మళ్లీ కదలిక
కార్పొరేషన్ ఎన్నికలపై మరోసారి కదలిక
కోర్టు వ్యాఖ్యలతో చిగురించిన ఆశలు
ఒకటి రెండు నెలల్లో జరిగే అవకాశం
కాకినాడ : ఓటమి భయంతో ఏడేళ్లుగా కార్పొరేషన్ ఎన్నికలు జరగకుండా మోకాలడ్డిన ప్రభుత్వాలు ఇక ఎన్నికలు జరపక తప్పని పరిస్థితి నెలకొంది. స్వయంగా అత్యున్నత న్యాయ స్థానం జోక్యం చేసుకుని మొట్టికాయలు వేయడంతో ఒకటి, రెండు నెలల్లోనే కాకినాడ నగరపాలక సంస్థ ఎన్నికలు జరిగే అవకాశం కనిపిస్తోంది. గత కాంగ్రెస్ ప్రభుత్వంతోపాటు మూడేళ్ల క్రితం అధికారంలోకి వచ్చిన టీడీపీ సర్కార్ కూడా కుంటిసాకులతో ఎన్నికలను వాయిదా వేస్తూ వస్తోంది. మున్సిపాలిటీగా ఉన్న కాకినాడను 2005 సెప్టెంబర్ 29న నగరపాలక సంస్థగా అప్‌గ్రేడ్ చేస్తూ అప్పట్లో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాకినాడ తొలి కార్పొరేషన్ ఎన్నికలను 8 నెలల తరువాత పూర్తి చేసి 2005 సెప్టెంబర్ 30న తొలి పాలకవర్గం బాధ్యతలు స్వీకరించింది. 2010 సెప్టెంబర్ 29న తొలి పాలకవర్గం పదవీకాలం ముగిసిపోయింది. ఆ తరువాత ఎన్నికలు నిర్వాహించాల్సి ఉండగా పంచాయతీల విలీనం సాకుతో కాంగ్రెస్ ప్రభుత్వం కొంతకాలంపాటు వాయిదాలు వేస్తూ వచ్చింది. ఆ తరువాత కొన్ని పంచాయతీలు న్యాయస్థానాలను ఆశ్రయించడం, మారిన రాజకీయ పరిస్థితుల్లో ఎన్నికలకు ఆ పార్టీకి అనువుగా లేకపోవడంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ఊసు ఎత్తలేదు. 2014లో తెలుగుదేశం అధికారంలోకి వచ్చాక ఎన్నికలు జరుగుతాయని ఆశించినా ఫలితం కనిపించలేదు. టీడీపీ విధానాలతో ప్రజల్లో రోజురోజుకి వ్యతిరేకత పెరగడంతో ఈ ప్రభుత్వం కూడా ఎన్నికలపై వెనక్కి తగ్గింది. ఈ నేపద్యంలో కాకినాడకు చెందిన మాజీ కార్పొరేటర్ చిట్నీడి నారాయణమూర్తి న్యాయ స్థానంలో ప్రజాప్రయోజనాల వాజ్యాన్ని దాఖలు చేశారు. పాలకవర్గం లేక ప్రత్యేకాధికారిపాలనలో నగరపాలన స్తంభించి పోయిందని, నగర ప్రజలకు కనీస సదుపాయాలు అందడంలేదంటూ వేసిన వ్యాజ్యంపై కోర్టు గత ఏడాది సెప్టెంబర్ 24లోపు ఎన్నికలు జరపాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. 45 రోజులు గడువు అడిగిన ప్రభుత్వం మళ్లీ ఏదో ఒకసాకుతో ఎన్నికలకు ముందుకు రాని పరిస్థితుల్లో ప్రభుత్వంపై సుమారు మూడు నెలల క్రితం కోర్టు ధిక్కార కేసును వేశారు. దీనిపై తీవ్రంగా స్పందించిన కోర్టు కాకినాడ ఎన్నికలపై ఎందుకు ముందుకు వెళ్లడం లేదంటూ ప్రభుత్వాన్ని రెండు రోజుల క్రితం గట్టిగా ప్రశ్నించింది. ఆగస్టు 4వ తేదీన తమ ఎదుట వివరణ ఇవ్వాలంటూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్, రాష్ట్ర పురపాలకశాఖ కార్యదర్శులకు కూడా నోటీసులు ఇవ్వడంతో ఇప్పుడు ఎన్నికల వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది.
కొలిక్కి రానున్న ప్రక్రియ
కోర్టు జోక్యం చేసుకుని ఆగస్టు 4 నాటికి స్పష్టమైన వివరణ ఇవ్వాలని కోరిన నేపథ్యంలో ఎన్నికలపై మరోసారి ఆశలు చిగురించాయి. ఇప్పటికే డివిజన్ల పునర్విభజన పూర్తి చేసి ఎస్సీ,ఎస్టీ, బీసీ, మహిళా ఓటర్ల జాబితాను కూడా ప్రకటించిన నగరపాలక సంస్థ పోలింగ్ స్టేషన్ల గుర్తింపు ప్రక్రియ కూడా పూర్తి చేసింది. కోర్టు జోక్యంతో ఇక కుంటుసాకులు చెప్పే అవకాశం లేదంటున్నారు. ఆగస్టు 4వ తేదీన కోర్టు మరోసారి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చే అవకాశం ఉండడంతో త్వరలోనే ఎన్నికల నిర్వహణ దిశగా ప్రభుత్వం ముందుకు కదిలే అవకాశం ఉందంటున్నారు. అంతా అనుకున్నట్టే జరిగితే ఒకటిరెండు నెలల్లో ఏడేళ్ళ తరువాత కాకినాడ కార్పొరేషన్ ఎన్నికలు జరిగే అవకాశం కనిపిస్తోంది.