Retirement Day: AP SEC Nimmagadd Ramesh Kumar Retirement Press Meet - Sakshi
Sakshi News home page

ప్రభుత్వ సాయంతోనే ఇది సాధ్యమైంది: నిమ్మగడ్డ

Published Wed, Mar 31 2021 11:23 AM | Last Updated on Wed, Mar 31 2021 1:06 PM

Retirement Day: Nimmagadda Ramesh Kumar Press Meet - Sakshi

సాక్షి, విజయవాడ: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో ప్రభుత్వం నుంచి తనకు పూర్తి సహకారం లభించిందని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు సమన్వయంతో అద్భుతంగా పనిచేశారని కొనియాడారు. రాష్ట్ర ఎన్‌ఈసీగా విధులు నిర్వహిస్తున్న నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ నేడు(మార్చి 31) పదవీ విరమణ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజల నుంచి, మీడియా ద్వారా అపూర్వ సహకారం అందిందన్నారు. తనకు అందించిన సహకారం ఎంతో విలువైనదని, ఎన్నికల కమిషనర్‌గా విధులు నిర్వహించడం సంతృప్తి కలిగించిందన్నారు. ఎక్కడా రీపోలింగ్‌కు అవకాశం లేకుండా స్థానిక సంస్థల ఎన్నికలు జరిపామని, అధికారులు సిబ్బంది ఎంతో నిబద్దతతో పనిచేసి ఎన్నికలు సజావుగా నిర్వహించారని ప్రశంసించారు. ప్రభుత్వం పూర్తి సహకారం అందిందని, ప్రభుత్వ సాయంతోనే ఇదంతా సాధ్యమైందన్నారు.

రాజ్యాంగ వ్యవస్థలను గౌరవించాలి
‘సీఎస్, డీజీపీ సహా కలెక్టర్లు ఎస్పీలు పూర్తిగా సహకరించారు. రాష్ట్రంలో ఎన్నికలు పారదర్శకంగా జరపాలని హైకోర్టు ఆదేశించింది. మా బాధ్యతలు నిర్వహించడంలో హైకోర్టు మాకు సంపూర్ణ సహకారంగా అందించింది. రాజ్యాంగ వ్యవస్థలను ప్రతి ఒక్కరూ గౌరవించాలి. చట్ట సభలపట్ల పూర్తి విశ్వాసం ఉండాల్సిందే. నేను 7 ఏళ్లపాటు గవర్నర్ కార్యదర్శిగా కూడా గతంలో పనిచేశాను. రాజ్యాంగ వ్యవస్థలపై నాకు అపార విశ్వాసం ఉంది. నామినేషన్ల ఉపసంహరించడంపై హైకోర్టు ఆదేశాలను శిరసావహించా. వ్యవస్థలో మార్పులు రావాల్సిన అవసరం ఉంది. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధమైన మంచి పద్దతి అమల్లో ఉంది. అన్నింటినీ నివేదిక రూపంలో క్రోడీకరించి వాటిని అమలు చేయాలని గవర్నర్‌కు నివేదిక అందిస్తా. చేయాల్సిన సంస్కరణలపై నివేదికలో పొందుపరిచా. సిఫార్సులు అమలు చేస్తే శాశ్వత ప్రయోజనాలు కలుగుతాయి. 

నాకు వారసులుగా నీలం సాహ్ని ఎస్ఈసీగా బాధ్యతలు నిర్వహిస్తారు. ఎస్ఈసీ నీలం సాహ్నికి అభినందనలు తెలియజేశాను. నేనెప్పుడూ అధికారిక సమాచారాన్ని బయటకు లీక్ చేయలేదు. వ్యవస్థకు సంబంధించి స్వతంత్రత, నిబద్దతపై ఎవరూ రాజీ పడటానికి వీల్లేదు. రాజ్యాంగ వ్యవస్థలు స్వతత్రంగా పనిచేయాలనేదే నా అభిప్రాయం. ప్రభుత్వంతో స్నేహపూర్వక వాతావరణం, తోడ్పాటు ఉన్నప్పుడే మెరుగైన పనితీరు వస్తుంది. అందరి సహకారం వల్లే ఎన్నికలను సజావుగా నిర్వహించగలిగాను.’ అని పేర్కొన్నారు.

చదవండి: 
విజయవాడ రిటైనింగ్‌ వాల్‌కు సీఎం జగన్‌ శంకుస్థాపన 

నిమ్మగడ్డకు నో అపాయింట్‌మెంట్

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement