తనతో సహజీవనం చేస్తున్నాడంటూ ఫొటోలు పంపిన విశాఖపట్టణం యువతి
పెళ్లి రద్దు చేసుకున్న వధువు కుటుంబ సభ్యులు
వెల్దుర్తి(కృష్ణగిరి): మరో అరగంటలో జరగాల్సిన పెళ్లి నిలిచిపోయిన ఘటన బ్రహ్మగుండం క్షేత్రంలో బుధవారం చోటు చేసుకుంది. వెల్దుర్తి మండల పరిధిలోని రామళ్లకోటకు చెందిన యువకునికి కర్నూలు మండలానికి చెందిన యువతితో పెళ్లి కుదిరింది. రూ.లక్షల్లో కట్నకానుకలు పూర్తికాగా రామళ్లకోట టు వెల్దుర్తి రోడ్డులోని బ్రహ్మగుండం క్షేత్రంలో ఈనెల 20న ఉదయం 9గంటల ప్రాంతంలో పెళ్లికి ముహూర్తం కుదిరింది. తమ తమ ఇళ్ల వద్ద పెళ్లి ముందు కార్యక్రమాలు పూర్తి చేసుకుని వధూవరులు, కుటుంబ సభ్యులు, బంధువులు మంగళవారం రాత్రి బ్రహ్మగుండం చేరుకున్నారు. బుధవారం ఉదయం పెళ్లి తతంగం ప్రారంభమైంది.
వధూవరుల బంధువులు రామళ్లకోట, వెల్దుర్తి, కర్నూలు మండలాల నుంచి విచ్చేశారు. పెళ్లిళ్ల సీజన్ కావడంతో పలువురు బంధువులు పెట్టుబడులు చదివించేసి కూడా వెళ్లిపోయారు. పెళ్లి పీటల మీద కార్యక్రమం జరుగుతున్న సందర్భంలో పెళ్లి కుమార్తె తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులకు పెళ్లి కుమారుడు తనతో సహజీవనం చేస్తున్నాడంటూ విశాఖపట్నం నుంచి మాట్లాడుతున్నానంటూ అల్లూరి సీతారామరాజు జిల్లాకు చెందిన వివాహిత ఫోన్ ద్వారా సంప్రదించింది. తనను పెళ్లి కూడా చేసుకున్నాడు, పిల్లాడు ఉన్నాడంటూ ఫొటోలు షేర్ చేసింది. దీంతో పెళ్లి కుమారుడి అసలు బాగోతం తెలుసుకున్న వధువు కుటుంబ సభ్యులు పీటల వరకు వచ్చిన పెళ్లిని ఆపేశారు. వరుడిపై, అతని కుటుంబ సభ్యులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
గొడవకు దిగారు. దీంతో వరుడి తరపు గ్రామ పెద్దలు, బంధువులు కలుగజేసుకుని పంచాయతీ నిర్వహించి రూ.లక్ష కట్టించేలా, క్షమాపణలు చెప్పి పంపించారు. వరుడు విశాఖపట్నం నేవీ పోర్టు ప్రాంతంలో ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ అక్కడే సోషల్ మీడియా ద్వారా పరిచయమై కుమార్తె ఉన్న ఓ వివాహితతో సహజీవనం చేస్తున్నాడు. పెళ్లి వాగ్దానాలతో గడుపుతూ ఇక్కడ పెళ్లికి సిద్ధపడినట్లు తెలుస్తోంది. ఈ విషయం మంగళవారమే తెలుసుకున్న వివాహిత వెల్దుర్తి పోలీసులకు 100 కాల్ ద్వారా సంప్రదించి విషయం చేరవేసింది.
కేసు ద్వారా లేక స్వయంగానైనా లేక పెళ్లి అయినట్లు తగు సాక్ష్యాలతో విచారణ కోరాల్సిందిగా పోలీసులు తెలపడంతో వివాహిత యువతి స్వయంగా వధువు కుటుంబ సభ్యులను ఫోన్ ద్వారా సంప్రదించి తనతో వరుడు గడిపిన ఫోటోలు షేర్ చేసి పెళ్లి ఆపినట్లు తెలుస్తోంది. తాను తన అక్కతో విశాఖపట్టణం నుంచి రామళ్లకోటకు బయలుదేరుతున్నట్లు వరుడి కుటుంబ సభ్యులకు తెలిపినట్లు సమాచారం. వరుడు తన స్వగ్రామంలో సైతం పలువురిని నమ్మించి తను పోర్టు ప్రాంతం నుంచి చవకగా బంగారు ఇప్పిస్తానంటూ డబ్బులు వసూలు చేసినట్లు చర్చ జరుగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment