ఆంధ్రప్రదేశ్ మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కొత్త పాత్రలో ప్రవేశించారు. ఆయన ఏదో నిష్పాక్షికమైన వ్యక్తిగా కనిపిస్తూ, ప్రతిపక్ష తెలుగుదేశం, జనసేన కూటమికి మేలు చేయాలని సంకల్పించినట్లు కనబడుతోంది. ఆయన నిజాయితీగా ఓటర్లకు విషయ అవగాహన కోసం కృషి చేస్తే తప్పులేదు. ఓట్ల నమోదు, ఓట్ల తొలగింపు వంటి విషయాలలో ఏవైనా అవకతవకలు జరుగుతుంటే వాటిని చెప్పడం ఆక్షేపణీయం కాదు. కానీ, ఆయన ప్రస్తుతం ఏపీలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిని బద్నాం చేసే దురుద్దేశంతో కొత్త పన్నాగం పన్నుతున్నారన్న అనుమానం వ్యక్తం అవుతోంది.
ఎందుకంటే తెలంగాణలో ఎన్నికలు జరుగుతుంటే, ఆయన ఏపీలో ఓటర్ల జాబితా గురించి, ఇతర అంశాల గురించి మీడియా సమావేశాలు పెట్టి, ఎన్నికల సంఘానికి సలహాలు ఇవ్వడమే సందేహాలకు తావిస్తోంది. ఆయన కేవలం ఏపీ కోసమే తన సంస్థను ఆరంభించారేమో తెలియదు. సిటిజన్స్ ఫర్ డెమొక్రసీ పేరు ఉంటే ఎక్కడ ఏ రాష్ట్రంలో అయినా ఎన్నికలు జరుగుతున్న చోట ఎన్నికలలో అక్రమాలు జరగకుండా, ఓటర్ల హక్కులు తెలియచేసే విధంగా కృషి చేస్తారని అనుకుంటాం. కానీ, ఆయన మరో ఐదు నెలల తర్వాత కానీ.. ఎన్నికలు రాని ఏపీపై దృష్టిపెట్టారు. అంటే దీని బట్టి ఏం అర్ధం అవుతుంది. ఆయనకు ఏపీపైన, ఏపీ రాజకీయాలపైనే ఆసక్తి అని. నిత్యం ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి తెలుగుదేశం పత్రికలు రాస్తున్న అసత్య కథనాల ఆధారంగా ఆయన మాట్లాడుతున్నారు.
ఓట్ల నమోదు సరిగా లేదని, ఇష్టాసుసారం ఓట్లు తొలగిస్తున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయని, ప్రత్యర్ది రాజకీయ పార్టీలపై కేసులు పెడుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయని, ఇలా రకరకాల వ్యాఖ్యలు చేశారు. అందుకు నిర్దిష్టంగా ఆధారాలు ఏమీ చూపలేదు. కాకపోతే వైఎస్సార్‌సీపీపై సంశయాలు రేపే విధంగా మాట్లాడారు. స్థానికంగా లేకపోయినా ఓటు హక్కు కల్పించాలని ఆయన సూచిస్తున్నారు. తద్వారా దొంగ ఓట్లకు ఆయనే స్వాగతం చెబుతున్నారన్నమాట. తెలుగు రాష్ట్రాలలో ఎన్ని లక్షల డబుల్ ఓట్లు ఉన్నాయో ఆయనకు తెలియదా? ఒకప్పుడు బస్సుల్లో హైదరాబాద్, తదితర ప్రాంతాల నుంచి ఏపీకి తరలించి ఓట్లు వేయించిన ఘట్టాలు తెలియవా! అన్ని పార్టీలు ఇలా చేస్తుండవచ్చు. ఇలాంటి వాటికి బ్రేక్ వేయాలని చెప్పాల్సిన మాజీ ఎన్నికల కమిషనర్ వాటిని ప్రోత్సహించే విధంగా మాట్లాడుతున్నారు.
అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఎన్నికైన విధానాన్ని ప్రస్తావించడం ఎందుకో తెలియదు. ఓటర్ల వ్యక్తిగత సమాచారం, వారిని ప్రభావితం చేసే వారి వివరాలు సేకరిస్తున్నారని ఆయన అంటున్నారు. నిజానికి అన్ని పార్టీల వారికి, వారి స్థానిక నాయకుల వద్ద ఎవరు ఎటు వైపు ఉంటారో నిర్దిష్టంగా తెలుస్తూనే ఉంటుంది. ఇందులో ఆయన కనిపెట్టింది ఏమిటో తెలియదు. ఓట్లు వేయకపోతే స్కీములు రద్దు అవుతాయని ప్రచారం చేస్తున్నారట. నిజంగానే ఆ పని జరిగేటట్లయితే, కులం చూడను, ప్రాంతం చూడను, పార్టీ చూడను అని ముఖ్యమంత్రి జగన్ అధికారంలోకి రాగానే చెప్పి, అర్హులైన అందరికి స్కీములు అమలు చేసింది వాస్తవం కాదా!.
మరి అదే చంద్రబాబు పాలనలో జన్మభూమి కమిటీలు, తెలుగుదేశం నేతలు చెప్పిన వారికి, లంచాలు ఇచ్చినవారికే స్కీములు అమలు జరిగిన విషయం రమేష్‌కు తెలియదా!. చంద్రబాబే కలెక్టర్ల సమావేశంలో టీడీపీ వారికే పనులు చేయాలని ఆదేశించిన విషయం బహుశా నిమ్మగడ్డ కావాలని మర్చిపోయి ఉండవచ్చు. చివరికి రేషన్ కార్డు పొందడానికి కూడా ఎన్ని కష్టాలు పడాల్సివచ్చేది?. అలాంటిది ఇప్పుడు అర్హత ఉంటే వలంటీరే రేషన్ కార్డు ఇంటికి తెస్తుంటే, అది కూడా ఓట్ల కోసమేనని నిమ్మగడ్డ వంటివారు భావిస్తే, వలంటీర్లు బెదిరిస్తున్నారని చెబితే నమ్మడానికి ప్రజలు వెర్రివెళ్లు కారు. ఎక్కడైనా ఒకటి, అరా ఘటనలు జరిగితే సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయవచ్చు. తప్పు సరిదిద్దవచ్చు.
తెలుగుదేశం పార్టీవారు గతంలో సేవా మిత్రలకు ట్యాబ్‌లు ఇచ్చి ఏ పార్టీకి ఓటు వేస్తారో కూడా అడిగి తెలుసుకున్న ఘటనలు జరగలేదా?. ఓటర్ల డేటా అంతటిని హైదరాబాద్‌లోని ఒక కంపెనీకి పంపించారా? లేదా?. వారిపై కేసులు పెట్టారా? లేదా? అప్పుడు నోరు కుట్టేసుకోకుండా, గట్టిగా అభ్యంతరం చెప్పి ఉంటే, ఇప్పుడు నైతికంగా ఆయన ఏం మాట్లాడడానికైనా అర్హత వచ్చేది. అంతేకాదు.. స్థానిక ఎన్నికల సమయంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా ఆయన చేసిన విన్యాసాలు జనం మర్చిపోయారా?. కరోనా సంక్షోభంలో ఆయన వ్యవహరించిన తీరు, ప్రభుత్వం ఎన్నికలు వాయిదా వేయండని కోరితే అంగీకరించకుండా, ఆ తర్వాత చెప్పాపెట్టకుండా వాయిదా వేసిన తీరు.. ఇదంతా ప్రతిపక్ష తెలుగుదేశం, టీడీపీ అధినేత చంద్రబాబుకు మేలు చేయడానికేనని అప్పట్లో విమర్శలు వచ్చాయా? లేదా?. చివరికి టీడీపీ ఆఫీసులో తయారైన లేఖనే తన లెటర్‌గా సంకతం చేసి కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వంపై ఫిర్యాదు చేసి అప్రతిష్టపాలయ్యారా? లేదా?. ఆయన వచ్చి జనానికి ప్రజాస్యామ్యం గురించి నీతి బోధలు చెబితే దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా కనిపించదా!.
గతంలో తక్కువ సంఖ్యలో ఫిర్యాదులు నమోదవుతుంటే, ఎవరు ఫిర్యాదు చేసినా తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చారని ఆయనే చెప్పారు. మళ్లీ ఇప్పుడు వచ్చిన ఫిర్యాదులను నమోదు చేస్తుంటే, రాజకీయ ప్రత్యర్ధులపై కేసులు పెడుతున్నారని అంటున్నారు. తప్పుడు కేసులు పెట్టాలని ఎవరం చెప్పం. చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్‌లు టీడీపీ కార్యకర్తలను రెచ్చగొట్టి ఎన్ని కేసులు పెట్టించుకుంటే అంత పెద్ద పదవి ఇస్తామని, నలభైఎనిమిది గంటల్లో బెయిల్ ఇప్పిస్తామని చెప్పినప్పుడు ఈ ప్రజాస్వామ్య సంస్థ ఎక్కడకు వెళ్లింది. అంగళ్లు, పుంగనూరుల వద్ద చంద్రబాబు, భీమవరం వద్ద లోకేశ్‌లు రెచ్చగొట్టిన ఫలితంగా టీడీపీ కార్యకర్తలు అరాచకాలకు పాల్పడితే వారిపై కేసులు పెట్టాలా? వద్దా? అన్నది కూడా నిమ్మగడ్డ చెప్పాలి కదా!.
పుంగనూరులో ఏకంగా టీడీపీ కార్యకర్తలు పోలీసు వాహనాన్ని దగ్దం చస్తే , ఒక కానిస్టేబుల్ కన్ను పోగొడితే చర్యలు తీసుకోవాలా? వద్దా?. అదేదో మాచ్ ఫిక్సింగ్ ప్రెస్ కాన్ఫరెన్స్ అనుకుంటా! ఒక విలేకరి అరవై వేల కేసులు పెట్టారని అనగానే ఈయన ఎలా స్పందించాలి? అన్ని కేసులు ఎందుకు ఉంటాయి? వాటి గురించి తాను తెలుసుకుంటానని అనకుండా అదేదో నిజమైన పాయింట్ మాదిరి మాట్లాడడం సబబా?. టీడీపీ చేర్చిన దొంగ ఓట్లను తీయకూడదని ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి మీడియా సంస్థలు ఉద్యమం మాదిరి వార్తలు రాస్తుంటే వాటిని వెరిఫై చేయకుండా ఎలా సమర్ధిస్తారు?. రిటైర్డ్ డీజీపీలతో కమిటీ వేయాలనో, ఇంకొక సూచన చేస్తున్న ఈయన తాను ఎన్నికల కమిషనర్‌గా ఉన్నప్పుడు ఆ ప్రయత్నం ఎందుకు చేయలేదు?. కేవలం టీడీపీ వారు ఏమి చెబితే అదే ఎందుకు చేశారు?.
మరోవైపు పోలీసు వ్యవస్థపై తనకు నమ్మకం ఉందని చెబుతారు?. ఇంకోవైపు టీడీపీ మీడియా చేసే గోలను సమర్ధిస్తుంటారు. ఎన్నికలు సక్రమంగా, సజావుగా జరగడానికి ఎవరు కృషి చేసినా తప్పు లేదు. కానీ, ముసుగేసుకుని అదేదో స్వతంత్ర సంస్థ అనుకునేలా, తమకు ఉన్న గత హోదాను అడ్డం పెట్టుకుని పరోక్ష రాజకీయం చేయాలని చూడటమే మోసంగా కనిపిస్తుంది. ఏది ఏమైనా వచ్చే నాలుగు నెలల్లో మరిన్ని బోగస్ సంస్థలు ఏపీలో ప్రవేశించి ప్రజలను రకరకాల రూపాలలో గందరగోళంలోకి నెట్టాలని చూస్తాయి. కనుక అంతా అప్రమత్తంగా ఉండాల్సిందే.
::కొమ్మినేని శ్రీనివాస రావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్
Comments
Please login to add a commentAdd a comment