కిరణాలు మాయం | Another complication is to enlarge vishaka | Sakshi
Sakshi News home page

కిరణాలు మాయం

Published Wed, Nov 5 2014 5:40 AM | Last Updated on Sat, Sep 2 2017 3:51 PM

కిరణాలు మాయం

కిరణాలు మాయం

లక్షల మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు.. కార్పొరేట్ కంపెనీల అవసరాలకు అనుగుణంగా యువతకు శిక్షణ కార్యక్రమాలు.. కోట్లు వెచ్చించి శిక్షణ భాగస్వాములతో ట్రైనింగ్‌లు.. అంటూ ప్రవేశపెట్టిన రాజీవ్ యువ కిరణాలు పథకం పత్తా లేకుండా పోయింది. తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అధికారులు ఈ పథకానికి మంగళం పలికారు. ప్రస్తుత సర్కారు కూడా నిరుద్యోగులను పట్టించుకున్న దాఖలాలు లేవు. ప్రతీ ఇంటికీ ఒక ఉద్యోగం ఇస్తామని ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన టీడీపీ ఇప్పటి వరకు ఆ దిశగా ఎటువంటి చర్యలు చేపట్టలేదు. కనీసం ప్రస్తుతం అమలవుతున్న యువకిరణాలు పథకం అమలు తీరుతెన్నులు పట్టించుకోలేదు.నిరుద్యోగుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.
 
విశాఖ రూరల్: నిరుద్యోగాలకు ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కల్పిస్తామంటూ ఊదరగొట్టి.. నిరుద్యోగ యువతకు ఆశలు కల్పించిన కాంగ్రెస్ ప్రభుత్వం చివరకు ఉసూరు మనిపించింది. నిరుద్యోగ యువతకు శిక్షణ కార్యక్రమాల పేరుతో ప్రైవేటు సంస్థలను పెంచి పోషించి.. రూ.కోట్లు ముట్టజెప్పి.. యువతకు ఉద్యోగాలు కల్పించే విషయంలో లక్ష్యానికి దూరంగా చతికిలపడింది. లక్ష్యంలో కేవలం 36 శాతం మందికి మాత్రమే ఉద్యోగాలు చూపించి చేతులు దులుపుకుంది. నిరుద్యోగ యువతకు వారి అర్హత, ఆసక్తి మేరకు ఆయా రంగాల్లో శిక్షణనిచ్చి ఉద్యోగాలు కల్పిస్తామంటూ అప్పటి ప్రభుత్వం 2011లో ఆగస్టు 20న రాజీవ్ యువకిరణాలు పథకాన్ని ప్రారంభించింది.

అప్పటి నుంచి ప్రతీ ఏటా జిల్లాలో నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించేందుకు లక్ష్యాలను నిర్దేశిస్తూ వస్తోంది. దీని ప్రకారం జిల్లాలో 2013 ఏప్రిల్ నుంచి 2014 మార్చి 31వ తేదీ వరకు 26,417 మందికి ఉద్యోగాలు కల్పించాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఎంప్లాయిమెంట్ జనరేషన్ అండ్ మార్కెటింగ్ మిషన్(ఈజీఎంఎం- దీన్ని డీఆర్‌డీఏ పర్యవేక్షిస్తుంటుంది), మెప్మా, టెక్నికల్ ఎడ్యుకేషన్, ఎంప్లాయిమెంట్ అండ్ ట్రైనింగ్, ట్రైబల్ వెల్ఫేర్, మైనార్టీ శాఖల ద్వారా వీరికి శిక్షణనిచ్చి ఉద్యోగాలు కల్పించాల్సి ఉంది. కానీ ఇప్పటి వరకు కేవలం 9,636 మందికి మాత్రమే ఉద్యోగాలు చూపించారు. ఇంకా 16,781 మంది ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారు.

రోజు కూలి కన్నా తక్కువ జీతం: జిల్లాలో నిర్దేశిత లక్ష్యంలో 36 శాతం మంది నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు లభించాయి. ఇందులో దాదాపు 25 శాతం మంది వరకు అసంఘటిత రంగ సంస్థల్లోనే పనిచేస్తున్నారు. ఉద్యోగ భద్రత లేక, కనీస జీతం అందక అవస్థలు పడుతున్నారు. దీంతో దాదాపుగా 15 శాతం మంది ఉద్యోగాలను మానేసినట్టు అధికారులే చెబుతున్నారు. ఈ పథకం ద్వారా చెప్పుకోతగ్గ ఉద్యోగాలు వచ్చిన వారిని వేళ్ల మీద లెక్కపెట్టవచ్చు.

కొత్త ఉద్యోగాలు కలే!: టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఉద్యోగాల కల్పనపై కనీసం దృష్టి సారించడం లేదు. ప్రతీ ఇంటికో ఉద్యోగమంటూ ఊదరగొట్టి.. ఇప్పటి వరకు ఆ ఊసే ఎత్తడం లేదు. ప్రభుత్వ ఉద్యోగుల పదవీకాలంలో 60 ఏళ్లకు పెంచడంతో నిరుద్యోగులకు ఇప్పట్లో ప్రభుత్వ కొలువులు దక్కే అవకాశం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రైవేటు రంగంలో ఉద్యోగావకాశాలు, లేదా ఉపాధి అవకాశాలు చూపించాల్సిన ప్రభుత్వం కనీసం ఆ విషయాన్నే పట్టించుకోవడం లేదు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ అధికారంలోకి వచ్చిన తరువాత గాలికొదిలేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement