సర్పంచ్‌లకు ట్రాక్టర్లను పంపిణీ చేస్తున్న మంత్రి హరీష్‌రావు
రాష్ట్రంలోనే ప్రగతి రేటింగ్‌లో సంగారెడ్డి జిల్లా ద్వితీయ స్థానంలో ఉందని, మొదటి స్థానంలో నిలపడానికి ప్రజాప్రతినిధులు, అధికారులు కృషి చేయాలని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు సూచించారు. సంగారెడ్డి పట్టణంలో సోమవారం పంచాయతీరాజ్ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మంత్రి మాట్లాడుతూ ఉత్తమ పంచాయతీల రేటింగ్‌లో రాష్ట్రంలో సిరిసిల్ల 82.49 పాయింట్లతో మొదటి స్థానంలో ఉండగా..సంగారెడ్డి జిల్లా 82.01 పాయింట్లతో అంటే కేవలం అరపాయింట్ తేడాతో రెండో స్థానంలో నిలిచిందన్నారు. మొదటి స్థానంలోకి రావడానికి సర్పంచ్‌లు, అధికారులు కృషి చేయాలని సూచించారు.
– సాక్షి, సంగారెడ్డి
సాక్షి, సంగారెడ్డి: సిద్దిపేట జిల్లా ఏడో స్థానంలో ఉందని ఆర్థిక మంత్రి హరీష్‌రావు అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రతి గ్రామ పంచాయతీకి ట్రాక్టర్, ట్రాలీ, ట్యాంకర్‌ను అందిస్తున్న ఘనత తెలంగాణ ప్రభుత్వానికే దక్కిందన్నారు. పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా డంప్ యార్డులు, వైకుంఠ ధామాలు, ఇంకుడు గుంతలు నిర్మించి జిల్లాలను అభివృద్ధి బాటలో నడిపిస్తున్నామన్నారు. అభివృద్ధి కార్యక్రమాల నిర్వహణకు ప్రజాప్రతినిధులకు అధికారులు సహకరించాలని, చేసిన పనులకు సాధ్యమైనంత త్వరలో బిల్లులు చెల్లించాలని ఆదేశించారు. పనుల విషయంలో నిర్లక్ష్యం వహిస్తే విధుల నుంచి తొలగించడానికి వెనుకాడే ప్రసక్తే లేదన్నారు. బాగా పనిచేసిన వారికి రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజు జూన్ 2న సన్మానాలతోపాటు బహుమానాలు అందజేస్తామన్నారు.
సింగూరులో ఇప్పటికీ 1.5 టీఎంసీల నీరు ఉందని, వారం రోజుల్లోగా రోజు విడిచి రోజు మంచినీటిని సరఫరా చేస్తామని చెప్పారు. జిల్లాలో 771 కిలోమీటర్ల మేరకు ఎవిన్యూ ప్లాంటేషన్ చేశామని, వాటికి నీరు పోసి బతికించాలని సూచించారు. ఈ నెలాఖరు నుంచి గ్రామాల్లో ఆకస్మిక తనిఖీలు ఉంటాయని, సీఎంతోపాటు మంత్రులు, ఉన్నతాధికారులు పర్యటిస్తారని చెప్పారు. బాగా పని చేయని సర్పంచ్‌లు, కార్యదర్శులపై వేటు వేస్తామని హెచ్చరించారు. పల్లె ప్రగతిలాగే త్వరలో పట్టణ ప్రగతి కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. ప్రతి నెలా ఒకటో తేదీన పంచాయతీలు కరెంటు బిల్లులు చెల్లించాలని, పారిశుధ్య కార్మికులకు జీతాలు ఇవ్వాలని సూచించారు.
చర్యలు తీసుకోండి
బిల్లులపై సంతకాలు పెట్టడానికి సర్పంచ్‌లను ఇబ్బందులు పెడుతున్న ఉపసర్పంచ్‌లపై చర్యలు తీసుకోవాలని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు కలెక్టర్ హనుమంతరావును ఆదేశించారు. జాయింట్ చెక్‌పవర్ విషయం కొత్త పంచాయతీరాజ్ చట్టంలో పొందుపరిచామని, ఇదే అదనుగా చేసుకొని చెక్కులపై సంతకాలు పెట్టడానికి ఇబ్బందులు పెట్టడం సరికాదన్నారు. చేసిన అభివృద్ధి పనులకు సంబంధించి తన జేబులో 5 చెక్కులు ఉన్నాయని, జాయింట్ సంతకం పెట్టడానికి ఉపసర్పంచ్ ఇబ్బంది పెడుతున్నాడని కంగ్టి మండలంలోని దామరగిద్ద సర్పంచ్ మామ శంకర్ (సర్పంచ్ ఆసం లక్ష్మికి బదులుగా ఈ సమావేశంలో ఆయన పాల్గొన్నారు) మంత్రి హరీశ్‌రావు దృష్టికి తీసుకురాగా పై విధంగా ఆదేశించారు. ఉప సర్పంచ్‌లపై ఫిర్యాదులు అందుతున్నాయని, చట్టంలోనే పొందుపరిచిన విషయాన్ని గుర్తు చేశారు. జాయింట్ చెక్‌పవర్‌పై సంతకాల కోసం ఇబ్బందులు పెడుతున్నట్లు నిర్దారణ అయితే వారిని పదవుల నుంచి తొలగించాలని కలెక్టర్‌ను ఆదేశించారు.
పల్లెల ముఖ చిత్రాలు మారుతున్నాయి
పల్లె ప్రగతి కార్యక్రమంతో గ్రామాల ముఖ చిత్రాలు మారుతున్నాయని, ఈ ఆరు నెలల కాలంలో గతంలో ఎన్నడూ లేని విధంగా గ్రామాలు అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నాయని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి అన్నారు. టీఆర్‌ఎస్ అధికారంలోకి వచి్చన తర్వాత పల్లెల కోసం రూ.వేల కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. ప్రజలకు సేవ చేసే అవకాశం వచి్చందని, అందరూ వినియోగించుకోవాలని సూచించారు. అదనపు కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ..గ్రామాల్లో పచ్చదనం, పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యత నివ్వాలని సూచించారు. గ్రామంలో అభివృద్ధి, నిర్వహణ కోసం నాలుగు కమిటీలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎమ్మెల్సీ ఫరిదుద్దీన్ మాట్లాడుతూ..గ్రామాల్లో మార్పు కనిపిస్తుస్తోంని, అభివృద్ధి విషయంలో గతం కంటే బాగా మెరుగుపడిందని చెప్పారు. జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్‌రావు మాట్లాడుతూ..గ్రామాల్లో మొక్కలు విరివిగా నాటాలని, వర్షాలు బాగా కురుస్తాయని చెప్పారు. జెడ్పీ చైర్‌పర్సన్ పట్లోళ్ల మంజుశ్రీ మాట్లాడుతూ..బంగారు తెలంగాణ సాధనకు ప్రతి ఒక్కరూ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
ఎంపీడీఓకు సన్మానం
జిల్లాలోనే కంగ్టి మండలంలో ఎక్కువ గ్రామాల్లో డంప్‌యార్డులు, శ్మశాన వాటికలు పూర్తి చేయడానికి కృషి చేసిన ఎంపీడీఓ జైసింగ్‌ను మంత్రి హరీశ్‌రావు శాలువాతో సత్కరించారు. కంగ్టి మండలంలో 34 గ్రామాలకు గాను 24 గ్రామాలలో శ్మశాన వాటికలు, డంపింగ్ యార్డులు పూర్తి చేసినట్లు ఎంపీడీఓ వివరించారు. ఈ అధికారిని ఆదర్శంగా తీసుకొని ఈ నెలాఖరులోగా జిల్లాలోని అన్ని గ్రామాల్లో పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు.
సర్పంచ్‌లతో ముఖాముఖి
జిల్లాలోని పలు గ్రామాల్లో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై జిల్లాలోని పలువురు సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులు, ఎంపీడీఓలను మంత్రి వివరాలడిగి తెలుసుకున్నారు. గ్రామాల్లో డంపింగ్ యార్డులు, శ్మశాన వాటికలు ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని ఆయన వారికి సూచించారు. అదే విధంగా పొడి చెత్త, తడి చెత్తను వేరు చేయాలన్నారు. తడి చెత్త నుంచి వర్మీ కంపోస్ట్ ఎరువును తయారు చేయాలని తెలిపారు. ఇలా చేసిన వారిని సన్మానిస్తామని ఆయన వివరించారు. ప్రతీ ఇంటికి రెండు చెత్త బుట్టలను అందించాలన్నారు. పలువురు సర్పంచ్‌లు సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువచ్చారు.
ట్రాక్టర్ల పంపిణీ
జిల్లాలోని పలు గ్రామ పంచాయతీలకు ట్రాక్టర్లను మంత్రి హరీశ్‌రావు అందజేశారు. జిల్లాలోని 647 పంచాయతీలకు గాను ఇప్పటికే 410 అందించినట్లు తెలిపారు. మిగతా పంచాయతీలకు త్వరలో ట్రాక్టర్లను అందించే ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు.
కుటుంబీకులు హాజరు..
సాక్షి, సంగారెడ్డి: పట్టణంలో నిర్వహించిన పల్లె ప్రగతి–పంచాయతీరాజ్ సమ్మేళనం అనే అధికారిక కార్యక్రమంలో కొందరు మహిళా ప్రజాప్రతినిధులకు బదులు వారి కుటుంబీకులు, బంధువులు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి మంత్రి హరీశ్‌రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అధికారిక సమావేశానికి సర్పంచ్‌లు, గ్రామ పంచాయతీ కార్యదర్శులు, ఎంపీడీఓలను ఆహ్వనించారు. కాగా కొందరు మహిళా సర్పంచ్‌లకు బదులు వారి కుటుంబీకులు, బంధువులు హాజరవ్వడమే కాకుండా ఏకంగా మంత్రితో ముఖాముఖిలో పాలుపంచుకున్నారు. ఏకంగా ఓ సర్పంచ్ కుమారుడు మంత్రితో మా అమ్మ సర్పంచ్ సార్ అంటూ చెప్పడంతో ఆయన అవాక్కయ్యారు.
మీ అమ్మ రావాలి కాని..నీవు రావడమేమిటి.. మరోసారి ఇలా రావద్దంటూ హితవు పలికారు. నీవు వచ్చినా సరే.. మీ అమ్మను కూడా తీసుకురావాలి అంటూ మంత్రి అతనికి చెప్పారు. అదే విధంగా ఓ మహిళా సర్పంచ్‌కు బదులుగా ఆమె మామ సమావేశానికి వచ్చారు. ఆయన మంత్రికి సమస్యలు విన్నవించుకోవడం కొసమెరుపు. వీరే కాకుండా సుమారుగా 15 నుంచి 20 శాతం మంది మహిళా సభ్యులకు బదులుగా బంధువులు వచి్చనట్లు తెలుస్తోంది. జిల్లాలోని దాదాపుగా 70 నుంచి 80 శాతం గ్రామాలలో మహిళా ప్రజాప్రతినిధులకు బదులుగా పరిపాలనా వ్యవహారాలలో వారి కుటుంబీకులే పెత్తనం చెలాయిస్తున్నట్లు తెలుస్తోంది. మహిళలకు రాజకీయ అవకాశాలు, రిజర్వేషన్లు కల్పించాలనే ఉద్దేశంతో చట్టాలు చేస్తే వారి బదులుగా పురుషులే పరిపాలనలో జోక్యం చేసుకుని అన్నీ తామై చలాయిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment