నంద్యాల(బొమ్మలసత్రం): ఇంటర్ పరీక్షల్లో ఫెయిల్ అయ్యాననే మనస్థాపంతో నంద్యాల పట్టణానికి చెందిన వేమూరి రజిత(16) ఉరేసుకుని శుక్రవారం ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి తండ్రి తెలిపిన వివరాల మేరకు.. పట్టణంలోని కాళికాంబ దేవాలయం వీధిలో నివసిస్తున్న శ్రీనివాసులు, కుమారి దంపతులకు కుమార్తె రజిత, కుమారుడు మేఘనాథ్ సంతానం. శ్రీనివాసులు స్థానిక బైర్‌మల్ వీధిలో స్టీల్ సామన్ల వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కుమార్తె స్థానిక ప్రైవేటు కళాశాలలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం ఎంపీసీ చదువుతోంది.
శుక్రవారం ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాలు వెలువడటంతో ఇంటర్‌నెట్‌లో చూసుకునేందుకు వెళ్లింది. అక్కడ తాను ఫెయిల్ అయినట్లు తెలియడంతో దిగాలుగా ఇంటికి వచ్చింది. తల్లి కుమారి బయటకు వెళ్లడంతో ఇంట్లో ఉన్న ఫ్యాన్‌కు ఉరేవేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. రజిత తల్లి కొంత సేపటి తర్వాత ఇంటికి రాగానే కుమార్తె ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. గట్టిగా కేకలు వేయడంతో స్థానికులు ఘటనా స్థలానికి చేరుకుని కిందకు దింపారు. అప్పటికే రజిత మృతి చెందడంతో కుటుంబ సభ్యులు అంత్యక్రియలు జరిపేందుకు శ్మశానవాటికకు తీసుకెళ్లారు. విషయం తెలుసుకున్న వన్‌టౌన్ పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇంటర్ విద్యార్థి ఆత్మహత్యాయత్నం
బేతంచెర్ల: నంద్యాల జిల్లా బేతంచెర్ల మండలంలోని శంకరాపురం గ్రామానికి చెందిన విద్యార్థి మోడల్ స్కూల్లో సీఈసీ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. శుక్రవారం వెలువడిన ఇంటర్మీడియట్ ఫలితాల్లో వంశీ ఒక సబ్జెక్టు ఫెయిలయ్యాడు. మనస్థాపం చెందిన విద్యార్థి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన కుటుంబ సభ్యులు 108కు సమాచారం ఇచ్చారు. బేతంచెర్లలో ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం కర్నూలుకు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment