సాక్షి, రాజమహేంద్రవరం : రాజమహేంద్రవరం నగరపాలక మండలి సాధారణ సమావేశం పూర్తిగా వ్యక్తిగత దూషణలకు వేదికగా మారింది. ప్రజాసమస్యలను గాలికొదిలేసిన అధికార పార్టీ నేతలు.. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌ను, ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీని దూషిస్తూ కాలం గడిపేశారు. అధికారపార్టీ నేతల అక్రమాలు, దోపిడీ, నిబంధనలకు విరుద్ధంగా పనిచేస్తున్న జన్మభూమి కమిటీలపై ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ నిలదీయడంతో టీడీపీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి, టీడీపీ సీనియర్ కార్పొరేటర్లు వ్యక్తిగత దూషణలకు దిగారు.
‘నీకు ఎమ్మెల్సీ పదవి జగన్ పెట్టిన భిక్షే’
అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా దొంగలు, దోపిడీదారులు అంటూ టీడీపీ ఫ్లోర్‌లీడర్ వర్రే శ్రీనివాసరావు, డిప్యూటీ మేయర్ వాసిరెడ్డి రాంబాబు, ఎమ్మెల్సీ ఆదిరెడ్డి మాట్లాడడంతో వారు ఎవరో చెప్పాలని వైఎస్సార్ సీపీ చీఫ్‌విప్ మింది నాగేంద్ర డిమాండ్ చేశారు. దోపిడీలు, భూకబ్జాలు మీరు చేస్తూ దొంగే దొంగ అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనకు మద్దతుగా వైఎస్సార్‌సీపీ ఫ్లోర్‌లీడర్ మేడపాటి షర్మిలారెడ్డి, డిప్యూటీ ఫ్లోర్‌లీడర్ గుత్తుల మురళీధర్, కార్పొరేటర్లు బొంతా శ్రీహరి, పిల్లి నిర్మల, ఈతకోటి బాపన సుధారాణి, మజ్జి నూకరత్నం మాట్లాడారు. ఈ క్రమంలో సహనం కోల్పోయిన ఆదిరెడ్డి, వర్రే, వాసిరెడ్డి ఎదురుదాడి చేశారు. ఎమ్మెల్సీ ఆదిరెడ్డి వైఎస్ జగన్‌పై వ్యక్తిగత ఆరోపణలు చేయడంతో స్పందించిన వైఎస్సార్‌సీపీ సభ్యులు ‘నీకు ఎమ్మెల్సీ పదవి జగన్ పెట్టిన బిక్షేనన్న విషయం గుర్తుంచుకోవాలి’ అంటూ ఆదిరెడ్డికి చురక అంటించారు. ఈ క్రమంలో ఆదిరెడ్డి, వర్రే శ్రీనివాసరావు వైఎస్సార్‌సీపీ ఫ్లోర్‌లీడర్ మేడపాటి షర్మిలారెడ్డిపై వ్యక్తిగత దూషణలకు దిగారు. పింఛన్ల అక్రమాలపై విచారణ చేసి దొంగలు ఎవరో తేల్చాలని మింది నాగేంద్ర సవాల్ విసిరారు. బీసీ, ఎస్సీ, కాపు రుణాలు సకాలంలో మంజూరు చేయకుండా కమిటీ ఆమోదం పేరుతో కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. సబ్సిడీ నగదు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయకుండా బ్యాంకులు రుణాలు ఎలా ఇస్తాయని ప్రశ్నించారు. జన్మభూమి కమిటీల్లో సభ్యులుగా సామాజిక కార్యకర్తలు ఉండాలని కమిషనర్ చెప్పగా, అందులో టీడీపీ కార్యకర్తలను ఎలా నియమించారని నాగేంద్ర ప్రశ్నించారు. ప్రభుత్వం మాది మా ఇష్టం వచ్చినట్లు చేసుకుంటామని వర్రే, వాసిరెడ్డి దురుసుగా సమాధానమిచ్చారు.
ఇదా మీరు చేస్తున్న అభివృద్ధి...?
సీఎం చంద్రబాబు పుష్కరాలకు నిధులు ఇవ్వడంతోనే అభివృద్ధి జరుగుతుందని ఎమ్మెల్సీ ఆదిరెడ్డి పేర్కొన్నారు. ఈ క్రమంలో కలుగజేసుకున్న వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్ బొంతా శ్రీహరి అఖండ గోదావరికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించాల్సి ఉన్నా బీపీఎస్ నిధులు రూ.20 కోట్లు కేటాయించడమా? చంద్రబాబు, పాలక మండలి చేసింది? అని ప్రశ్నించారు. పుష్కరాల పనుల్లో అవినీతి జరిగిందని తమతో లేఖలు రాయించిన ఆదిరెడ్డి ఇప్పడు టీడీపీలో చేరిన తర్వాత చంద్రబాబు, టీడీపీ ప్రభుత్వం నీతిమయమైందా? అని నిలదీశారు. ఏ ఎండకు ఆ గోడుకు పట్టే ఆదిరెడ్డి మాటలు దెయ్యాలు వేదాలు వల్లించినట్టుందని మండిపడ్డారు. ఈ క్రమంలో వాగ్వివాదం పెరగడంతో టీడీపీ ఫ్లోర్‌లీడర్ వర్రే ప్రతిపాదన మేరకు మేయర్ వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లను సస్పెండ్ చేసి బలవంతంగా బయటకు పంపించేశారు.
దోపిడీ, దౌర్జన్య పాలన సాగుతోంది
అనంతరం మేడపాటి షర్మిలారెడ్డి మీడియాతో మాట్లాడుతూ క్వశ్చన్ అవర్ అని రెండు నిమిషాలు కూడా ఇవ్వకుండా ఉంటే ప్రజా సమస్యలు ఎలా ప్రస్తావిస్తామని ప్రశ్నించారు. టీడీపీ కార్పొరేటర్లు ప్రతి పనిలో దోపిడీ చేస్తున్నారని మండిపడ్డారు. మేయర్ టీడీపీ ఫ్లోర్‌లీడర్ వర్రే చెప్పినట్టు నడుస్తున్నారని ఆరోపించారు. డిప్యూటీ ఫ్లోర్‌లీడర్ మురళీధర్ మాట్లాడుతూ నగరంలో రోడ్డుపక్కల వ్యాపారం చేసుకునే బడుగు జీవులకు అన్యాయం జరిగింది. దీనిపై మాట్లాడడానికి కూడా సమయం ఇవ్వలేదని మండిపడ్డారు. బొంతా శ్రీహరి మాట్లాడుతూ అఖండ గోదావరి ప్రాజెక్టు పనులకు బీపీఎస్ నిధులు ఎలా ఇస్తారని ప్రశ్నించారు.