
టాలీవుడ్ ప్రముఖులను సిటీలో చూడాలనుకుంటే.. కాస్ట్‌లీ క్లబ్‌లోనో, సగటు మనిషి తొంగిచూడలేని లగ్జరీ కేఫ్‌లోనో.. ఒక్కోసారి అనుకోకుండా మరో చోటనో తారసపడవచ్చు. కొన్ని సార్లు.. సాదా సీదా ఇడ్లీలు, దోశలు విక్రయించే టిఫిన్ సెంటర్ దగ్గర కూడా కావచ్చు. అవును మరి.. విలాస వంతమైన రెస్టారెంట్లు, ప్రత్యేకమైన క్లబ్‌లు హై–ఎండ్ కేఫ్‌లకు మాత్రమే వెళ్లడం అలవాటైన వారిని కూడా ఓ టిఫిన్ సెంటర్ రారమ్మంటోంది. అదే తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్‌లో ఉన్న రాయలసీమ శైలి ప్రత్యేకమైన అల్పాహారంతో చవులూరిస్తోంది.
పంచెకట్టు అంటే.. తెలుగింటి వస్త్రధారణ గుర్తొస్తుంది. ఈ టిఫిన్ సెంటర్ తన పేరుకు తగ్గట్టే మెనూలో సంప్రదాయం ప్రతిబింబిస్తుంది. నెయ్యి, కారం ఇడ్లీ, కారం పాళ్యం దోసె, ఉల్లి, నెయ్యి కారం దోశ, నన్నారి ఫిల్టర్ కాఫీ వంటి వెరైటీలే ఇక్కడ ఉంటాయి. ఇక దోశల తయారీ చూడటం ఒక చక్కటి అనుభవం. ప్రతి దోశనూ తక్కువ మంటపై రెండు వైపులా దోరగా కాల్చి, నెయ్యి పోసి, కారం పొడితో ప్లేట్లో ఉంచుతారు. పల్య (బంగాళదుంప కూర), టాంగీ మిరపకాయ చట్నీ క్లాసిక్ కొబ్బరి చట్నీతో కలిపి వడ్డిస్తారు.
అలా మిస్సై.. ఇలా క్లిక్కై..
తాడిపత్రి మా సొంతూరు. అక్కడి నుంచి నగరానికి ఐటీ ఉద్యోగం రీత్యా వచ్చాం.. మా ప్రాంతపు వంటకాలను బాగా మిస్సయ్యేవాడిని. నాలాంటి ఫీలింగ్ మరికొందరిలోనూ చూశాక.. 2019లో ఒక ఫుడ్ ట్రక్ స్టార్ట్ చేశాను. పంచెకట్టుతో దోశలు వేయడం, తినడం మా ప్రాంతంలో సర్వసాధారణం. అందుకే ఆ పేరు పెట్టాను.
అనంతరం నగరవాసుల ఆదరాభిమానాలతో పూర్తి స్థాయి రెస్టారెంట్‌గా మార్చాను. ఇడ్లీ, దోశలతో పాటు ఉప్మా, పొంగలి.. వంటి అల్పాహారాలు అందిస్తున్నాం. నెయ్యి, మసాలా తదితర ముడి దినుసులతో సహా చాలా వరకూ రాయలసీమ నుంచే తీసుకొచ్చి స్థానిక ఫ్లేవర్ మిస్ అవ్వకుండా జాగ్రత్తలు పాటిస్తున్నాం.
– నాగాభరణ్, పంచెకట్టు దోసె నిర్వాహకులు
టాలీవుడ్ ఫేవరెట్ స్పాట్..
తొలుత ఫుడ్ ట్రక్‌గా ప్రారంభమైన పంచెకట్టు దోశ, ఇప్పుడు నగరం చుట్టూ నాలుగు శాఖలకు విస్తరించింది. దీని కస్టమర్లుగా టాలీవుడ్ సెలబ్రిటీలైన ప్రముఖ దర్శకుడు రాజమౌళి, సంగీత దర్శకులు కీరవాణి, హీరో సిద్ధార్థ, నటుడు మురళీ శర్మ, నటి లక్ష్మి మంచు తదితరులతో పాటు బ్యూటీ క్వీన్ మానుషి చిల్లర్, మేఘాంశ్ శ్రీహరి, గాయకుడు మనో, దర్శకుడు పరశురామ్ కూడా ఉన్నారు. బంజారాహిల్స్, మాదాపూర్, ప్రగతి నగర్ కొండాపూర్‌లలో పంచెకట్టు దోశ సెంటర్లు ఉన్నాయి.
(చదవండి: అరుదైన కేసు: ఆ తల్లి కవలలకు జన్మనిచ్చింది..అయితే డీఎన్‌ఏ టెస్ట్‌లో..!)
Comments
Please login to add a commentAdd a comment