కడప కార్పొరేషన్: కడప నగరపాలకసంస్థతోపాటు, ఏడు మున్సిపాలిటీలలో పాలకవ ర్గాల ఏర్పాటుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. మేయర్, డిప్యూటీ మేయర్, మున్సిపల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ పదవులకు పరోక్షంగా జరిగే ఎన్నికల షెడ్యూల్‌ను రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఇప్పటికే ఖరారు చేసింది. జూలై 3న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్‌లలో ైచె ర్మన్లు, వైస్ చైర్మన్లు, మేయర్లు, డిప్యూటీ మేయర్ల పరోక్ష ఎన్నికలను నిర్వహించనున్నారు.
మేయర్, డిప్యూటీ మేయర్‌ల ఎన్నిక కోసం నగరపాలకసంస్థ ఓ ప్రత్యేక సమావేశం నిర్వహిస్తుంది.
జిల్లా కలెక్టర్ ప్రిసైడింగ్ అధికారిగా వ్యవహరిస్తారు. మొదట కార్పొరేటర్లతో కలె క్టర్ ప్రమాణ స్వీకారం చేయిస్తారు. అలాగే మున్సిపాలిటీలలో కలె క్టర్‌చే నియమితులైన జిల్లా అధికారులు ప్రిసైడింగ్ అధికారులుగా వ్యవహరించి పరోక్ష ఎన్నికలు నిర్వహిస్తారు. ఈ మేరకు సమావేశాలకు హాజరు కావాలని ఎక్స్ అఫిషియో మెంబర్లకు, గెలిచిన ప్రజాప్రతినిధులకు కడప కార్పొరేషన్ అధికారులు, ఆయా మున్సిపాలిటీల అధికారులు ఇప్పటికే నోటీసులు అందజేశారు. మొదట కార్పొరేటర్లు, కౌన్సిలర్లు ప్రమాణస్వీకారం చేసిన తర్వాతే మేయర్, డిప్యూటీ మేయర్, మున్సిపల్ ఛైర్మన్, వైస్‌ఛైర్మన్ ఎన్నిక ఉంటుంది.
ఓటు హక్కు కలిగిన మొత్తం సభ్యుల సంఖ్యలో 50 శాతం మంది హాజరైతే కోరం ఉన్నట్లు లెక్క. కోరం లేకపోతే గంట వరకు వేచిచూసి మరుసటి రోజుకు వాయిదా వేస్తారు. సెలవు రోజైనా సరే ఆ రోజు సమావేశం నిర్వహిస్తారు. ఆ రోజు కూడా కోరం లేకపోతే ఎన్నికల కమిషన్‌కు నివేదించిన తర్వాత మూడోసారి కోరం ఉన్నా లేకపోయినా ఎన్నిక నిర్వహిస్తారు. మేయర్ ఎన్నిక తర్వాతే డిప్యూటీ మేయర్ ఎన్నిక ఉంటుంది. అలాగే మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక తర్వాతే వైస్‌ఛైర్మన్ ఎన్నికను నిర్వహిస్తారు.
అనర్హత వేటు తప్పదు : పార్టీ ఫిరాయింపుల నిరోదక చట్టం స్థానిక సంస్థలకు వర్తించదు. 1/3వ వంతు సభ్యులు పార్టీ మారితే వర్తించే ఈ చట్టం ఎమ్మెల్యే, ఎంపీలకే పరిమితం. అదే స్థానిక సంస్థల్లో అయితే ఎంతమంది విప్ ధిక్కరించి ఓటేసినా అందరిపైనా అనర్హత వేటు పడుతుంది. విప్‌ను తిరస్కరించిన వారు కూడా అనర్హత వేటు నుంచి తప్పించుకోలేరు. ఓటింగ్ సందర్భంలో విప్‌కు వ్యతిరేకంగా ఓటు వేస్తే సభ్యత్వం రద్దవుతుంది గానీ ఓటు మాత్రం చెల్లుబాటు అవుతుంది. తమ పార్టీ తరపున గెలుపొందిన వ్యక్తి విప్‌ను ధిక్కరించాడని విప్ జారీచేసిన వ్యక్తి మూడు రోజుల్లోపు ఆధారాలతో ప్రీసైడింగ్ అధికారికి ఫిర్యాదు చేస్తారు. ఈ మేరకు ప్రిసైడింగ్ అధికారి ధిక్కరించిన వారికి నోటీసు జారీచేసి వారం రోజుల్లో వారి సభ్యత్వాన్ని రద్దు చేస్తారు.
విప్ జారీ చేసే విధానం :
ఎన్నికల కమిషన్ గుర్తింపు పొందిన టీడీపీ, వైఎస్‌ఆర్‌సీపీ, సీపీఎం, సీపీఐలకు విప్ జారీచేసే అధికారముంటుంది. ఇండిపెండెంట్లు రిజిష్టర్డ్ పార్టీలకు విప్ వర్తించదు. విప్‌ను అపాయింట్ చేయడానికి పార్టీ ప్రెసిడెంట్ లేదా కార్యదర్శి తమ పార్టీ తరపున ఒకరిని నామినేటెడ్ చేస్తే అనెగ్జర్-1 జారీచేస్తారు. పార్టీ అధ్యక్షుడు ఇచ్చిన అధికారంతో ఆయన జిల్లాల వారీగా ఒక్కొక్కరికి అనెగ్జర్-2 ద్వారా విప్‌ను బదలాయిస్తారు. ఈ మేరకు ఆయన తమ సభ్యులందరికీ అనెగ్జర్-3 ద్వారా విప్ జారీచేస్తారు.
ఇలా తనకు పార్టీ విప్ జారీచేసే అవకాశం కల్పించినట్లుగా అన్ని ఒరిజినల్స్‌తో ఎన్నిక జరగడానికి ముందురోజు ప్రీసైడింగ్ అధికారికి సమర్పించాల్సి ఉంటుంది. ఎవరైతే అనెగ్జర్-3 ద్వారా తమ పార్టీ సభ్యులకు విప్ జారీచేసి ఉంటారో సదరు ఆర్డర్ వారికి అందినట్లుగా అక్‌నాలెడ్జ్‌మెంట్ తీసుకొని ఎన్నిక జరగడానికి గంట ముందు ప్రీసైడింగ్ అధికారికి సమర్పించాలి.
ప్రిసైడింగ్ అధికారులు వీరే..
కడప నగరపాలక సంస్థకు జిల్లా కలెక్టర్ ప్రిసైడింగ్ అధికారిగా వ్యవహరించనున్నారు. ప్రొద్దుటూరు మున్సిపాలిటీకి జాయింట్ కలెక్టర్ రామారావు, పులివెందులకు డీఆర్‌డీఏ పీడి అనిల్‌కుమార్, బద్వేల్‌కు స్పెషల్ కలెక్టర్ లవన్న, రాయచోటికి స్పెషల్ కలెక్టర్ నరసింహులు, యర్ర గుంట్లకు స్పెషల్ కలెక్టర్ రంగన్న, మైదుకూరుకు స్పెషల్ కలెక్టర్ సుబ్బారెడ్డి, జమ్మలమడుగుకు ఆర్డీఓ రఘునాథరెడ్డిప్రిసైడింగ్ అధికారులుగా వ్యవహరించి సభ్యులచే ప్రమాణస్వీకారం చేయించనున్నారు.
కో ఆప్షన్ సభ్యుల ఎన్నికకు 60 రోజుల సమయం :
జిల్లా పరిషత్‌లో అయితే కో ఆప్షన్ సభ్యుల ఎన్నిక తర్వాతే జెడ్పీ ఛైర్మన్, వైస్‌ఛైర్మన్ల ఎన్నిక ఉంటుంది. కార్పొరేషన్, మున్సిపాలిటీలలో మాత్రం కో ఆప్షన్ సభ్యుల ఎన్నికకు 60 రోజుల సమయం ఉంటుంది. ఈ మేరకు ఆయా మున్సిపాలిటీలు ప్రత్యేకంగా నోటిఫికేషన్ జారీ చేస్తారు. కడప కార్పొరేషన్‌లో ఐదు మందికి అవకాశముండగా వారిలో ఇద్దరు మహిళలు ఉండాలి. మున్సిపాలిటీల్లో ముగ్గురు కో ఆప్షన్ సభ్యులకు అవకాశముంటుంది.
ఎక్కడ ఆప్షన్ ఇస్తే అక్కడే
ఎక్స్ అఫిషియో సభ్యులుగా ఓటు హక్కు వినియోగించుకునే ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎక్కడైతే ఓటు హక్కు వినియోగించుకుంటామని ఆప్షన్ ఇచ్చి ఉంటారో అక్కడే ఓటు వేయాల్సి ఉంటుంది. ఎమ్మెల్సీలైతే ఎక్కడ తమకు ఓటు హక్కు కలిగివుంటే ఆ మున్సిపాలిటీల్లో ఓటు హక్కు వినియోగించుకోవాలి. కడప కార్పొరేషన్‌కు సంబంధించి కడప, కమలాపురం ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ రామచంద్రయ్య ఎక్స్ అఫిషియో సభ్యులుగా ఓటు హక్కు వినియోగించుకునే అవకాశముంది. ఎమ్మెల్సీగా ఉన్న షేక్ హుస్సేన్ రాజీనామా చేసినందున ఆయనకు అవకాశముండకపోవచ్చు.
స్థానిక పాలకవర్గాల కోసం రంగం సిద్ధం
Published Mon, Jun 30 2014 2:08 AM | Last Updated on Fri, Sep 28 2018 7:14 PM
Advertisement
Advertisement