WhatsApp Scam: వాట్సాప్‌ లింక్‌ ద్వారా రూ.1.60 లక్షలు కాజేసిన సైబర్‌ కేటుగాళ్లు..! | Andhra Pradesh: Kurnool Man Clicks On WhatsApp Link, Loses 1.60 Lakh - Sakshi
Sakshi News home page

WhatsApp Scam: వాట్సాప్‌ లింక్‌ ద్వారా రూ.1.60 లక్షలు కాజేసిన సైబర్‌ కేటుగాళ్లు..!

Published Tue, Jan 30 2024 1:34 AM | Last Updated on Tue, Jan 30 2024 7:55 PM

- - Sakshi

బాధితుల సమస్యలు తెలుసుకుంటున్న ఎస్పీ కృష్ణకాంత్‌

కర్నూలు: ట్రేడ్స్‌ ఎక్స్‌ కంపెనీ పేరుతో సైబర్‌ నేరగాళ్లు తన వాట్సాప్‌కు లింక్‌ పంపి ఫోన్‌లో ఉన్న డేటా సేకరించి బ్యాంక్‌ ఖాతా నుంచి రూ.1.60 లక్షలు తీసుకుని మోసగించారని, చర్యలు తీసుకోవాలని ఎస్పీ కృష్ణకాంత్‌కు ఎమ్మిగనూరు పట్టణానికి చెందిన రిజ్వాన్‌ బాషా ఫిర్యాదు చేశారు. కర్నూలులోని రెండో పట్టణ పోలీస్‌స్టేషన్‌ పక్కనున్న క్యాంపు కార్యాలయంలో ఎస్పీ కృష్ణకాంత్‌ సోమవారం స్పందన కార్యక్రమాన్ని నిర్వహించారు.

జిల్లా నలుమూలల నుంచి వచ్చిన వారి నుంచి వినతులను స్వీకరించి వారితో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. స్పందన కార్యక్రమానికి మొత్తం 66 ఫిర్యాదులు వచ్చాయి. వాటన్నింటిపై చట్ట పరిధిలో విచారణ జరిపి బాధితులకు న్యాయం చేసేందుకు చర్యలు తీసుకుంటామని ఎస్పీ హామీ ఇచ్చారు. డీఎస్పీ శ్రీనివాసులు, లీగల్‌ అడ్వైజర్‌ మల్లికార్జునరావు తదితరులు స్పందనలో పాల్గొని ఫిర్యాదులు స్వీకరించారు.

స్పందనకు వచ్చిన ఫిర్యాదుల్లో కొన్ని...

● కన్సల్టెన్సీ పేరుతో కొంతమంది వ్యక్తులు ఉద్యోగాల పేరుతో డబ్బులు తీసుకుని మోసం చేశారని , విచారణ జరిపి డబ్బులు వాపసు ఇప్పించాల్సిందిగా కర్నూలుకు చెందిన విష్ణు కోరారు.

● ఆస్తి కోసం కుమారుడు తనను చంపుతానని బెదిరిస్తున్నాడని, రక్షణ కల్పించాల్సిందిగా హొళగుంద మండలం హెబ్బటం గ్రామానికి చెందిన ఈశ్వరప్ప వినతి పత్రం అందించారు.

● భూమిని దౌర్జన్యంగా ఆక్రమించి సర్వేయర్‌ను కొలతలు వేయనివ్వకుండా శ్రీనివాసులు, లక్ష్మీనారాయణ అనే వ్యక్తులు అడ్డుపడుతున్నారని ఓర్వకల్లు మండలం నన్నూరు గ్రామానికి చెందిన వెంకటస్వామి ఫిర్యాదు చేశారు.

● పొలం కౌలుకు తీసుకున్న వ్యక్తి నకిలీ అగ్రిమెంట్లు సృష్టించి మోసం చేశాడని, తన పొలానికి కోర్టు ఇంజెక్షన్‌ ఆర్డర్‌ ఉన్నప్పటికీ ఆరు ఎకరాల జొన్న పంటను దున్ని నాశనం చేసిన నగరూరు గ్రామానికి చెందిన రంగన్న, ప్రభాకర్‌లపై చర్యలు తీసుకోవాలని ఆస్పరి మండలం నగరూరు గ్రామానికి చెందిన హుసేనప్ప ఫిర్యాదు చేశారు.

● సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి వైఎస్సార్‌ జిల్లాకు చెందిన మంజునాథ్‌ రెడ్డి డబ్బులు తీసుకుని నకిలీ నియామక పత్రాలు పంపి మోసం చేశాడని నాగలాపురం గ్రామానికి చెందిన ఉపేంద్ర, కర్నూలుకు చెందిన విష్ణుచరణ్‌లు ఫిర్యాదు చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement