
రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో సర్కారు నోటీసులు
అనుమతి లేకుండా నిర్మిస్తున్నారని బెదిరింపు
వీఎంఆర్‌డీఏ అనుమతులున్నప్పటికీ విశాఖ, అనకాపల్లిలో విడ్డూరం
జీవీఎంసీ ఇవ్వలేదంటూ వింతగా నోటీసులు జారీ
నెల్లూరులో కూలదోస్తామని అధికారుల హడావుడి
‘అనంత’లో ఆఫీస్ బాయ్‌కి నోటీసు ఇచ్చి వెళ్లిన నగర పాలక సంస్థ సిబ్బంది
రాజమహేంద్రవరంలో పార్టీ కార్యాలయానికి నోటీసు
సాక్షి, విశాఖపట్నం/నెల్లూరు (వీఆర్సీసెంటర్)/అనంతపురం కార్పొరేషన్/సాక్షి, రాజమహేంద్రవరం : రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం ఏర్పాటై వారం రోజులైనా గడవక ముందే కక్ష సాధింపు చర్యలకు దిగింది. ప్రజలేమనుకుంటారోననే భయం ఇసుమంతైనా లేకుండా వైఎస్సార్‌సీపీ కార్యాలయాలను కూలదోయడానికి పూనుకుంది. హైకోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ శనివారం తెల్లవారుజామున తాడేపల్లిలో పార్టీ కేంద్ర కార్యాలయాన్ని కూల్చేసింది. ఇంతటితో ఆగక రాష్ట్ర వాప్తంగా పలు జిల్లా కేంద్రాల్లోని పార్టీ కార్యాలయాలకు నోటీసులు జారీ చేసింది.
పార్టీ కార్యాలయాలన్నింటినీ అక్రమంగా నిర్మిస్తున్నారని, వారం రోజుల్లో సరైన సమాధానం ఇవ్వకపోతే ఎందుకు కూల్చకూడదని ప్రశ్నించింది. ఈ నేపథ్యంలో విశాఖ, అనకాపల్లిలో వైఎస్సార్‌సీపీ కార్యాలయాలకు జీవీఎంసీ అధికారులు శనివారం నోటీసులు జారీచేశారు. వాస్తవానికి వీఏంఆర్డీఏకు అనుమతుల కోసం విశాఖ కార్యాలయం కోసం రూ.15.63 లక్షలు, అనకాపల్లి పార్టీ కార్యాలయం కోసం రూ.35.60 లక్షలు చెల్లించినా.. అనుమతుల్లేవంటూ శనివారం జీవీఎంసీ అధికారులు నోటీసులు కార్యాలయాల వద్ద అతికించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారమే విశాఖపట్నం జిల్లా విశాఖ రూరల్ మండల పరిధిలోని ఎండాడ గ్రామంలో 2 ఎకరాల ప్రభుత్వ భూమిని 33 ఏళ్ల పాటు లీజు పద్ధతిన ఎకరాకు రూ.1000 చొప్పున చెల్లించే విధంగా 2016 ఏడాదిలో ప్రభుత్వం జీవో జారీ చేసింది.
గతేడాది ఫిబ్రవరి నెలలో వీఎంఆర్‌డీఏ అనుమతి కోరుతూ రూ.15.63 లక్షలు చెల్లించారు. 2023లో సెప్టెంబర్ 25న çఫస్ట్ ప్లోర్‌లో 120.34 స్క్వేర్ యార్డ్స్ ప్రపోజ్ చేస్తూ మార్ట్‌గేజ్ చేశారు. గతేడాది వీఎంఆర్‌డీఏ అనుమతులు కోరిన 21 రోజుల్లో ఏదైనా అభ్యంతరం ఉంటే చెప్పాల్సి ఉంటుంది. ఎటువంటి అభ్యంతరం లేకపోయినా..ఆటోమెటిక్‌గా ప్లాన్ అప్రూవల్ అయినట్లు పరిగణిస్తారు. వీఎంఆర్‌డీఏ ద్వారా జీవిఎంసీ అనుమతుల కోసం డీడీ తీసి ఆరు నెలలు కావస్తున్నా, ఎటువంటి అభ్యంతరం చెప్పలేదు.
అయితే ఇప్పుడు టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చీ రాగానే అనుమతుల్లేవని చెప్పటం పట్ల వైఎస్సార్‌సీపీ శ్రేణులు, నాయకులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కేవలం కక్ష సాధింపు చర్యలేనని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా, విశాఖ, అనకాపల్లి వైఎస్సార్‌సీపీ కార్యాలయాల్లో ఎవరూ లేని సమయంలో జీవిఎంసీ అధికారులు నోటీసులు అతికించి వెళ్లిపోయారు.
బుల్డోజర్‌తో కూల్చేస్తామంటూ..
నెల్లూరులోని 54వ డివిజన్ జనార్దనరెడ్డి కాలనీలో నిర్మిస్తున్న వైఎస్సార్‌సీపీ జిల్లా పార్టీ కార్యాలయాన్ని బుల్‌డోజర్స్‌తో కూల్చేస్తామని నెల్లూరు టౌన్ ప్లానింగ్ అధికారులు శనివారం హడావుడి చేశారు. అక్కడ 2 ఎకరాల్లో పార్టీ కార్యాలయ భవనం నిర్మాణంలో ఉంది. సమాచారం అందుకున్న పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి, నెల్లూరు సిటీ సమన్వయకర్త ఖలీల్ అహ్మద్ అక్కడికి చేరుకుని టౌన్ ప్లానింగ్ అధికారులతో మాట్లాడారు.
ప్రభుత్వం వద్ద 33 ఏళ్ల పాటు లీజుకు తీసుకుని, లీజు నగదునూ చెల్లించామని, అన్ని అనుమతులు తీసుకున్నామని, నిబంధనల మేరకు ఈ నిర్మాణం జరుగుతోందని చెప్పారు. ఈ భవనం ఒక వ్యక్తికి సంబంధించినది కాదని, జిల్లా పార్టీ కార్యాలయం కాబట్టి దీని డాక్యుమెంట్లు తెప్పించేందుకు 2 రోజులు కావాలని చెప్పినప్పటికీ అధికారులు పట్టించుకోకుండా కూల్చేసామని చెప్పారు. ఏ క్షణంలోనైనా ఈ భవనాన్ని కూల్చేస్తామని చెప్పి వెళ్లారు. శనివారం రాత్రి కార్పొరేషన్ సిబ్బంది పార్టీ కార్యాలయం వద్ద నోటీసు అంటించి వెళ్లారు. 7 రోజుల్లో రాతపూర్వకంగా సమాధానం ఇవ్వాలని అందులో పేర్కొన్నారు.
ఎందుకు చర్యలు తీసుకోకూడదంటూ..
అనంతపురం నగర పాలక సంస్థ కమిషనర్ మేఘ స్వరూప్ ఆదేశాలతో డిప్యూటీ సిటీ ప్లానర్ మారుతీహరిప్రసాద్ శనివారం వైఎస్సార్‌సీపీ కార్యాలయానికి నోటీసులిచ్చారు. అనంతపురం హెచ్‌ఎల్‌సీ కాలనీలో 1.50 ఎకరాల్లో పార్టీ కార్యాలయాన్ని అనధికారికంగా నిర్మిస్తున్నారని నోటీసులో పేర్కొన్నారు. 7 రోజుల్లో నోటీసుకు సమాధానం ఇవ్వాలని, అంతవరకు నిర్మాణాలు చేపట్టకూడదని, ఇప్పటివరకు అనధికారికంగా నిర్మాణం చేపట్టినందున చర్యలు ఎందుకు తీసుకోకూడదని ప్రశ్నించారు. స్థానిక రెండో రోడ్డులోని పార్టీ కార్యాలయంలో ఆఫీస్ బాయ్ శ్రీనివాసులుకు నోటీసు అందించారు.
ఇది అనధికారిక కట్టడం
రాజమహేంద్రవరంలోని వైఎస్సార్‌సీపీ తూర్పు గోదావరి జిల్లా కార్యాలయం అక్రమ కట్టడమని, వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని, పార్టీ జిల్లా అధ్యక్షుడి పేరుతో నగర పాలక సంస్థ అధికారులు శనివారం నోటీసులిచ్చారు. సువిశేషపురంలో రెండెకరాల్లో పార్టీ జిల్లా కార్యాలయ నిర్మాణానికి 2023 జూన్ 10న అప్పటి రాష్ట్ర మంత్రులు చెల్లుబోయిన వేణు, తానేటి వనిత, పార్టీ జిల్లా అధ్యక్షుడు, నాటి రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, అప్పటి ఎంపీ మార్గాని భరత్‌రామ్ శంకుస్థాపన చేశారు.
ఇప్పటికే కార్యాలయ పనులు సింహభాగం పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో ఇది అనధికారిక కట్టడమంటూ రాజమహేంద్రవరం నగర పాలక సంస్థ కమిషనర్ కె.దినేష్ కుమార్ నోటీసు జారీ చేశారు. ఏడు రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని పేర్కొన్నారు. నోటీసు ప్రతిని నిర్మాణంలో ఉన్న పార్టీ కార్యాలయానికి అతికించారు. భవన నిర్మాణ పనులు తక్షణం నిలిపివేయాలని సూచించారు. ఇదంతా టీడీపీ నేతల కుట్రలో భాగమేనని వైఎస్సార్‌సీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment