work inspectors
-
వర్క్ ఇన్స్పెక్టర్ల నియామకం
అనంతపురం టౌన్ : గృహ నిర్మాణ సంస్థలో జిల్లా వ్యాప్తంగా 42 మంది వర్క్ ఇన్స్పెక్టర్లను నియమించారు. జిల్లాకు ఎన్టీఆర్ రూరల్, హౌసింగ్ ఫర్ ఆల్ కింద ఇళ్లు మంజూరైనా క్షేత్రస్థాయిలో పురోగతి లేని నేపథ్యంలో వర్క్ఇన్స్పెక్టర్ల కొరత.. మందకొడిగా సాగుతున్న నిర్మాణాలపై డిసెంబర్ 9న ‘నిర్మాణమెలా?’ శీర్షికతో సాక్షి ప్రచురించిన కథనంపై స్పందించిన కలెక్టర్ కోన శశిధర్ హౌసింగ్ అధికారులతో సమీక్ష చేశారు. ఓ ప్రైవేట్ ఏజెన్సీతో నియామకాలు చేపట్టాలని చూసినా అది సాధ్యం కాలేదు. జిల్లాలో నెలకొన్న పరిస్థితి మేనేజింగ్ డైరెక్టర్ దృష్టికి వెళ్లింది. అక్కడి నుంచి సానుకూలంగా నిర్ణయం రావడంతో కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రశాంతి జిల్లా సమాఖ్య ద్వారా ఔట్సోర్సింగ్ కింద 42 మంది వర్క్ ఇన్స్పెక్టర్లను తీసుకున్నారు. శుక్రవారం వీరంతా విధుల్లో చేరారు. మరో 28 మందిని కూడా త్వరలోనే తీసుకోనున్నట్లు తెలుస్తోంది. -
ఉద్యోగాలు ఊడగొట్టారు..!
- కలెక్టరేట్ ఎదుట వర్క్ ఇన్స్పెక్టర్ల ధర్నా కర్నూలు (న్యూసిటీ): టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే జాబు వస్తుందని ఆ పార్టీ నేతలు నమ్మబలికి..అధికారంలోకి వచ్చాక ఉన్న ఉద్యోగాలు ఊడగొట్టారని ఏపీ రాష్ట్ర గృహనిర్మాణ వర్క్ఇన్స్పెక్టర్ల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు వి.హనుమన్న విమర్శించారు. గృహనిర్మాణ శాఖలో తొలగించిన వర్క్ఇన్స్పెక్టర్లను విధుల్లోకి తీసుకోవాలని బుధవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. అంతకు ముందు గృహ నిర్మాణ శాఖ కార్యాలయం నుంచి గాయత్రి ఎస్టేట్ మీదుగా కలెక్టరేట్ వరకు ర్యాలీగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మెగా కన్సల్టెన్సీ ద్వారా కొత్తగా వర్క్ఇన్స్పెక్టర్ల నియామకానికి ఇచ్చిన నోటిఫికేషన్ నిలిపివేయాలన్నారు. ఎన్నికలకు ముందు కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారని, రెగ్యులర్ చేయకపోగా, రోడ్డుపైన పడేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ధర్నాలో వర్క్ఇన్స్పెక్టర్లు విల్సన్‌బాబు, పుల్లయ్య, విజయ్, చెన్నయ్య, కవిత, వరలక్ష్మి, పద్మ, సునీత, గిరిజ, రవి, వెంకటేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. -
కక్కుర్తి ‘వర్క్’!
- పీఆర్లో వర్క్ ఇన్స్పెక్టర్ల ఇష్టారాజ్యం - క్షేత్రస్థాయి పనులన్నీ వారి కనుసన్నల్లోనే.. - కమీషన్ ఇవ్వాలని కూలీలకు బెదిరింపులు సాక్షిప్రతినిధి, ఖమ్మం: పంచాయతీరాజ్ శాఖలో ఏళ్ల తరబడి ఒకేచోట పనిచేస్తున్న వర్క్ ఇన్స్పెక్టర్లలో కొందరు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీర్ఘకాలంగా వీరికి బదిలీలు లేకపోవడంతో ఏఈలను కూడా కాదని వీరి కనుసన్నల్లోనే కాంట్రాక్టర్లు పనులు చేస్తున్నారు. పనులపై పర్యవేక్షణ వదిలి.. కాంట్రాక్టు కమీషన్ల మీదే వీరి దృష్టి ఉన్నట్లు ఆరోపణలున్నాయి. పనులు చేసే కూలీలు కూడా తమకు కమీషన్ ఇవ్వాలని బెదిరిస్తుండటంతో ఓ మండలంలోని కూలీలు ఏకంగా కలెక్టర్ దృష్టికి సమస్యను తీసుకెళ్లాలని నిర్ణయించినట్లు సమాచారం. వరంలా మారిన ఏఈల బదిలీలు.. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు జిల్లా పంచాయతీరాజ్ శాఖలో 454 పనులకు.. రూ.336.26కోట్లు మంజూరయ్యాయి. గ్రామాల్లో ఈ పనులన్నీ పలు దశల్లో పురోగతిలో ఉన్నాయి. రోడ్లు, డ్రెయినేజీలు, బ్రిడ్జిలు, భవన నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. క్షేత్రస్థాయిలో పనుల పర్యవేక్షణ బాధ్యత ప్రధానంగా ఆయా మండలాల ఏఈలది. ఏఈల బదిలీలు జరుగుతుండటంతో ఆ మండలాల్లో ఐదు నుంచి పదేళ్ల వరకు దీర్ఘకాలికంగా తిష్టవేసిన కొందరు వర్క్ ఇన్స్పెక్టర్లు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. పంచాయతీ రాజ్ శాఖతోపాటు నాబార్డు, పీఎంజీఎస్‌వై ఇతర పథకాల నుంచి గ్రామాలకు మంజూర య్యే నిధులతో చేపట్టే పనులు ఈ శాఖ పరిధిలోనే జరుగుతాయి. పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్లు వర్క్ఇన్స్పెక్టర్ల పర్యవేక్షణలో పనులు చేస్తున్నట్లు సమాచారం. ఏఈలను తోసిరాజని కాంట్రాక్టర్లతో వర్క్ ఇన్స్పెక్టర్లు సంబంధాలు పెట్టుకుని.. పనుల నాణ్యతకు తిలోదకాలిచ్చి.. కమీషన్లు పుచ్చుకుంటున్నట్లు సమాచారం. ఇది చాలదన్నట్లు పనులు చేసే కూలీల నుంచి కూడా నెలకు తమకింత ఇవ్వాలని బెదిరిస్తున్నట్లు తెలిసింది. ఓ ఇద్దరు వర్క్ ఇన్స్పెక్టర్లు ఏకంగా బినామీ ముసుగులో చిన్న చిన్న కాంట్రాక్టులు కూడా దక్కించుకుని పను లు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఖమ్మం డివిజన్లోని ఓ మండలానికి చెందిన వర్క్ ఇన్స్పెక్టర్ ఇలా కూలీలకు రోజువారీ ఇచ్చే వేతనంలో తనకు రూ.50 ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు సమాచారం. దీనికి కూలీలు ససేమిరా అనడంతో.. మీరు అధికార పార్టీకి చెందిన కూలీలు కాదని, ఆ పార్టీకి చెందిన కూలీలనే పనిలో పెట్టుకుంటామని సదరు కూలీలకు చెప్పారు. ఆ కూలీలంతా తమ పొట్టకొట్టొద్దని.. పక్క మండలంలో ఉన్న అధికార పార్టీ నేతను ఆశ్రయించి సదరు వర్క్ ఇన్స్పెక్టర్కు నచ్చజెప్పినా.. ససేమిరా అనడం గమనార్హం. కూలీ వేతనంలో తమ నుంచి కమీషన్ అడిగిన సదరు వర్క్ ఇన్స్పెక్టర్పై వారు గ్రీవెన్స్‌లో కలెక్టర్‌కు ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. -
జాబ్ పోయిందంటూ బాబు జాబు!
- హౌసింగ్‌లో వర్క్ ఇన్స్పెక్టర్ల తొలగింపునకు రంగం సిద్ధం - ఆలస్యం కానున్న ఇంటి నిర్మాణాలు బద్వేలు: చంద్రబాబు అధికారంలోకి వస్తే జాబ్ వస్తుందంటూ టీడీపీ నేతలు ఎన్నికల సమయంలో ఊదరగొట్టారు. అయితే హౌసింగ్‌లో వర్క్ ఇన్స్పెక్టర్ల సంగతి తీసుకుంటే తీరా వచ్చింది జాబ్ కాదు ఉద్యోగాలు పోయాయంటూ జాబు వచ్చింది. జిల్లాలోని 51 మండలాల్లో 86 మంది ఔట్ సోర్సింగ్ కింద వర్క్ ఇన్స్పెక్టర్లు విధులు నిర్వహిస్తున్నారు. వీరందరూ ఆయా మండలాల్లో ఏఈలకు సహకారమందిస్తున్నారు. సిబ్బంది కొరతతో ఇక్కట్లే ప్రస్తుతం జిల్లాలో దాదాపు 60వేలకు పైగా ఇళ్ల నిర్మాణంలో ఉన్నాయి. వీటిలో 40 వేలు బేస్మట్టం, గోడలు, పైకప్పు వంటి దశల్లో ఉన్నాయి. వీటకి ఈ ఏడాది మార్చి నుంచి బిల్లులు ఆగిపోయాయి. దీంతో పాటు 24 వేల ఇళ్లపై సమగ్ర సర్వే చేస్తున్నారు. ఇంకా 8600 ఇళ్లు రేషన్‌కార్డుతో మ్యాచ్ కాలేదు. ఇవన్నీ ఆయా దశల్లో పూర్తిగా నిలిచిపోయాయి. మరో 9500 ఇళ్లు పూర్తిగా పునాదులు, బేస్‌మట్టంలో ఆగిపోయాయి. వీటన్నింటిని సర్వే చేసి బిల్లులు అందజేయాలి. ప్రస్తుతం వర్క్ ఇన్స్పెక్టర్లను తొలగించడంతో మండలానికి ఉన్న ఒకే ఒక ఏఈ అన్ని పనులను చేయడం సాధ్యం కాదు. దీంతో ఇప్పట్లో బిల్లులు అందే పరిస్థితులు కానరావడం లేదు. న్యాయం చేయాలంటున్న బాధితులు తాము ఏళ్ల తరబడి సంస్థలో విధులు నిర్వహిస్తున్నామని.. వయోపరిమితి దాటిపోయినందున ఇతర ఉద్యోగాలకు అర్హత కోల్పోయామని పలువురు వర్స్ ఇన్స్పెక్టర్లు వాపోతున్నారు. లబ్ధిదారులకు ఇనుము, సిమెంట్, ఇటుకలు అప్పు ఇప్పించామని, బిల్లులు ఆగిపోవడంతో వ్యాపారులు మమ్మల్ని ఒత్తిడి చేస్తున్నారని బద్వేలుకు చెందిన ఒక వర్క్ఇన్స్పెక్టర్ ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు తమకు న్యాయం చేయాలని వారు కోరుతున్నారు. -
ఇష్టారాజ్యం!
ఐదేళ్లనుంచి విధులకు రాకుండా జీతం తీసుకుంటున్న లష్కర్లు...ఇదేబాటలో నడుస్తున్న మరో ఇద్దరు వర్క్ఇన్స్పెక్టర్లు...ఈ తతంగమంతా తెలిసీ చూసీచూడనట్లు వ్యవహరిస్తున్న అధికారులు... ఇదేంటని ఆరా తీస్తే... అందరికీ పక్షవాతం వచ్చిందని అందుకే వారు ఇంటి వద్ద ఉండి విధులు మరొకరితో చేయిస్తున్నారని చెప్పే ఉన్నతాధికారులు... ఇలా న డుస్తోంది కేసీ కెనాల్లో పరిపాలనా వ్యవహారం. ఏ కాలువకు నీళ్లు వదులుతున్నారో... ఎక్కడ రైతులు ఇబ్బంది పడుతున్నారో వీరికి పని లేదు. చుట్టపుచూపుగా కార్యాలయానికి వచ్చామా? వెళ్లామా? అనేదొక్కటే వీరి రోజువారీ విధి నిర్వహణ. సాక్షి, కడప: కేసీ కెనాల్ మైదుకూరు సబ్‌డివిజన్ పరిధిలో 71 కిలోమీటర్ల మేర ప్రధాన కాలువ ఉంది. చాపాడు కాలువ మరో 40 కిలోమీటర్లు ఉంది. ఇవి కాకుండా సబ్కెనాల్స్ చాలానే ఉన్నాయి. కర్నూలు జిల్లా చాగలమర్రి నుంచి వైఎస్సార్ జిల్లా పాతకడప చెరువుదాకా ప్రధాన కాలువ ఉంది. దీన్ని నమ్ముకుని వేల ఎకరాల ఆయక ట్టు సాగవుతోంది. ఈ కాలువ పరిధిలో 78మంది లష్కర్లు ఉన్నారు. వీరిలో 20మంది ప్రభుత్వ ఉద్యోగులు. తక్కిన 58మంది ఔట్సోర్సింగ్ సిబ్బంది. వీరిలో 13 మంది విధినిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఐదుగురు ప్రభుత్వ ఉద్యోగులు ఐదేళ్లుగా కాలువకట్టపై నడవకుండా వేతనాలు తీసుకుంటున్నారు. మరో 8మంది కొన్ని నెలలుగా విధినిర్వహణలో అలసత్వంగా వ్యవహరిస్తున్నారు. విధులకు గైర్హాజరవుతూ ఉన్న 8మంది ఔట్సోర్సింగ్ లష్కర్లను అధికారులు తొలగించారు. అయితే ప్రభుత్వ ఉద్యోగులను పట్టించుకోలేదు. వీరిలో నరసింహారెడ్డి, అబ్దుల్ రెహమాన్‌తో పాటు విజయలక్ష్మి, సంటెమ్మ, ఖాతుంబీ అనే మహిళలు ఉన్నారు. వీరిలో అందరికీ 10ఏళ్లు పైబడి అనుభవం ఉంది. కొందరు రిటైర్మెంట్ దగ్గరలో ఉన్నారు. అయినా వీరు విధులకు రావడం లేదు. వీరితో పాటు ప్రసాద్, వెంకటసుబ్బయ్య అనే వర్క్ఇన్స్పెక్టర్లు కూడా విధులకు హాజరుకావడం లేదని తెలిసింది. అలాగే మరికొంతమంది లష్కర్లు, వర్క్ఇన్స్పెక్టర్లు కూడా విధినిర్వహణలో అలసత్వం వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదేంటని ఉన్నతాధికారులను ఆరాతీస్తే పక్షవాతం కారణంగా చాలామంది విధులకు రావడం లేదని, అయితే వారి స్థానంలో మరొకరిని నియమించి వారు విధులు నిర్వహించేలా చూస్తున్నారని ఉన్నతాధికారులు చెబుతున్నారు. సంటెమ్మ, ఖాతూంబీ, నరసింహారెడ్డి అనే లష్కర్లతో పాటు ప్రసాద్ అనే వర్క్ఇన్స్పెక్టర్ కలిపి నలుగురికి పక్షవాతమని చెబుతున్నారు. అలాగే అబ్దుల్‌రెహమాన్ అనే మరో లష్కర్ విగ్రహాల దొంగతనం కేసులో నిందితుడు. ఈయనా విధులకు హాజరుకావడం లేదని తెలుస్తోంది. అలాగే మరో లష్కర్ రెండేళ్ల కిందట ఉద్యోగ విరమణ పొందితే ఇప్పటి వరకూ ప్రొద్దుటూరులోని కేసీ కెనాల్ గెస్ట్‌హౌస్‌లో కొనసాగుతున్నారు. ఈ తతంగమంతా సబ్‌డివిజన్‌లోని ఉన్నతాధికారులందరికీ తెలుసు. అలాగే ఏఈలు, వర్క్ఇన్స్పెక్టర్లు టీఏ, డీఏల విషయంలో కూడా చేతివాటం ప్రదర్శిస్తున్నట్లు తెలుస్తోంది. కాలువపైకి వెళ్లకపోయినా వెళ్లినట్లు బిల్లులు చేసుకుంటున్నారనే సమాచారం. ఇలా ఒక్కొక్కరు 3-5వేల రూపాయల వరకూ బిల్లులు డ్రా చేసుకుంటున్నారు. ఆయకట్టును పట్టించుకునేదెవరు?: వీరంతా ఇలా వ్యవహరిస్తోంటే కాలువపై ఆధారపడి సాగుచేసే ఆయకట్టును ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. రాత్రి వేళల్లో రైతులే వచ్చి గేట్ల తూములు తెరుచుకుని వెళుతున్నారు. ఈ సందర్భంలో ఒక రైతు ఎక్కువగా తెరుచుకుని వెళితే మరో రైతు అడ్డగించడం వంటి చర్యలతో రైతుల మధ్య గొడవలు తలెత్తుతున్నాయి. నీటిని సక్రమంగా సరఫరా చేయడంలో లష్కర్లు సరైన చర్యలు తీసుకోవడం లేదు. వర్క్ఇన్స్పెక్టర్ విధులు కూడా మరొకరు నిర్వహిస్తున్నారని ఉన్నతాధికారులు చెబుతుంటే అక్కడ పరిస్థితి ఎలా ఉందో ఇట్టే తెలుస్తోంది. నిజమే...కానీ..!: నూర్‌బాషా, డీఈ, మైదుకూరు సబ్‌డివిజన్ కొందరు లష్కర్లు విధులకు రాకుండా ఉండటం వాస్తవమే. వీరిలో కొందరు పక్షవాతంతో బాధపడుతున్నారు. దాంతో వారి స్థానంలో మరొకరిని నియమించి పనిచేయిస్తున్నారు. ప్రసాద్ అనే వర్క్ఇన్స్పెక్టర్దీ అదే పరిస్థితి. వెంకటసుబ్బయ్య విధులకు వస్తున్నాడు. ఆయకట్టు మొత్తం లష్కర్లు పర్యవేక్షిస్తున్నారు. ప్రతి ఎకరాకు నీరందించే ప్రయత్నం చేస్తున్నాం. టీఏ,డీఏలు కాస్త ఎక్కువగా పెట్టుకుంటున్నారేమోగానీ, కాలువపైకి వెళ్లకుండా పెట్టుకుంటున్నారనేది సరికాదు. నేను కూడా కొత్తగా వచ్చాను. ప్రొద్దుటూరు గెస్ట్‌హౌస్‌లోని వ్యక్తిని ఖాళీ చేయించాలని ఏఈకి చెప్పాను. రెహమాన్ విగ్రహాల కేసులో నిందితుడే. ఎఫ్ఐఆర్ నమోదైతే రిపోర్ట్ చేస్తాం. -
రోడ్డెక్కిన విభేదాలు
సాక్షి, నెల్లూరు: రోడ్లు, భవనాల శాఖలోని అధికారుల మధ్య నెలకొన్న వర్గవిభేదాలు ఒక్కసారిగా రోడ్డునపడ్డాయి. అధికారుల అండతో కొందరు వర్క్ఇన్స్పెక్టర్లు ఏళ్ల తరబడి బదిలీ కాకుండా ఒకే చోట మకాం వేయడాన్ని మరోవర్గం వారు జీర్ణించుకోలేకపోయారు. ఈ వ్యవహారంపై ఆ శాఖ ఇంజనీరింగ్ ఇన్ చీఫ్(ఈఎన్సీ)కి ఫిర్యాదు చేయడంతో ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఆర్అండ్బీ క్వాలిటీ కంట్రోల్ విభాగం ఎస్ఈ(రాయలసీమ, నెల్లూరు జిల్లాలు) వివేకానందరెడ్డి సోమవారం ఆర్అండ్బీ కార్యాలయంలో విచారణ చేపట్టడంతో విభేదాల గుట్టురట్టయింది. ఏళ్ల తరబడి ఒకే చోట జిల్లాకు చెందిన ఆనం రామనారాయణరెడ్డి రాష్ట్ర ఆర్థిక మంత్రిగా ఉండటంతో నెల్లూరు నగరంలో ఇబ్బడిముబ్బడిగా రోడ్ల నిర్మాణం చేపట్టారు. రోడ్డు మీద రోడ్డు వేస్తుండటంతో కాంట్రాక్టర్లతో పాటు కొందరు అధికారులకు కాసుల వర్షం కురుస్తోంది. ఈ క్రమంలో కొందరు వర్క్ఇన్ స్పెక్టర్లు ఉన్నతాధికారులు, అధికార పార్టీ నేతల అండతో ఏళ్లతరబడి నెల్లూరులోనే తిష్టవేశారు. జిల్లాలోని మూడు డివిజన్లు, 10 సబ్డివిజన్లలో 60 మంది వర్క్ఇన్స్పెక్టర్లు ఉండగా వీరిలో 25 మంది నెల్లూరులోనే విధులు నిర్వర్తిస్తుండటం గమనార్హం. కొందరు 18 ఏళ్లుగా ఒకే చోట తిష్టవేయడం విశేషం. పలువురు ఓవైపు సొంత వ్యాపారాలు చేసుకుంటూ, మరోవైపు 20 శాతం హెచ్ఆర్ఏ పొందుతున్నారు. పనుల వద్దకు వెళ్లి పర్యవేక్షించకపోవడంతో పాటు నకిలీ సర్టిఫికెట్లు సమర్పించి పదోన్నతులు కూడా పొందినట్లు ఈఎన్సీకి ఫిర్యాదులు అందినట్లు తెలిసింది. ఇదిలా ఉంటే కొందరిని మాత్రం ఐదేళ్లు పూర్తికాకుండానే బదిలీ చేస్తుండటం విమర్శలకు తావిస్తోంది. అధికార పార్టీ నేతల ఆదేశాల మేరకు కొందరు ఉన్నతాధికారులే ఈ విధంగా బదిలీ చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. యూనియన్ల పేరుతో.. కొందరు అధికారులు, వర్క్ఇన్స్పెక్టర్లు కుమ్మక్కై అక్రమాలకు పాల్పడుతూ మొత్తం తతంగం నడుపుతున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఓ వైపు యూనియన్ల పేరుతో, మరోవైపు అధికార పార్టీ నేతల అండతో చాలా మంది వర్క్ఇన్స్పెక్టర్లు బదిలీ చేసినా వెళ్లడం లేదని, నేతలతో ఒత్తిడి తెస్తున్నారని ఆర్అండ్బీ ఉన్నతాధికారులే పేర్కొంటున్నారు. మిగిలిన వారు కూడా నెల్లూరులోనే ఉండి పనుల పర్యవేక్షణకు వెళ్లడంలేదని, ఏమని అడిగితే యూనియన్ల పేరుతో బెదిరిస్తున్నారని ఓ అధికారి వాపోయారు. అధికారులే నాటకాలు ఆడుతున్నారని, తమకు అనుకూలంగా ఉండి సొంత పనులు చేసిపెట్టేవారిని ఏళ్ల తరబడి బదిలీ చేయకుండా ఇక్కడే ఉంచుతున్నారని, మిగిలిన వారిని వేధిస్తూ ఐదేళ్లు పూర్తికాకముందే అక్రమంగా బదిలీ చేస్తున్నారని ఓ వర్క్ఇన్స్పెక్టర్ ఆరోపించాడు. విచారణ..ఫిర్యాదుల స్వీకరణ అధికారులు, వర్క్ఇన్స్పెక్టర్లు గ్రూపులుగా విడిపోవడంతో ఆర్అండ్బీ శాఖలోని విభేదాలు ముదిరిపాకాన పడ్డాయి. ఓ వర్గం వారు ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ విభాగంతో పాటు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. స్పందించిన ప్రభుత్వం ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి నివేదిక పంపాలంటూ క్వాలిటీ కంట్రోల్ ఎస్ఈ వివేకానందరెడ్డిని ఆదేశించింది. ఆయన క్వాలిటీ కంట్రోల్ ఈఈ మురళీకృష్ణతో కలిసి సోమవారం నెల్లూరులోని రోడ్ల భవనాల శాఖ కార్యాలయంలో ఉదయం నుంచి సాయంత్రం వరకూ విచారణ నిర్వహించారు. జిల్లాలో వర్క్ఇన్స్పెక్టర్లు ఎక్కడ పని చేస్తున్నది? నెల్లూరు పరిధిలో ఎంత మంది పనిచేస్తున్నారు? ఎన్ని ఏళ్లుగా బదిలీ లేకుండా ఇక్కడే ఉన్నారు? అనే విషయాలపై విచారణ జరిపి వివరాలు సేకరించారు. అదే సమయంలో అధికారులపై కొందరు వర్క్ ఇన్స్పెక్టర్లు ఇచ్చిన ఫిర్యాదులను సైతం స్వీకరించినట్లు సమాచారం.