దద్దరిల్లిన ధర్నాలు
దద్దరిల్లిన ధర్నాలు
Published Mon, May 15 2017 11:51 PM | Last Updated on Tue, Oct 16 2018 6:33 PM
కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపుపై కన్నెర్ర
కార్పొరేషన్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత
వందమందికి పైగా మున్సిపల్ కార్మికుల అరెస్ట్
తాడితోట (రాజమహేంద్రవరం సిటీ) : మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశం నిర్వహిస్తుండగా మరో పక్క మున్సిపల్ కార్పొరేషన్ వద్ద ధర్నాలతో దద్దరిల్లింది. సీపీఐ రాష్ట్ర నాయకులు, రాష్ట్ర మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకుడు కిర్ల కృష్ణారావు, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు మీసాల సత్యనారాయణ, రెల్లికుల సంక్షేమ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు నీలాపు వెంకటేశ్వరరావు తదితరుల ఆధ్వర్యంలో తొలగించిన 31 మంది కాంట్రాక్ట్ కార్మికులను వెంటనే విధులలోకి తీసుకోవాలని ఆందోళన చేపట్టారు. ఉదయం 10 గంటల నుంచి కార్పొరేషన్ గేటు వద్ద బైఠాయించారు. 20 ఏళ్లుగా కార్పొరేషన్‌లో కాంట్రాక్ట్ కార్మికులుగా ఉన్న వీరికి నోటీసులు ఇవ్వకుండానే తొలగించడం దారుణమన్నారు. 1998లో అప్పటి మున్సిపల్ కమిషనర్ వికాస్‌రాజ్ వీరికి అవకాశం కల్పించారని అన్నారు. కమిషనర్ ఆనాలోచిత చర్యల వల్ల 31 కుటుంబాలు రోడ్డున పడ్డాయని విమర్శించారు. తొలగించిన కార్మికులను వెంటనే విధులలోకి తీసుకోవాలని, తొలగించిన 15 రోజులకూ వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. 151 జీఓ అమలు, జీతాలు సక్రమంగా చెల్లించాలని వారు కోరారు.
వందమంది పైగా అరెస్ట్
మున్సిపల్ కార్పొరేషన్ వద్ద ఆందోళన చేపట్టిన సీపీఐ, మున్సిపల్ ఉద్యోగులను పోలీసులు అరెస్ట్ చేశారు. వంద మందిని పైగా అరెస్ట్ చేసి త్రీటౌన్, వన్‌టౌన్ పోలీస్ స్టేషన్లకు తరలించారు. వారిపై కేసులు నమోదు చేసి సొంత పూచీకత్తులపై విడుదల చేశారు. అరెస్ట్ అయిన వారిలో కిర్ల కృష్ణారావు, మీసాల సత్యనారాయణ, జట్లు లేబర్ యూనియన్ అధ్యక్షులు వంగమూడి కొండల రావు, కార్యనిర్వాహక కార్యదర్శి నల్లా రామారావు, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు ఉన్నారు.
ఆశీల వ్యవహారంపై సీపీఎం ఆందోళన
చిరు వ్యాపారులపై పెంచిన ఆశీల వ్యవహారంపై చర్చించాలని డిమాండ్ చేస్తూ సీపీఎం ఆధ్వర్యంలో కార్పొరేషన్ వద్ద ఆందోళన నిర్వహించారు. పెంచిన ఆశీల భారంపై నగర పాలక సంస్ధ కౌన్సిల్ సమావేశంలో చర్చించాలని సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో చిరు వ్యాపారులు కౌన్సిల్ సమావేశంలో వద్దకు చేరుకున్నారు. ఈమేరకు వారు వినతిపత్రాలను ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అన్ని పార్టీల ఫ్లోర్‌లీడర్లు, కార్పొరేటర్లకు అందజేశారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శి టి.అరుణ్ మాట్లాడుతూ నగరంలో స్వయం ఉపాధి పొందుతున్న చిరు వ్యాపారుల జీవనోపాధిపై దెబ్బకొడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మున్సిపల్ అధికారులు చేసిన తప్పుకు చిరు వ్యాపారులు బలైపోతున్నారని అన్నారు. జైలు రోడ్డులో చిరువ్యాపారులను తొలగించారని వారిని అక్కడే వ్యాపారం చేసుకునేందుకు అవకాశం కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు పి.వెంకటేశ్వరరావు, ఎన్.రంగ, పి.తులసి, ఐ.సుబ్రహ్మణ్యం, కేవీపీఎస్ నాయకులు రూపస్‌రావు, రాజా తదితరులు పాల్గొన్నారు. పోలీసులకు సీపీఎం నాయకులకు మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది.
Advertisement
Advertisement