సాక్షి, హైదరాబాద్: ఇందిరమ్మ పథకం అమలుపై అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిన ఈ పథకం కింద గృహ నిర్మాణానికి ఒక్కో లబ్ధిదారుకు రూ.5 లక్షలు ఇవ్వాల్సి ఉండగా, ఆ మొత్తంతో దాదాపు 450 చదరపు అడుగుల (చ.అ) నుంచి 500 చ.అ. విస్తీర్ణంలో ఇల్లు నిర్మించుకునేందుకు వీలుంటుందని ప్రభుత్వం భావిస్తోంది. దీనితో పాటు నిబంధనల ప్రకారం చుట్టూ ఖాళీ స్థలం వదలాలంటే 70 చ.గజాల వరకు స్థలం కావాలని అంచనా వేస్తోంది. ఇలా 70 గజాల స్థలం ఉన్నా, అంతకంటే ఎక్కువున్నా పరవాలేదు.
ప్రభుత్వం ఇచ్చే రూ.5 లక్షలు పూర్తిగా ఖర్చు చేసి 500 చ.అ. విస్తీర్ణంలో ఇల్లు నిర్మించుకునేందుకు అవకాశం ఉంటుంది. కానీ రాష్ట్రంలో 60 గజాల కంటే తక్కువగా సొంత స్థలం ఉన్న పేదలే ఎక్కువమంది ఉంటారని అంచనా. కాగా తక్కువ స్థలంలో చిన్న ఇల్లు నిర్మించుకునేందుకు రూ.5 లక్షల లోపే ఖర్చవుతుందని, 60 గజాల కంటే తక్కువ స్థలం ఉన్న పేదలకు రూ.5 లక్షలు ఇస్తే, ఖర్చు కాగా మిగిలే మిగతా మొత్తం ‘దుర్వినియోగం’ ఖాతాలోకి చేరుతుందని గృహ నిర్మాణ శాఖ అధికారులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై స్పష్టత లేకపోయేసరికి ఇప్పటివరకు అధికార యంత్రాంగం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో ముందడుగు వేయలేని పరిస్థితి నెలకొంది.
ఎందుకీ సమస్య
అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో ఇందిరమ్మ పథకం ఉన్న సంగతి తెలిసిందే. కాగా గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం పేదల ఇళ్ల నిర్మాణ పథకం గృహలక్ష్మి కింద ఒక్కో లబ్ధిదారుకు రూ.3 లక్షల ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. అయితే కాంగ్రెస్ పార్టీ దానిని ఇందిరమ్మ పథకంగా మార్చి ఆర్థిక సాయాన్ని రూ.5 లక్షలకు పెంచి ప్రకటించింది. అంటే అర్హులైన ప్రతి లబ్ధిదారుకు రూ.5 లక్షలు అందిస్తారన్నదే ఆ ప్రకటన సారాంశం. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం తొలుత ప్రారంభించిన రెండు పడక గదుల ఇళ్ల పథకంలో ఒక్కో ఇంటికి దాదాపు రూ.5.20 లక్షల వరకు ఖర్చయింది.
ఆ మొత్తంతో 500 చ.అ.కు మించిన విస్తీర్ణంలో ఇళ్ల నిర్మాణం జరిగింది. లిఫ్టు వసతి లాంటి అదనపు హంగుల వల్ల జీహెచ్‌ఎంసీ పరిధిలో యూనిట్ కాస్ట్‌ను రూ.7 లక్షలుగా ఖరారు చేశారు. అయితే ఇప్పుడు ఇందిరమ్మ పథకంలో అందరికీ సమంగా రూ.5 లక్షల చొప్పున ఇస్తే, నిబంధనల ప్రకారం ఖర్చు చేస్తే డబ్బులు మిగిలి దుర్వినియోగం కింద జమకట్టే ప్రమాదం ఉంటుందని అధికారులు ఆందోళన చెందుతున్నారు. గతంలో ఇందిరమ్మ పథకంలో అక్రమాలు జరిగాయంటూ వచ్చిన ఆరోపణల్లో కూడా ఇలాంటి అంశాలే ఎక్కువగా ఉన్నాయని కొందరు గుర్తు చేస్తున్నారు.
ఆ ప్లాన్‌లు ఎలా అమలు చేస్తారు?
ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి మూడు నమూనాలు సిద్ధం చేసి, వాటి ఆధారంగా నిర్మాణం చేపడతామని గతంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. సొంత జాగాలో ఇళ్లను నిర్మించుకునే క్రమంలో ఈ నమూనాలు కూడా ఆటంకంగా మారే అవకాశం ఉందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. పేదలకు ఉండే సొంత జాగాలు అన్నీ ఒకే ఆకృతిలో ఉండే అవకాశం ఉండదు. కొన్ని పొడవుగానో, వంకర టింకరగానో ఉంటే, ప్రభుత్వం రూపొందించిన ప్లాన్ల ప్రకారం ఇళ్లను నిర్మించుకునే వీలుండదు. అప్పుడేం చేయాలనే సందేహాలు అధికారులు వ్యక్తం చేస్తున్నారు. వీటన్నింటిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని, అప్పుడే ఇందిరమ్మ ఇళ్ల పథకంపై కసరత్తు ముందుకు సాగుతుందని అంటున్నారు.
తెలంగాణ: రూ.5 లక్షలు.. 500 చ.అ. ఇల్లు!
Published Wed, Jan 17 2024 4:57 AM | Last Updated on Wed, Jan 17 2024 6:59 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment