పారిశుద్ధ్యం కార్మికుల్లోనూ పార్టీ క్యాడరే...
పారిశుద్ధ్యం కార్మికుల్లోనూ పార్టీ క్యాడరే...
Published Wed, May 17 2017 11:33 PM | Last Updated on Fri, Aug 10 2018 8:23 PM
– రాజమహేంద్రవరం కార్పొరేషన్‌లో లీలలు
– నోటీసులివ్వకుండా 31 మంది తొలగింపు
– వారి స్థానంలో కొత్తవారు 26 మంది నియామకం
– టీడీపీ కార్పొరేటర్ల బంధువులు, అనుచరులే
సాక్షి, రాజమహేంద్రవరం: బాబు వస్తే.. జాబు వస్తుందన్న ఎన్నికల వేళ ఊరూవాడా ప్రచారం చేసిన తెలుగుదేశం పార్టీ నేతలు ఆ హామీని తమ విషయంలో తు.చ తప్పకుండా అమలు చేస్తున్నారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు చంద్రబాబు ఎరుగు... ఉన్న కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్ సిబ్బంది ఉద్యోగాలు ఊడగొడుతున్నారు. వారి స్థానంలో అధికార పార్టీ నేతలు అధికారుల అండతో తమ బంధువులు, కార్యకర్తలను నియమించుకుంటున్నారు. రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ ఫిబ్రవరి 10వ తేదీన 31 మంది కార్మికులను విధులకు హాజరు కావడం లేదన్న సాకుతో తొలగించింది. కనీసం నోటీసులిచ్చి వారి వివరణ అడగకుండానే నిర్ణయం తీసుకున్నారు. దీనిపై కార్మికులు నగరపాలక సంస్థ కమిషనర్‌తోపాటు స్థానిక ప్రజాప్రతినిధులను కలిసి విన్నవించినా ఫలితం లేదు. ఫలితంగా పక్షం రోజులుగా బాధితులు ఆందోళనలు చేస్తున్నారు. తొలగించిన 31 మంది కార్మికులు 180 రోజుల్లో 100 రోజులు పనిలోకి రాకపోవడంతో వారిని విధుల నుంచి తొలగించామని, మరో పది మందిని కూడా తొలగించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశామని కమిషనర్ వి.విజయరామరాజు పేర్కొన్నారు.
180 రోజులు ఎప్పటి నుంచి లెక్కించారు..?
180 రోజులకుగాను 100 రోజులు పనిలోకి రాలేదని కమిషనర్ ప్రకటించడాన్ని కార్మికులు తోసిపుచ్చుతున్నారు. తాము వరుసగా 15 రోజులు మాత్రమే హాజరు కాలేదని పేర్కొంటున్నారు. అది కూడా తమ కుల దేవత వడ్ది పోలమాంబ, కుంచమాంబ ఉత్సవాలు 45 రోజులపాటు చేసిన సమయంలోనే విధులకు హాజరు కాలేదని చెబుతున్నారు. ఓడీఎఫ్ జాబితాలో నగరం చేరాలంటే మీరు హాజరు కావాలని కమిషనర్ ఆదేశించడంతో జాతర ముగింపును జనవరి 10 నుంచి 17వ తేదీకి వాయిదా వేసుకున్నామని, జాతర నవంబర్ 4న మొదలై జనవరి 17న ముగిసిందని, ఈ మధ్యలో తాము 15 రోజులు ఉత్సవాల నిర్వహణలో ఉన్నామని బాధితులు చెబుతున్నారు. ఫిబ్రవరి 10వ తేదీన తమను విధుల నుంచి తొలగించారని, అయితే డిసెంబర్ నుంచి మే నెల వరకు జరిగిన రోజులను పరిగణనలోకి తీసుకుని 180 రోజుల్లో తాము 100 రోజులు విధులకు హాజరు కాలేదని చెప్పడం తగదంటున్నారు.
కార్మికుల స్థానంలో తమ్ముళ్లకు ఉద్యోగాలు...
తొలగించిన 31 మంది పారిశుద్ధ్య కార్మికుల స్థానంలో 26 మందిని తీసుకున్నామని, వీరిలో 8 మంది డ్రైవర్లు, 10 మంది కార్మికులు, ఇతరులు మేస్త్రీలు ఉన్నారని నగరపాలక సంస్థ అధికారులు చెబుతున్నారు. అయితే వారి వివరాలు ఇవ్వాలని అడగ్గా కమిషనర్ ఆదేశాలు లేనిదే తాము ఇవ్వలేమంటున్నారు. ఇదే విషయం కౌన్సిల్‌కు మూడు రోజులు ముందు తాము అడిగినా అది రహస్యమని, ఇవ్వడానికి నిబంధనలు ఒప్పకోవని చెప్పారని ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లు పేర్కొంటున్నారు. తొలగించిన కార్మికుల స్థానంలో నియమించిన వారిలో టీడీపీ కార్పొరేటర్ల బంధువులు, కార్యకర్తలు ఉన్నారన్న బలమైన ఆరోపణలున్నాయి. టీడీపీ మహిళా కార్పొరేటర్ కుమారుడిని, మరో మహిళా కార్పొరేటర్ బంధువును మేస్త్రీలుగా నియమించారని తొలగించిన కార్మికులు, వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లు చెబుతున్నారు. కొత్తగా నియమించిన 26 మంది వివరాలు ప్రకటించాలని ప్రతిపక్ష కార్పొరేటర్లు డిమాండ్ చేస్తున్నారు. తొలగించిన వారిలో 20 ఏళ్ల నుంచి పని చేస్తున్నవారున్నారని, వారిలో వితంతువులు, ఏ ఆధారం లేని వారున్నారని విపక్ష నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కొత్తగా నియమించిన వారి వివరాలు ఇవ్వడంలేదు..
కార్మికులను అన్యాయంగా తొలగించారు. వారి స్థానంలో టీడీపీ కార్పొరేటర్ల బంధువులు, కార్యకర్తలను నియమించారు. 31 మందికి బదులుగా తీసుకున్న వారి జాబితా అడిగితే ఇవ్వడంలేదు. అది రహస్యం, ఇవ్వకూడదని కమిషనర్ చెప్పారని పబ్లిక్ హెల్త్ అధికారులు చెబుతున్నారు.
– ఈతకోట బాపన సుధారాణి, 14వ డివిజన్ కార్పొరేటర్
కార్మికులను న్యాయం చేయకపోతే ఆందోళనలు...
నోటీసులు ఇవ్వకుండా, కనీసం వారి వివరణ అడగకుండా ఎన్నో ఏళ్ల నుంచి పని చేస్తున్న కార్మికులను విధుల నుంచి తొలగించడం అన్యాయం. 180 రోజులను ఎప్పటి నుంచి తీసుకుని 100 రోజులు శెలవులు పెట్టారో అధికారులు చెప్పాలి. వారు అన్ని రోజులు సెలవులు పెడుతుంటే శానిటరీ మేస్త్రీలు, సూపర్‌వైజర్లు ఏం చేస్తున్నారు? రెండు మూడు రోజులు సెలవు పెట్టినప్పుడే ఎందుకు హెచ్చరించ లేదు. కార్మికులకు న్యాయం చేయకపోతే ప్రత్యక్ష ఆందోళనలు తప్పవు.
– జక్కంపూడి విజయలక్ష్మి, వైఎస్సార్‌సీపీ సీజీసీ సభ్యురాలు.
Advertisement
Advertisement