ఆశీలు కాంట్రాక్టర్లకు నోటీసులు
ఆశీలు కాంట్రాక్టర్లకు నోటీసులు
Published Sun, Apr 16 2017 11:26 PM | Last Updated on Tue, Oct 16 2018 6:33 PM
హెచ్చరించిన నగరపాలక సంస్థ కమిషనర్ విజయరామరాజు
ఆశీలు రేట్లపై చిరు వ్యాపారులకు అవగాహన
సాక్షి, రాజమహేంద్రవరం : నిబంధనలకు విరుద్ధంగా ఆశీలు వసూలు చేస్తే కాంట్రాక్టలు రద్దు చేయడంతో పాటు క్రిమినల్ కేసులు పెట్టిస్తామని ఆశీలు కాంట్రాక్టర్లకు నగరపాలక సంస్థ కమిషనర్ వి.విజయరామరాజు హెచ్చరించారు. ‘ఆశీలు దందా’ శీర్షికన ఆదివారం ‘సాక్షి’లోన వచ్చిన కథనానికి కమిషనర్ స్పందించారు. రాజమహేంద్రవరంలోని నగరపాలక సంస్థ మార్కెట్ల వద్ద నిబంధనలకు విరుద్ధంగా ఎక్కువ మొత్తంలో ఆశీలు వసూలు చేస్తున్న కాంట్రాక్టర్లకు నగరపాలక సంస్థ నోటీసులు జారీ చేసింది. నగరపాలక సంస్థ నిర్ణయించిన రేట్ల కంటే అధిక మొత్తంలో సైకిళ్లు, మోటారు సైకిళ్లపై వ్యాపారాలు చేసుకునే వారి వద్ద వసూలు చేస్తున్నట్టు వచ్చిన ఫిర్యాదులు, ‘సాక్షి’లో వచ్చిన కథనాలతో అధికారులు చర్యలు ప్రారంభించారు. అధిక మొత్తంలో వసూలు చేస్తున్న ఆల్కాట్ తోట కాంట్రాక్టర్ జి.సాయిబాబు, జాంపేట మార్కెట్ కాంట్రాక్టర్ డి.శ్రీనివాస్, మునికుట్ల అచ్యుతరామయ్య మార్కెట్ (కంబాలచెరువు) కాంట్రాక్టర్ ఎం.చంద్రరావులకు నోటీసులు జారీ చేసింది. నిర్ణయించిన మేరకు ఆశీలు వసూలు చేయాలని, లేదంటే క్రిమినల్ కేసుల పెట్టిస్తామని హెచ్చరించింది. మరోమారు ఇది పునరావృతమైతే ఎలాంటి సమాచారం లేకుండా కాంట్రాక్ట్ రద్దు చేస్తామని తెలిపింది. తాము నిర్ణయించిన మార్కెట్ సరిహద్దుల మేరకు ఆశీలు వసూలు చేయాలని స్పష్టం చేసింది. ఆశీలు రేట్లపై చిరు వ్యాపారులకు సిబ్బంది అవగాహన కల్పించేలా చర్యలు చేపట్టింది. సిబ్బంది మార్కెట్ల వద్దకు వెళ్లి ఎంత ఆశీలు కట్టాలన్న దానిపై చిరువ్యాపారులకు వివరించనున్నారు. అంతేకాకుండా ఇకపై నిరంతరం రెవెన్యూ అధికారులు ఆశీలు వసూళ్లను పర్యవేక్షించేలా కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు.
Advertisement