స్పందనలో అడిషనల్ ఎస్పీకి ఫిర్యాదు చేస్తున్న బాధితులు
కర్నూలు: హైదరాబాదులోని డిలైట్ కంపెనీలో డివోప్స్ ఉద్యోగం ఇప్పిస్తానని వైఎస్సార్ జిల్లాకు చెందిన ఆవూరి వెంకటేష్ సీనియర్ ఎక్స్‌పీరియన్స్ ఉందని టెలిగ్రామ్ యాప్‌లో పరిచయం చేసుకుని ఫోన్‌పే ద్వారా రూ.25 వేలు తీసుకుని మోసం చేశాడని కర్నూలు గణేష్ నగర్‌కు చెందిన జనార్ధన్ ఫిర్యాదు చేశారు. కర్నూలు రెండో పట్టణ పోలీస్‌స్టేషన్ పక్కనున్న ఎస్పీ క్యాంప్ కార్యాలయంలో అడిషనల్ ఎస్పీ టి.సర్కార్ స్పందన కార్యక్రమాన్ని నిర్వహించారు. స్పందనకు వచ్చిన వారి నుంచి వినతులను స్వీకరించి వారితో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. జిల్లా వ్యాప్తంగా స్పందనకు 123 ఫిర్యాదులు వచ్చాయి. చట్టపరిధిలో వాటిపై విచారణ జరిపి త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని అడిషనల్ ఎస్పీ హామీ ఇచ్చారు. డీఎస్పీ శ్రీనివాసులు కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు.
స్పందనకు వచ్చిన ఫిర్యాదుల్లో కొన్ని...
► నందవరం మండలం మిట్ట సోమాపురం గ్రామ శివారులో ఉన్న పొలంలో పండిన పత్తి, మిరపతో పాటు పైపులు, మోటార్లను గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించారని, విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఎమ్మిగనూరు పట్టణానికి చెందిన శేషన్న ఫిర్యాదు చేశారు.
► తుకారం అనే రియల్ ఎస్టేట్ వ్యాపారి మునగాలపాడు గ్రామ పరిధిలోని శ్రీలక్ష్మీ మెగా టౌన్‌షిప్‌లో ప్లాట్లకు 2008 సంవత్సరం నుంచి కంతుల ప్రకారం డబ్బులు కట్టించుకుని పూర్తి అయిన తర్వాత రశీదులు తీసుకుని రిజిస్ట్రేషన్ చేయకుండా మోసం చేశాడని కర్నూలు ఇందిరాగాంధీ నగర్‌కు చెందిన వీరన్న, యల్లప్ప ఫిర్యాదు చేశారు.
► ప్రభుత్వ పాఠశాల, కళాశాలలో క్లర్కు ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి కర్నూలుకు చెందిన లతీఫ్ నమ్మించి అందుకు రూ.3 లక్షలు ఖర్చు అవుతుందని రూ.20 వేలు అడ్వాన్స్‌గా తీసుకుని మోసం చేశాడని హొళగుంద మండలానికి చెందిన జేబుల్లా ఫిర్యాదు చేశారు.
► ఆస్తిలో వాటా అడిగినందుకు తనపై దాడి చేసి మానసికంగా, లైంగికంగా వేధిస్తున్న వ్యక్తిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సి.బెళగల్ మండలం పలుకుదొడ్డి గ్రామానికి చెందిన బోయ ఈశ్వరమ్మ ఫిర్యాదు చేశారు.
► తన తండ్రి షేక్ అన్వర్ ఆటోడ్రైవర్‌గా పనిచేస్తున్నాడని, గుర్తు తెలియని వ్యక్తులు చంపుతామని తనకు ఫోన్ చేస్తూ బెదిరించి రూ.60 వేలు తీసుకున్నారని కర్నూలు ఖండేరి వీధికి చెందిన షేక్ మహమ్మద్ గౌస్ ఫిర్యాదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment