సాక్షి, అమరావతి: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ఏ దశలో ఆగిపోయాయో అక్కడి నుంచి తిరిగి నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్‌ఈసీ)ను ఆదేశిస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పు తమ హక్కులను కాలరాసే విధంగా ఉందంటూ ఆ ఎన్నికల్లో పోటీచేసిన పలువురు హైకోర్టును ఆశ్రయించారు. సింగిల్ జడ్జి తీర్పును సవాలు చేస్తూ అప్పీల్ దాఖలు చేసేందుకు అనుమతినివ్వాలంటూ కృష్ణాజిల్లాకు చెందిన జొన్నల రామ్మోహనరెడ్డి, వేమూరి సురేశ్, భీమవరపు శ్రీలక్ష్మి, మండవ దేదీప్య, బేబీ షాలిని తదితరులు వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై సోమవారం విచారణ జరిపిన హైకోర్టు.. ఈ వ్యాజ్యాలను కూడా ఈ నెల 27న విచారణకు రానున్న ఎస్‌ఈసీ అప్పీల్‌తో జతచేస్తున్నట్లు తెలిపింది.
సింగిల్ జడ్జి తీర్పుపై అప్పీల్ దాఖలు చేసేందుకు అనుమతి ఇచ్చే విషయంపై ఆ రోజున నిర్ణయిస్తామని ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ అరూప్‌కుమార్‌గోస్వామి, న్యాయమూర్తి జస్టిస్ నైనాల జయసూర్యలతో కూడిన ధర్మాసనం పేర్కొంది. అప్పీళ్ల దాఖలుకు అనుమతి ఇస్తే మరింతమంది పోటీదారులు అప్పీళ్లు వేస్తారని, ఇలా ఎంతమంది వేస్తారో తెలియదని, అవన్నీ విచారించడం సాధ్యం కాదని తెలిపింది. ఈ సమయంలో పిటిషనర్ల న్యాయవాదులు వీఆర్‌ఎన్ ప్రశాంత్, నాగిరెడ్డి తదితరులు స్పందిస్తూ.. ఎన్నికల కమిషన్ వాదనలు పూర్తిచేసిన తరువాత అవసరమైన మేరకు కోర్టుకు సహకరిస్తామని తెలిపారు. దీంతో ధర్మాసనం ఈ వ్యాజ్యాలను ఎస్‌ఈసీ దాఖలు చేసిన అప్పీల్‌కు జతచేస్తామని, అప్పీల్ దాఖలుకు అనుమతినివ్వాలో లేదో ఆరోజు తేలుస్తామని పేర్కొంటూ విచారణను వాయిదా వేసింది.
మళ్లీ ఎన్నికలు.. తీర్పు మా హక్కులను కాలరాస్తోంది
Published Tue, Jul 6 2021 5:02 AM | Last Updated on Tue, Jul 6 2021 8:20 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment