ఎన్నికల కమిషన్ పరిధిపై 2008 జూలై 28న కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ జారీ చేసిన ఉత్తర్వులు
సాక్షి, అమరావతి: అఖిల భారత సర్వీసు అధికారులను అభిశంసించే అధికారం ఒక రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు ఉంటుందా? రాష్ట్ర ప్రభుత్వంతో నిమిత్తం లేకుండా, కనీసం వివరణ అయినా కోరకుండా తనంత తాను నేరుగా చర్యలు తీసుకోవడానికి ఉపక్రమించవచ్చా.. అసలు నిబంధనలు ఏమి చెబుతున్నాయి? ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్ అడ్డగోలుగా తనకు లేని అధికారాలను దొడ్డిదారిన చెలాయించడానికి ఎందుకు ప్రయత్నిస్తున్నారు? ఆయన వ్యవహార శైలి.. దుందుడుకు నిర్ణయాలు.. ఉన్నతాధికార వర్గాలలోనే కాదు సామాన్య ప్రజలలోనూ తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. అధికారులను భయపెట్టి తాను అనుకున్నది చేయాలనుకుంటున్నారని, అందుకే తనకు లేని అధికారాలను చలాయించేందుకు నిమ్మగడ్డ ప్రయత్నిస్తున్నారని రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు. చదవండి: టీడీపీ కుట్రకు యాప్ దన్ను
పంచాయతీ ఎన్నికల ఓటర్ల జాబితా తయారీలో నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేదీ, కమిషనర్ గిరిజా శంకర్‌లపై నిమ్మగడ్డ నేరుగా సెన్సూర్ ప్రొసీడింగ్స్ జారీ చేసిన సంగతి తెల్సిందే. అయితే ఈ ప్రొసీడింగ్స్ అర్థం లేనివని, న్యాయస్థానం ఎదుట నిలబడవని ఉన్నతాధికారి ఒకరు స్పష్టం చేశారు. అధికారుల వివరణ కోరకుండా కేంద్ర ఎన్నికల కమిషన్ సైతం చర్యలకు సిఫార్సు చేయదని, అలాంటిది ఎస్‌ఈసీ నేరుగా చర్యలకు ఉపక్రమించడం ద్వారా తన పరిధిని అతిక్రమించారని అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. చదవండి: ప్రజారోగ్యానికి ప్రాధాన్యం: సీఎం జగన్
‘ఎన్నికల విధుల్లో ఎవరైనా అధికారి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కమిషన్ తొలుత వారి నుంచి వివరణ కోరుతుంది. దీనిపై సంతృప్తి చెందని పక్షంలో క్రమశిక్షణ చర్యల కోసం సంబంధిత అథారిటీకి సిఫార్సు చేస్తుంది. అంతేగానీ నేరుగా చర్యలు తీసుకోదు’ అని ఓ ఉన్నతాధికారి చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో ఎన్నికల సమయంలో ఓ ఐపీఎస్ అధికారి ఓ పార్టీ నాయకుడిని కలవడాన్ని తప్పుబడుతూ కేంద్ర ఎన్నికల కమిషన్ క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని భావించింది. అయితే అది రాష్ట్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది తప్ప నేరుగా చర్యలకు ఉపక్రమించలేదని ఉన్నతాధికార వర్గాలు గుర్తు చేస్తున్నాయి.
నిబంధనలు ఏమి చెబుతున్నాయి..?
ప్రభుత్వ అధికారులపై క్రమశిక్షణ చర్యలకు సంబంధించి ఎన్నికల కమిషన్ పరిధిపై సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో 2000 నవంబర్ 7వతేదీన కేంద్ర సిబ్బంది వ్యవహారాల మంత్రిత్వ శాఖ (డీవోపీటీ) స్పష్టంగా ఓ ఆఫీస్ మెమొరాండం జారీ చేసింది. దాని ప్రకారం అఖిల భారత సర్వీసు అధికారులపై క్రమశిక్షణ చర్యలకు సిఫార్సు చేసే అధికారం మాత్రమే ఎన్నికల కమిషన్‌కు ఉంది. అంతిమంగా క్రమశిక్షణ చర్యలు తీసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకే ఉంటుంది. ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులపై చర్యలకు సంబంధించి ఎన్నికల కమిషన్ పరిధిని స్పష్టం చేస్తూ 2008 జూలై 28వ తేదీన కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ మరో మెమొరాండం జారీ చేసింది.
ఆ మెమొరాండం ప్రకారం ఎవరిపైన అయినా చర్యలు తీసుకోవాలనుకుంటే ఎన్నికల కమిషన్‌కు సిఫార్సు చేసే అధికారం మాత్రమే ఉంటుంది. సంబంధిత అథారిటీ మాత్రమే చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఎన్నికల కమిషన్ సిఫార్సు చేసిన ఆరు నెలల్లోగా చర్యలు తీసుకుని ఆ విషయాన్ని కమిషన్‌కు తెలియజేయాల్సి ఉంటుంది. క్రమశిక్షణ చర్యలను ఉపసంహరించాలన్నా సంబంధిత అథారిటీ ఆ అధికారి నుంచి లిఖిత పూర్వక వివరణ తీసుకుని ఎన్నికల కమిషన్ దృష్టికి తెచ్చి తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. దీనిని బట్టి అర్థం కావడం లేదూ నిమ్మగడ్డ ఎంత బరితెగించి వ్యవహరించారో అని అధికార వర్గాలు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నాయి.
ప్రభుత్వ అధికార పరిధిలోకి చొరబడటమే..
నిమ్మగడ్డ అడ్డగోలు ప్రొసీడింగ్స్ వ్యవహారాన్ని రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. నిమ్మగడ్డ తన పరిధిని దాటి ప్రభుత్వ అధికార పరిధిలోకి చొరబడుతున్నారని ఉన్నతాధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. లేని అధికారాలతో నిమ్మగడ్డ ఏకపక్షంగా, నిబంధనలకు విరుద్ధంగా ద్వివేది, గిరిజాశంకర్‌లపై సెన్సూర్ ప్రొసీడింగ్స్ ఇచ్చినందున వాటిని తిరస్కరిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ ఉత్తర్వులిచ్చారు. అఖిల భారత సర్వీసు అధికారుల నిబంధనల మేరకు వారిపై చర్యలు తీసుకునే పరిధి రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు లేదని స్పష్టం చేశారు.
రాష్ట్ర క్యాడర్‌లో పనిచేసే అఖిల భారత సర్వీసు అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రమే ఉంటుందని స్పష్టం చేశారు. నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకోవాల్సిందిగా ఎన్నికల కమిషన్ సిఫార్సు మాత్రమే చేయగలదని పేర్కొన్నారు. ఎస్‌ఈసీ జారీ చేసిన సెన్సూర్ ప్రొసీడింగ్స్ రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న అధికార పరిధిలోకి చొచ్చుకుని రావడమేనని, ఇది చట్టపరమైన తప్పిదమన్నారు. నిబంధనలు పాటించకుండా జారీ చేసిన ‘సెన్సూర్’ను తిరస్కరిస్తున్నట్లు స్పష్టం చేశారు. సెన్సూర్ ప్రొసీడింగ్స్ విషయంలో మాత్రమే కాదు ఇద్దరు కలెక్టర్లు, ఓ ఎస్పీని బదిలీ చేయాలని ప్రభుత్వానికి రాసిన లేఖలో కూడా నిమ్మగడ్డ అభ్యంతరకర పదజాలాన్ని వాడారని అధికారులు గుర్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment