సాక్షి, అమరావతి బ్యూరో: ‘స్పందన’లో వస్తున్న సమస్యల పరిష్కారానికి అధిక ప్రాధాన్యమివ్వాలని పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది అధికారులకు సూచించారు. ప్రజా హృదయ స్పందనను మానవీయ కోణంలో పరిశీలించి సంతృప్త స్థాయిలో పరిష్కారం చూపాలన్నారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో స్పందన అర్జీల పరిష్కారంపై కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాలకు చెందిన జిల్లా, పురపాలక, మండల స్థాయి అధికారులకు నిర్వహించిన అవగాహన సదస్సులో శుక్రవారం ఆయన మాట్లాడారు. జనవరి నుంచి అన్ని గ్రామ, వార్డు సచివాలయాలు పూర్తి స్థాయిలో పనిచేస్తాయని, వాటిలో స్పందన కౌంటర్లు నిర్వహిస్తారని తెలిపారు. ఇకపై స్పందనలో వచ్చే అర్జీల పరిష్కార తీరుపై సోషల్ ఆడిట్ నిర్వహించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయించారన్నారు. పెన్షన్, రేషన్, ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్ కార్డులను జనవరి నుంచి అందజేయడానికి ప్రభుత్వం సన్నద్ధమవుతోందన్నారు.
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ గిరిజాశంకర్ మాట్లాడుతూ స్పందనలో అర్జీలను చిరునవ్వుతో స్వీకరిస్తే సగం సమస్య పరిష్కరించినట్టేనన్నారు. ప్రజలకు సుపరిపాలన అందించడమే సీఎం లక్ష్యమని, అందుకనుగుణంగా అధికారులు వ్యవహరించాలని సూచించారు. రాష్ట్రంలో 53 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నామని, జనవరి నాటికి మరో 7 లక్షల మందికి ఇస్తామన్నారు. పట్టణ పాలన కమిషనర్ విజయకుమార్ మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులు ప్రజాసేవలో అంకితభావంతో నిష్పక్షపాతంగా పనిచేయాలన్నారు. సదస్సులో కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల కలెక్టర్లు ఇంతియాజ్, ముత్యాలరాజు, విజయవాడ నగరపాలకసంస్థ కమిషనర్ ప్రసన్న వెంకటేష్, పౌరసరఫరాల శాఖ సీఈవో అరుణ్‌బాబు, సెర్ప్ సీఈవో రాజబాబు, తదితరులు పాల్గొన్నారు.
‘స్పందన’ సమస్యలకు అధిక ప్రాధాన్యం
Published Sat, Nov 9 2019 4:57 AM | Last Updated on Sat, Nov 9 2019 4:57 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment