ఐదేళ్లనుంచి విధులకు రాకుండా జీతం తీసుకుంటున్న లష్కర్లు...ఇదేబాటలో నడుస్తున్న మరో ఇద్దరు వర్క్‌ఇన్‌స్పెక్టర్లు...ఈ తతంగమంతా తెలిసీ చూసీచూడనట్లు వ్యవహరిస్తున్న అధికారులు... ఇదేంటని ఆరా తీస్తే... అందరికీ పక్షవాతం వచ్చిందని అందుకే వారు ఇంటి వద్ద ఉండి విధులు మరొకరితో చేయిస్తున్నారని చెప్పే ఉన్నతాధికారులు... ఇలా న డుస్తోంది కేసీ కెనాల్‌లో పరిపాలనా వ్యవహారం. ఏ కాలువకు నీళ్లు వదులుతున్నారో... ఎక్కడ రైతులు ఇబ్బంది పడుతున్నారో వీరికి పని లేదు. చుట్టపుచూపుగా కార్యాలయానికి వచ్చామా? వెళ్లామా? అనేదొక్కటే వీరి రోజువారీ విధి నిర్వహణ.
సాక్షి, కడప: కేసీ కెనాల్ మైదుకూరు సబ్‌డివిజన్ పరిధిలో 71 కిలోమీటర్ల మేర ప్రధాన కాలువ ఉంది. చాపాడు కాలువ మరో 40 కిలోమీటర్లు ఉంది. ఇవి కాకుండా సబ్‌కెనాల్స్ చాలానే ఉన్నాయి. కర్నూలు జిల్లా చాగలమర్రి నుంచి వైఎస్సార్ జిల్లా పాతకడప చెరువుదాకా ప్రధాన కాలువ ఉంది. దీన్ని నమ్ముకుని వేల ఎకరాల ఆయక ట్టు సాగవుతోంది. ఈ కాలువ పరిధిలో 78మంది లష్కర్లు ఉన్నారు. వీరిలో 20మంది ప్రభుత్వ ఉద్యోగులు.
తక్కిన 58మంది ఔట్‌సోర్సింగ్ సిబ్బంది. వీరిలో 13 మంది విధినిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఐదుగురు ప్రభుత్వ ఉద్యోగులు ఐదేళ్లుగా కాలువకట్టపై నడవకుండా వేతనాలు తీసుకుంటున్నారు. మరో 8మంది కొన్ని నెలలుగా విధినిర్వహణలో అలసత్వంగా వ్యవహరిస్తున్నారు. విధులకు గైర్హాజరవుతూ ఉన్న 8మంది ఔట్‌సోర్సింగ్ లష్కర్లను అధికారులు తొలగించారు. అయితే ప్రభుత్వ ఉద్యోగులను పట్టించుకోలేదు. వీరిలో నరసింహారెడ్డి, అబ్దుల్ రెహమాన్‌తో పాటు విజయలక్ష్మి, సంటెమ్మ, ఖాతుంబీ అనే మహిళలు ఉన్నారు.
వీరిలో అందరికీ 10ఏళ్లు పైబడి అనుభవం ఉంది. కొందరు రిటైర్మెంట్ దగ్గరలో ఉన్నారు. అయినా వీరు విధులకు రావడం లేదు. వీరితో పాటు ప్రసాద్, వెంకటసుబ్బయ్య అనే వర్క్‌ఇన్‌స్పెక్టర్లు కూడా విధులకు హాజరుకావడం లేదని తెలిసింది. అలాగే మరికొంతమంది లష్కర్లు, వర్క్‌ఇన్‌స్పెక్టర్లు కూడా విధినిర్వహణలో అలసత్వం వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదేంటని ఉన్నతాధికారులను ఆరాతీస్తే పక్షవాతం కారణంగా చాలామంది విధులకు రావడం లేదని, అయితే వారి స్థానంలో మరొకరిని నియమించి వారు విధులు నిర్వహించేలా చూస్తున్నారని ఉన్నతాధికారులు చెబుతున్నారు.
సంటెమ్మ, ఖాతూంబీ, నరసింహారెడ్డి అనే లష్కర్లతో పాటు ప్రసాద్ అనే వర్క్‌ఇన్‌స్పెక్టర్ కలిపి నలుగురికి పక్షవాతమని చెబుతున్నారు. అలాగే అబ్దుల్‌రెహమాన్ అనే మరో లష్కర్ విగ్రహాల దొంగతనం కేసులో నిందితుడు. ఈయనా విధులకు హాజరుకావడం లేదని తెలుస్తోంది. అలాగే మరో లష్కర్ రెండేళ్ల కిందట ఉద్యోగ విరమణ పొందితే ఇప్పటి వరకూ ప్రొద్దుటూరులోని కేసీ కెనాల్ గెస్ట్‌హౌస్‌లో కొనసాగుతున్నారు. ఈ తతంగమంతా సబ్‌డివిజన్‌లోని ఉన్నతాధికారులందరికీ తెలుసు. అలాగే ఏఈలు, వర్క్‌ఇన్‌స్పెక్టర్లు టీఏ, డీఏల విషయంలో కూడా చేతివాటం ప్రదర్శిస్తున్నట్లు తెలుస్తోంది. కాలువపైకి వెళ్లకపోయినా వెళ్లినట్లు బిల్లులు చేసుకుంటున్నారనే సమాచారం. ఇలా ఒక్కొక్కరు 3-5వేల రూపాయల వరకూ బిల్లులు డ్రా చేసుకుంటున్నారు.
ఆయకట్టును పట్టించుకునేదెవరు?:
వీరంతా ఇలా వ్యవహరిస్తోంటే కాలువపై ఆధారపడి సాగుచేసే ఆయకట్టును ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. రాత్రి వేళల్లో రైతులే వచ్చి గేట్ల తూములు తెరుచుకుని వెళుతున్నారు. ఈ సందర్భంలో ఒక రైతు ఎక్కువగా తెరుచుకుని వెళితే మరో రైతు అడ్డగించడం వంటి చర్యలతో రైతుల మధ్య గొడవలు తలెత్తుతున్నాయి. నీటిని సక్రమంగా సరఫరా చేయడంలో లష్కర్లు సరైన చర్యలు తీసుకోవడం లేదు. వర్క్‌ఇన్‌స్పెక్టర్ విధులు కూడా మరొకరు నిర్వహిస్తున్నారని ఉన్నతాధికారులు చెబుతుంటే అక్కడ పరిస్థితి ఎలా ఉందో ఇట్టే తెలుస్తోంది.
నిజమే...కానీ..!: నూర్‌బాషా, డీఈ, మైదుకూరు సబ్‌డివిజన్
కొందరు లష్కర్లు విధులకు రాకుండా ఉండటం వాస్తవమే. వీరిలో కొందరు పక్షవాతంతో బాధపడుతున్నారు. దాంతో వారి స్థానంలో మరొకరిని నియమించి పనిచేయిస్తున్నారు. ప్రసాద్ అనే వర్క్‌ఇన్‌స్పెక్టర్‌దీ అదే పరిస్థితి. వెంకటసుబ్బయ్య విధులకు వస్తున్నాడు. ఆయకట్టు మొత్తం లష్కర్లు పర్యవేక్షిస్తున్నారు. ప్రతి ఎకరాకు నీరందించే ప్రయత్నం చేస్తున్నాం. టీఏ,డీఏలు కాస్త ఎక్కువగా పెట్టుకుంటున్నారేమోగానీ, కాలువపైకి వెళ్లకుండా పెట్టుకుంటున్నారనేది సరికాదు. నేను కూడా కొత్తగా వచ్చాను. ప్రొద్దుటూరు గెస్ట్‌హౌస్‌లోని వ్యక్తిని ఖాళీ చేయించాలని ఏఈకి చెప్పాను. రెహమాన్ విగ్రహాల కేసులో నిందితుడే. ఎఫ్‌ఐఆర్ నమోదైతే రిపోర్ట్ చేస్తాం.
ఇష్టారాజ్యం!
Published Wed, Nov 20 2013 2:52 AM | Last Updated on Sat, Sep 2 2017 12:46 AM
Advertisement