాలు తదితర బిల్లులు డ్రా చేయాలంటే కొన్ని రోజులు ఆగక తప్పదని తెలుస్తోంది.
Advertisement