సీఐపై రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు | Complaint with the State Election Commission ci | Sakshi
Sakshi News home page

సీఐపై రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు

Published Sun, Mar 23 2014 12:08 AM | Last Updated on Wed, Mar 28 2018 10:59 AM

Complaint with the State Election Commission ci

 ఘట్‌కేసర్, న్యూస్‌లైన్: ఎంపీటీసీ ఎన్నికల నేపథ్యంలో అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ.. ఓటర్లను భయభ్రాంతులకు గురిచేస్తున్న సీఐ జగన్‌పై తగిన చర్యలు తీసుకోవాలని మండలంలోని చౌదరిగూడ మాజీ సర్పంచ్, టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు  బైరు రాములు శనివారం రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. మండలంలోని కొర్రెముల గ్రామానికి చెందిన గ్యార జగన్ నగరంలో సీఐగా విధులుగా నిర్వహిస్తున్నారు.

 ఆయన తండ్రి లక్ష్మయ్య ప్రస్తుతం ఎంపీటీసీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. తన తండ్రిని ఎంపీటీసీ ఎన్నికల్లో ఎలాగైనా గెలిపించుకోవాలని రాత్రి 11 గంటలకు ప్రభుత్వ వాహనంలో వచ్చి కొర్రెముల గ్రామ పరిథిలోని పలు కాలనీలో తిరుగుతూ సమావేశాలు నిర్వహిస్తూ విచ్చలవిడిగా డబ్బులు, మద్యం పంపిణీ చేస్తున్నారని ఫిర్యాదులో ఆరోపించారు.

 తమకు అనుకూలంగా లేని వారిని భయభ్రాంతులకు గురి చేస్తున్నారని పేర్కొన్నారు. గత ఎన్నికల్లో సైతం ఆయన అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆరోపించారు. అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న సీఐ జగన్‌పై విచారణ జరిపించి చర్య తీసుకోవాలని బైరు రాములు కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement