ఆదిలాబాద్ రిమ్స్, న్యూస్‌లైన్ : సార్వత్రిక ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం సమాయత్తమవుతున్న వేళ రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లా పోలీసు శాఖ నేరస్తుల చిట్టాలను సిద్ధం చేస్తోంది. ఎన్నికలను పూర్తి శాంతియుత వాతావరణంలో ప్రశాంతంగా నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఈ ప్రక్రియ మొదలైంది. ఈ క్రమంలో జిల్లా పోలీసు అధికారులు పాత నేరస్తుల వివరాలు సేకరించడంలో నిమగ్నమయ్యారు. ఈ మేరకు పోలింగ్ సందర్భంగా హింస ప్రేరేపితం కాకుండా ఉండటంతో పాటు పాత నేరస్తులపై నిఘా వేసేందుకు పోలీసు శాఖ వ్యూహం సిద్ధం చేస్తోంది.
పోలీస్‌స్టేషన్ల వారీగా...
స్టేషన్ల వారీగా నేరస్తులు, అందులో ప్రధానంగా రాజకీయ పార్టీలతో సంబంధం ఉన్నవారు, ఆయా పోలింగ్ సందర్భాల్లో జరిగిన ఘర్షణలు, వాటితో సంబంధం ఉన్న వారెవరనే అంశాలపై సెక్షన్ల వారీగా జాబితాను సిద్ధం చేసి పంపాలని డీజీపీ నుంచి ఆదేశాలు పోలీసు వర్గాలు చెబుతున్నాయి. రాజకీయ పార్టీల్లో చురుకుగా పనిచేస్తున్న వారిపై ఎన్ని కేసులున్నాయి.. ఆయా సెక్షన్లు, కోర్టుల్లో వాటి పరిస్థితి, శిక్షలు పడినట్లయితే వాటి అమలు తదితర వాటిని సమగ్రంగా తయారు చేస్తున్నారు. నామినేషన్ల సందర్భంగా స్క్రూటినీ సమయంలో ప్రత్యర్థులు ఆరోపణలు చేస్తే వాటి వివరాలను వెనువెంటనే అందించేందుకు సన్నద్ధం అవుతున్నారు. ముందుగా స్టేషన్ల వారీగా జాబితాను సిద్ధం చేసి, ఆ జాబితాను డివిజన్ స్థాయి, జిల్లా స్థాయిలో తయారు చేస్తున్నారు. తుది జాబితాను జిల్లా ఎస్పీ పరిశీలించి డీజీపీ కార్యాలయానికి పంపించనున్నట్లు తెలుస్తోంది.
2004 నుంచి నమోదైన కేసులు
2004 సార్వత్రిక ఎన్నికల్లో 50 కేసులు, 2009 ఎన్నికల్లో 46 కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత వచ్చిన 2010 ఉప ఎన్నికల్లో 11 కేసులు, 2012లో ఉప ఎన్నికల్లో 12 కేసులు, ఇటీవల నిర్వహించిన పంచాయతీ ఎన్నికల్లో 27 కేసులు నమోదయ్యాయి. మొత్తం 2004 నుంచి ఇటీవల నిర్వహించిన పంచాయతీ ఎన్నికల్లో జిల్లావ్యాప్తంగా 146 కేసులు నమోదయ్యాయి. రెండు మూడు రోజుల్లో ఎన్నికల షెడ్యుల్ వెలువడే అవకాశాలు ఉండడంతో పోలీసు అధికారులు వివరాల సేకరణ వేగవంతం చేశారు. దీనికి సంబంధించిన పూర్తిస్థాయి నివేదికను త్వరలో అందజేయనున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికలు అన్ని రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో అవాంఛనీయ సంఘటనలు జరిగే అవకాశాలు ఉన్నట్లు పోలీసు వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో పోలీసు బందోబస్తు కూడా కట్టుదిట్టం చేయనున్నారు.
సమస్యాత్మక ప్రాంతాల గుర్తింపు
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పోలీసు శాఖ ముందస్తుగా సున్నితమైన, అతి సున్నితమైన, సమస్యాత్మక, అతి సమసాత్మక, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలను గుర్తించనున్నారు. వీటిలో ఆయా పోలీసుస్టేషన్ పరిధిలోని సున్నితమైన , అత్యంత సున్నితమైన పోలింగ్ కేంద్రాల వివరాలు కూడా సేకరిస్తారు. ఇలా గుర్తించిన అనంతరం ఏయే ప్రాంతాల్లో ఎంత బందోబస్తు ఏర్పాటు చేయాలనే దానిపై నివేదిక తయారు చేస్తారు. దాని ప్రకారం పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తును పటిష్టం చేస్తారు.
వీలైనంత త్వరగా...
రాజకీయ పార్టీల్లో పనిచేస్తున్న వారిలో మహిళలపై దాడులకు, గృహహింస కేసులుంటే వాటి వివరాలు ప్రత్యేకంగా నివేదించనున్నారు. మార్చి మొదటి వారంలో ఎన్నికల సంఘం నోటిఫికేషన్ వెలువడనున్న నేపథ్యంలో వీలైనంత త్వరగా నివేదిక పంపించేందుకు అధికారుల పనులు వేగవంతం చేశారు.
నేరస్తుల జాబితా పంపండి
Published Sun, Mar 2 2014 12:49 AM | Last Updated on Sat, Sep 2 2017 4:14 AM
Advertisement
Advertisement