
సాక్షి, హైదరాబాద్: త్వరలోనే మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనున్న నేపథ్యంలో ఎన్నికల నిర్వహణ, నిబంధనలు, చట్టంలోని ఆయా సెక్షన్లకు సంబంధించి కొత్త మున్సిపల్ చట్టంలో ఉన్న మార్పులను సరిచూసుకోవాలని అధికారులకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్‌ఈసీ) సూచించింది. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ప్రభుత్వం వార్డుల పునర్విభ జన తదితరాల్లో తప్పులు, పొరబాట్లు దొర్లాయంటూ పలువురు హైకోర్టును ఆశ్రయించడంతో ఎన్నికల ప్రక్రియ నిలిచిపోయిందని పేర్కొంది. ఈ దశలో రాష్ట్ర ప్రభుత్వం కొత్త మున్సిపల్ చట్టాన్ని రూపొందించిందని తెలిపింది. త్వరలోనే మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనున్న నేపథ్యంలో మళ్లీ కొత్త మున్సిపల్ చట్టానికి సంబంధించిన వివిధ అంశాలతో మళ్లీ ఫారమ్స్, కవర్స్, బుక్‌లెట్ల ముద్ర ణ అసాధ్యమని తెలిపింది.
దీనికోసం మరింత సమయం పట్టి ఎన్నికలు మరింత ఆలస్యమయ్యే అవకాశముందని తెలిపింది. అంతేకాకుండా ఎన్నికల నిర్వహణకు సంబంధించి కొత్త, పాత చట్టా ల్లోని నిబంధనల్లో పెద్దగా మార్పులేమీ లేవని పేర్కొంది. అయితే ఈ రెండు చట్టాలను సరిచూసినప్పుడు వీటిల్లోని వివిధ సెక్షన్లు, ఆయా అంశాలకు సంబంధించిన సీరియల్ నంబర్లు మాత్రమే మారినట్లు స్పష్టమైందని తెలిపింది. ఇదిలావుండగా.. పాత, కొత్త చట్టాల్లోని ఆయా అంశాలు, సెక్షన్ల గురించి ముఖ్యంగా ఫారమ్స్, బుక్‌లెట్లు, సర్క్యులర్లు, ఉత్తర్వులు, నోటిఫికేషన్లు తదితరాల్లో ఇప్పటికే ఎస్‌ఈసీ విడుదల చేసిన అంశాలపై స్పష్టతనిస్తూ ఎస్‌ఈసీ కార్యదర్శి ఎం.అశోక్‌కుమార్ నోటిఫికేషన్ విడుదల చేశారు.
Comments
Please login to add a commentAdd a comment