గండికోట ఉత్సవాలకు ముహూర్తం
– జనవరి 19 నుంచి 22 తేదీల్లోపు
కడప సెవెన్‌రోడ్స్: గండికోట వారసత్వ ఉత్సవాలకు ఎట్టకేలకు ముహూర్తం ఖరారైంది. ముఖ్యమంత్రి వీలునుబట్టి జనవరి 19 నుంచి 22వ తేదీల్లోపు రెండు రోజులపాటు ఉత్సవాలు నిర్వహించాలని అధికారికంగా నిర్ణయించారు. ఇటీవల ముఖ్యమంత్రి జిల్లా పర్యటనకు వచ్చినపుడు కలెక్టర్ కేవీ సత్యనారాయణ గండికోట ఉత్సవాల గురించి ఆయన వద్ద ప్రస్తావించారు. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి ఎప్పుడు నిర్వహించాలో తేదీలు ఖరారు చేసి ప్రతిపాదనలు పంపాలని కలెక్టర్‌కు చెప్పారు. ఈ నేపథ్యంలో బుధవారం కొత్త కలెక్టరేట్‌లో వివిధ శాఖల అధికారులు, ఉత్సవ నిర్వహణ కమిటీలతో ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ ఉత్సవాలకు గవర్నర్‌ను ఆహ్వానిస్తామని తెలిపారు. గవర్నర్ పాల్గొనేందుకు ఎస్సీ,ఎస్టీ సంక్షేమ కార్యక్రమాలు, రక్తదాన శిబిరాలు వంటివి ఏర్పాటు చేయాల్సి ఉంటుందని చెప్పారు. మొదటిరోజు గవర్నర్, చివరిరోజు ముఖ్యమంత్రి ఉత్సవాలకు హాజరు కావడం ఆనవాయితీగా ఉందని పేర్కొన్నారు. ఉత్సవాలు పండుగ వాతావరణంలో నిర్వహించేందుకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. స్పెషల్ డెవలప్‌మెంట్ ప్యాకేజీ కింద మంజూరైన రూ. 16 కోట్లతో గండికోటకు రోడ్డు వెడల్పు పను పనులను తక్షణమే చేపట్టాలని ఈఈని ఆదేశించారు. గండికోట ప్రవేశద్వారం వరకు రోడ్డు పనులు త్వరగా పూర్తి కావాలన్నారు. కోట ప్రాంతాన్ని నందనవనంలా మార్చేందుకు ల్యాండ్ స్కేపింగ్ పనులు చేపడతామన్నారు. గార్డెన్ అభివృద్ధికి అంచనాలు రూపొందించాలని ఉద్యానశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ మధుసూదన్ రెడ్డిని ఆదేశించారు. ఆర్కియాలజీ ఉన్నతాధికారుల అనుమతితో కట్టడాల కెమికల్ ట్రీట్‌మెంట్‌కు చర్యలు తీసుకుంటామన్నారు. కోటలో లైటింగ్ ఏర్పాటు చేయాలని చెప్పారు. ఉత్సవాలకు హాజరయ్యే ప్రజలకు తాగునీటి ఇబ్బంది లేకుండా చూడాలని ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులను ఆదేశించారు. ఉత్సవాలకు ప్రధాన వేదిక గండికోట ఉంటుందని, అక్కడ నిర్వహించే కొన్ని కార్యక్రమాలు కడప లాంటి ఇతర ప్రాంతాల్లో కూడా ఏర్పాటు చేస్తామన్నారు. థీం సాంగ్‌కు కొన్ని సవరణలు చేసి రెండు రోజుల్లో ఖరారు చేస్తామని తెలిపారు. నాలుగైదు రోజుల్లో లోగో, పోస్టర్లను విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. గండికోట ఉత్సవాల గురించి తెలుగు రాష్ట్రాలతోపాటు బెంగుళూరు, చెన్నైలలో కూడా విస్తృత ప్రచారాన్ని నిర్వహిస్తామని వెల్లడించారు. ఉత్సవాలు ముగిసే వరకు 24 గంటలు విద్యుత్ సరఫరా ఉండాలని ట్రాన్స్‌కో అధికారులను ఆదేశించారు.ఉత్సవాల నిర్వహణ కోసం తాను టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌ను సంప్రదించగా, రూ. 10 లక్షలు మంజూరు చేసేందుకు అంగీకరించారన్నారు. మళ్లీ డిసెంబరు 6,7 తేదీలలో సమావేశం కావాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో పర్యాటకశాఖ ఆర్డీ గోపాల్, కడప, జమ్మలమడుగు ఆర్డీఓలు చిన్నరాముడు, వినాయకం, జిల్లా పర్యాటకశాఖ అధికారి ఖాదర్‌బాషా, ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులు సిద్దవటం సీతారామయ్య, ఎలియాస్‌రెడ్డి, ఆహ్వాన కమిటీ సభ్యుడు జానమద్ది విజయభాస్కర్, కల్చరల్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.