
సాక్షి,, అమరావతి: ఓటర్ల జాబితాలో తప్పులు సరి చేసేందుకు, మార్పులు, చేర్పులు చేసుకునేందుకు సెప్టెంబర్ ఒకటి నుంచి 30 వరకూ ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి విజయానంద్ తెలిపారు. సచివాలయంలోని తన కార్యాలయంలో శుక్రవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రత్యేక సవరణ కార్యక్రమంలో ఓటరు కార్డులోని పేర్లలో తప్పులు, బంధుత్వాలు, చిరునామాల్లో తేడాలు వంటి వాటిని సరి చేసుకునే అవకాశం ఉంటుందన్నారు. సెప్టెంబర్ ఒకటి నుంచి అన్ని పోలింగ్ బూత్‌ల్లోనూ బూత్ లెవల్ ఆఫీసర్లు (బీఎల్‌వోలు) అందుబాటులో ఉంటారని చెప్పారు.
జిల్లా కలెక్టర్, ఆర్డీవో, తహసీల్దార్ కార్యాలయాల్లోనూ సవరణలకు ప్రత్యేక విభాగాలు పనిచేస్తాయని వెల్లడించారు. రాష్ట్రంలో ఉన్న 11 వేల మీసేవా కేంద్రాల్లోనూ మార్పులు, చేర్పులకు అవకాశం ఉంటుందని వివరించారు. దీనికోసం ఓటర్లు తమ పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్, రేషన్ కార్డ్, ప్రభుత్వ, ప్రభుత్వ అనుబంధ సంస్థలు జారీ చేసిన గుర్తింపు కార్డులు, బ్యాంక్ పాస్‌బుక్, రైతు గుర్తింపు కార్డుల్లో ఏదో ఒక దాన్ని చూపిస్తే సరిపోతుందని పేర్కొన్నారు. ఎన్‌వీఎస్‌పీ (నేషనల్ ఓటర్స్ సర్వీస్ పోర్టల్), ఓటర్ హెల్ప్‌లైన్ యాప్, 1950 కాల్ సెంటర్ ద్వారా కూడా సవరణలకు అవకాశం ఉంటుందన్నారు.
మార్పులు, చేర్పుల కోసం ఫామ్–8, మృతి చెందిన, చిరునామా మారిన ఓటర్ల కోసం ఫామ్–7 పోలింగ్ బూత్‌లు, ఆయా కార్యాలయాల్లో అందుబాటులో ఉంటాయన్నారు. బీఎల్‌వోలు క్షేత్ర స్థాయిలో నిర్ధారణ చేశాక మార్పులకు తగిన చర్యలు తీసుకుంటారని తెలిపారు. సవరణ తర్వాత అక్టోబర్ 15న ముసాయిదా ఓటర్ల జాబితాను, 2020, జనవరిలో తుది జాబితాను ప్రచురిస్తామని చెప్పారు.