సాక్షి, అమరావతి: పంచాయతీ ఎన్నికలను ఈ నెల 8న షెడ్యూల్‌లో ప్రకటించినట్లుగానే ఫిబ్రవరి 5, 9, 13, 17వ తేదీల్లో నాలుగు విడతల్లో నిర్వహించనున్నట్టు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ పేర్కొన్నారు. ఈమేరకు గురువారం ఆయన మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. ఎన్నికలపై గురువారం హైకోర్టు తీర్పు వెలువరించిన నాటి నుంచే రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చినట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంత ఓటర్లను ప్రభావితం చేసేలా ప్రజా ప్రతినిధులెవరూ సంక్షేమ పథకాల పంపిణీలో భాగస్వాములు కారాదని సూచిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సమాచారం ఇచ్చినట్లు చెప్పారు.
ఎన్నికల ఏర్పాట్లపై చర్చించేందుకు త్వరలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. పోలింగ్ విధుల్లో పాల్గొనే సిబ్బంది, భద్రతకు సంబంధించి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందన్నారు. హైకోర్టు తీర్పు వెలువరించిన వెంటనే ముందుగా విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారమే పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్‌కు నిమ్మగడ్డ లేఖ రాసినట్లు సమాచారం. ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లపై సమీక్షించేందుకు కలెక్టర్లతో సమావేశం ఏర్పాటు చేయాలంటూ సీఎస్‌కు ఆయన మరో లేఖ రాసినట్లు తెలిసింది. మరోవైపు నిమ్మగడ్డ 13 జిల్లాల కలెక్టర్లకు ఫోన్ చేసి.. ఎన్నికల నిర్వహణకు సంబంధించిన పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. కాగా పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్ గిరిజా శంకర్ శుక్రవారం సాయంత్రం 4కి తనతో సమావేశం కావాలని నిమ్మగడ్డ సూచించినట్లు తెలిసింది.
‘పంచాయతీ’ పాత తేదీల్లోనే!
Published Fri, Jan 22 2021 8:23 AM | Last Updated on Fri, Jan 22 2021 7:04 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment