బాబు వచ్చె..జాబు పోయె.. ఢాం..ఢాం..! | Babu is back but jobs are gone | Sakshi
Sakshi News home page

బాబు వచ్చె..జాబు పోయె.. ఢాం..ఢాం..!

Published Sat, May 30 2015 12:14 AM | Last Updated on Fri, Aug 10 2018 8:13 PM

Babu is back but jobs are gone

‘‘ అధికారంలోకి రాగానే ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తాం. ఉద్యోగంలో చేరే వరకు నిరుద్యోగ భృతి మంజూరు చేస్తాం.’’ సార్వత్రిక ఎన్నికలకు ముందు నిరుద్యోగుల ఓట్లు దండుకునేందుకు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు విసిరిన  వాగ్దాన వల ఇది. టీడీపీ శ్రేణులు, తెలుగు తమ్ముళ్లు సైతం ‘జాబు కావాలంటే బాబు రావాలి’ అంటూ గోడలకు ఎక్కారు. నిరుద్యోగులను మభ్యపెట్టారు. అధికారం చేజిక్కిన తరువాత బాబు ఆ హామీలను విస్మరించారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి ఏడాది గడుస్తున్నా ఒక్క ఉద్యోగాన్నీ కల్పించలేకపోగా, ఉన్న ఉద్యోగాలకు ఎసరు పెట్టారు. నిరుద్యోగ భృతి మాటే మరిచారు.
 
 గుంటూరు ఎడ్యుకేషన్ : టీడీపీ అధికారంలోకి వస్తే ఉద్యోగాలు వస్తాయని ఆశపడిన నిరుద్యోగులకు నిరాశే ఎదురైంది. ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలకు సంబంధించిన సమాచారాన్ని నిరుద్యోగులకు చేరవేసి ఉద్యోగాలను భర్తీ చేయాల్సిన జిల్లా ఉపాధి కార్యాలయం జాబ్ మేళాలు నిర్వహిస్తూ ప్రైవేటు ఉద్యోగాలను భర్తీ చేసే దళారీగా మారింది.
 
 రాష్ట్ర విభజన తరువాత ఆంధ్రప్రదేశ్ పబ్లిక సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) ఏ ఒక్క నోటిఫికేషన్ విడుదల చేయలేదు. నూతన రాష్ట్రంలోని 13 జిల్లాల పరిస్థితులకు అనుగుణంగా ఏపీపీఎస్సీని పునర్ వ్యవస్థీకరించి, నోటిఫికేషన్లు విడుదల చేయాల్సిన ప్రభుత్వం ఆ దిశగా చర్యలు  చేపట్టడంలో విఫలమైంది. ఫలితంగా నోటిఫికేషన్లు కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులు కుటుంబాలకు ఆర్థిక అండ కల్పించలేక, తల్లిదండ్రులకు భారంగా మారామనే ఆవేదనతో కుంగిపోతున్నారు.
 
 జిల్లాలో లక్షమందికి పైగా నిరుద్యోగులు ...
 జిల్లాలో లక్ష మందికి పైగా నిరుద్యోగులు ఉన్నారు. గత ఏప్రిల్ వరకు నమోదైన నిరుద్యోగులు 52,676 మంది అని జిల్లా ఉపాధి కార్యాలయ లెక్కలు చెబుతున్నాయి. జిల్లాలో ఏటా 30 వేల మంది కొత్తగా డిగ్రీ పట్టాలు చేతపుచ్చుకుని ఉద్యోగ అన్వేషణలో నిమగ్నమవుతున్నారు. నిరుద్యోగుల్లో ఎక్కువ మంది గ్రామీణ ప్రాంతాల్లోని నిరుపేద, మధ్య తరగతి వ్యవసాయ కుటుంబాలకు చెందిన వారే ఉన్నారు.
 
 ఐదు వేల మంది ఉద్యోగుల తొలగింపు ...
 జిల్లాలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ పద్ధతిపై పనిచేస్తున్న ఐదు వేల మంది ఉద్యోగులను గత మార్చి 31వ తేదీ తరువాత తొలగించారు. దీనిపై కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగ సంఘాలు ఆందోళనలు చేసినా ప్రభుత్వం పట్టించుకోలేదు. బాబు వస్తే ఉద్యోగాలు వస్తాయని ఆశ చూపి తీరా అధికారంలోకి వచ్చిన తరువాత ఉన్న ఉద్యోగాలనే పోగొట్టిన ఘనత టీడీపీకే దక్కింది.
 
 ఉద్యోగాలు వస్తాయని ఆశ పడ్డాం...
 మాది వ్యవసాయ కుటుంబం. ప్రభుత్వం వస్తే ఉద్యోగాలు వస్తాయని నమ్మి ఓట్లు వేశాం. గ్రూప్-2 నోటిఫికేషన్ వస్తుందనే ఆశతో రూ. 50 వేలు ఖర్చు పెట్టుకుని హైదరాబాద్ వెళ్లి ఆర్నెల్ల పాటు కోచింగ్ తీసుకున్నా. తల్లిదండ్రులపై ఆధారపడి ఉద్యోగాలను అన్వేషించడం ఇబ్బందిగా ఉంది. మూడేళ్లుగా సన్నద్ధమవుతున్నా నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో తెలియడం లేదు.
 - ఆర్. కొండానాయక్, గుంటూరు
 
 నమ్మించి మోసగించారు ...
 నిరుద్యోగ భృతి, బాబు వస్తే జాబు పేరుతో నిరుద్యోగులను నిలువునా మోసగించారు. పంచాయతీ కార్యదర్శి ఉద్యోగాలకు గత ఏడాది సెప్టెంబర్‌లో విడుదల కావాల్సిన నోటిఫికేషన్ ఇప్పటి వరకు విడుదల కాలేదు. ప్రభుత్వ ఉద్యోగం సాధించి తల్లిదండ్రులను బాగా చూసుకోవాలనే లక్ష్యంతో ఉన్న పరిస్థితుల్లో ప్రైవేటు ఉద్యోగంతో సరిపెట్టుకోలేం. ఇంత కాలం పడిన శ్రమ వృథా అవుతుంది.
 - ఎస్. కిరణ్‌కుమార్, ఓబులనాయుడుపాలెం
 
 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు చర్యలేవీ ...
 అధికారంలోకి వస్తే ఇంటికో ఉద్యోగం కల్పిస్తామని హామీ లిచ్చిన వారు ఇప్పుడు నోరు మెదపరేమి. ప్రభుత్వ శాఖల్లో వేలాది పోస్టులు ఖాళీగా ఉన్నా ఏ ఒక్క ఉద్యోగానికి నోటిఫికేషన్ ఇవ్వకుండా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. రాజధాని నిర్మాణం పేరుతో ప్రైవేటు ఉద్యోగాలు కల్పిస్తామంటున్న సీఎం ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయడంలో విఫలమయ్యారు.
 - బి. అరుణ్‌కుమార్, పెదకాకాని
 
 ఉన్న ఉద్యోగాలనే తొలగించారు ...
 బాబు వస్తే జాబు వస్తుందని, నిరుద్యోగ భృతి పేరుతో ఎన్నికలకు ముందు హామీలు కుమ్మరించి అధికారంలోకి వచ్చాక నిరుద్యోగులను మోసం చేశారు. డీఎస్సీ మినహాయిస్తే ఏడాది కాలంలో ఏ ఒక్క ఉద్యోగం భర్తీ కాలేదు. ఉద్యోగాలు కల్పించాల్సింది పోయి కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను తొలగించారు. నిరుద్యోగులకు భృతి కల్పించాలని శాసనమండలిలో ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చినా పట్టించుకోలేదు. ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి కల్పించే పరిస్థితి లేదు. ఉమ్మడి రాష్ట్రంలో ఏర్పాటైన ఏపీపీఎస్సీని ప్రస్తుత 13 జిల్లాలకు అనుగుణంగా పునర్‌వ్యవస్థీకరించాలి. సిలబస్‌లో మార్పులు చేసి గ్రూప్-1, గ్రూప్-2 నోటిఫికేషన్లు విడుదల చేయాలి.
 - కేఎస్ లక్ష్మణరావు, మాజీ ఎమ్మెల్సీ
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement