ఉద్యోగాలు ఊడగొట్టారు..!
Published Wed, Nov 30 2016 11:22 PM | Last Updated on Fri, Aug 10 2018 8:23 PM
- కలెక్టరేట్ ఎదుట వర్క్ ఇన్‌స్పెక్టర్ల ధర్నా
కర్నూలు (న్యూసిటీ): టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే జాబు వస్తుందని ఆ పార్టీ నేతలు నమ్మబలికి..అధికారంలోకి వచ్చాక ఉన్న ఉద్యోగాలు ఊడగొట్టారని ఏపీ రాష్ట్ర గృహనిర్మాణ వర్క్‌ఇన్స్‌పెక్టర్ల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు వి.హనుమన్న విమర్శించారు. గృహనిర్మాణ శాఖలో తొలగించిన వర్క్‌ఇన్‌స్పెక్టర్లను విధుల్లోకి తీసుకోవాలని బుధవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. అంతకు ముందు గృహ నిర్మాణ శాఖ కార్యాలయం నుంచి గాయత్రి ఎస్టేట్ మీదుగా కలెక్టరేట్ వరకు ర్యాలీగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మెగా కన్సల్టెన్సీ ద్వారా కొత్తగా వర్క్‌ఇన్స్‌పెక్టర్ల నియామకానికి ఇచ్చిన నోటిఫికేషన్ నిలిపివేయాలన్నారు. ఎన్నికలకు ముందు కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారని, రెగ్యులర్ చేయకపోగా, రోడ్డుపైన పడేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ధర్నాలో వర్క్‌ఇన్‌స్పెక్టర్లు విల్సన్‌బాబు, పుల్లయ్య, విజయ్, చెన్నయ్య, కవిత, వరలక్ష్మి, పద్మ, సునీత, గిరిజ, రవి, వెంకటేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement