వైఎస్సార్ సీపీకి రాష్ట్ర ఈసీ ‘గుర్తింపు’
* రాష్ట్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ
* మున్సిపల్, మండల, జిల్లా పరిషత్ ఎన్నికల్లో విప్ జారీ అధికారం
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర ఎన్నికల కమిషన్ గుర్తింపు కూడా లభించింది. ఇప్పటి వరకూ రిజిస్టర్‌డ పార్టీగానే పరిగణిస్తూ వచ్చిన ఈ పార్టీని ఇకపై గుర్తింపు పొందిన రాష్ట్ర పార్టీగా పేర్కొంటూ రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యదర్శి నవీన్ మిట్టల్ గురువారం నోటిఫికేషన్ జారీ చేశారు. వైఎస్సార్‌సీపీ గుర్తింపు పొందిన పార్టీ కాదని, ఆ పార్టీకి స్థానిక సంస్థ ల పాలకవర్గాల ఎన్నికల్లో ‘విప్’ జారీ చేసే అధికారం లేదంటూ రాజకీయ ప్రత్యర్థులు చేస్తున్న ప్రచారానికి దీంతో తెరపడింది.
కేంద్ర ఎన్నికల కమిషన్ ఇప్పటికే వైఎస్సార్ సీపీని గుర్తింపు పొందిన రాష్ట్ర పార్టీగా పరిగణిస్తూ ఆదేశాలిచ్చినందున, ఆ నిర్ణయాన్ని అనుసరించి రాష్ట్ర ఎన్నికల కమిషన్ కూడా అదే విధమైన ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలో శాసనసభ, కేంద్రంలో లోక్‌సభ కొలువుదీరిన అనంతరం జరగబోయే మండల, జిల్లా పరిషత్ అధ్యక్ష పదవులు, మున్సిపల్ చైర్మన్, కార్పొరేషన్ మేయర్ పదవులకు జరిగే ఎన్నికల్లో తమ పార్టీ సభ్యులకు ఫలానా వారికి ఓటు చేయాలని ‘విప్’ (ఆదేశాలు) జారీ చేసే అధికారం వైఎస్సార్ కాంగ్రెస్‌కు ఇపుడు లభించింది.
స్థానిక సంస్థల చట్టాలను పరిశీలించి నిర్ణయం..
కేంద్ర ఎన్నికల కమిషన్ తమకు గుర్తింపు ఇచ్చిన విషయాన్ని తెలియజేస్తూ వైఎస్సార్‌సీపీ సంస్థాగత వ్యవహారాల రాష్ట్ర కో-ఆర్డినేటర్ ఈ నెల 27న తమకు ఒక లేఖను సమర్పించారని, దానిలోని అంశాలను పరిశీలించి తాము ఈ గుర్తింపునిస్తున్నామని రాష్ట్ర కమిషన్ జారీ చేసిన నోటిఫికేషన్‌లో పేర్కొంది. ఏపీ పంచాయతీరాజ్ చట్టం-1994, జీహెచ్‌ఎంసీ చట్టం- 1955, ఏపీ మున్సిపాలిటీల చట్టం-1965 ప్రకారం, 1968లో జారీ అయిన కేంద్ర ఎన్నికల కమిషన్ చిహ్నా ల కేటాయింపు ఆదేశాల ప్రకారం వైఎస్సార్‌సీపీ అన్ని రకాల అర్హతలను పూర్తి చేసినందున గుర్తింపు పొందిన రాష్ట్ర పార్టీ హోదా ఇవ్వడంతో పాటు ‘సీలింగ్ ఫ్యాన్’ చిహ్నాన్ని కేటాయిస్తున్నట్లు కమిషన్ పేర్కొంది.