వరంగల్‌ పాఠాలు | Police Department Is Particularly Sensitive To Crimes Against Women | Sakshi
Sakshi News home page

వరంగల్‌ పాఠాలు

Published Mon, Dec 23 2019 2:20 AM | Last Updated on Mon, Dec 23 2019 2:20 AM

Police Department Is Particularly Sensitive To Crimes Against Women - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: దిశ ఉదంతంతో అప్రమత్తమైన నగర పోలీసు విభాగం మహిళలపై నేరాలకు సంబంధించిన కేసులకు అత్యంత ప్రాధాన్యం ఇస్తోంది. దీనిలో భాగంగా ప్రతి ఫిర్యాదును కేసుగా నమోదు చేయడంతో పాటు తీవ్రమైన కేసుల్లో దర్యాప్తు, విచారణ అతి తక్కువ సమయంలో పూర్తి చేయడానికి చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. ఈ నేపథ్యంలోనే అత్యంత వేగవంతమైన దర్యాప్తు, విచారణలతో రికార్డుల్లోకి ఎక్కిన వరంగల్‌లో చిన్నారిపై హత్యాచారం కేసును ఓ కేస్‌ స్టడీగా మార్చారు. ఈ కేసు దర్యాప్తు, విచారణ తీరుతెన్నులను నాటి దర్యాప్తు అధికారి, ప్రస్తుతం చిక్కడపల్లి ఏసీపీ సీహెచ్‌ శ్రీధర్‌ సిటీ పోలీసులకు ప్రత్యేక క్లాసుల ద్వారా వివరిస్తున్నారు. గత వారం నుంచి జోన్ల వారీగా ఈ క్లాసులు చేపడుతున్నారు.

వరంగల్‌లో ఈ ఏడాది జూన్‌ 18 అర్ధరాత్రి చోటు చేసుకున్న తొమ్మిది నెలల చిన్నారిపై అత్యాచారం, హత్య ఉదంతం రాష్ట్రంలో తీవ్ర కలకలం సృష్టించింది. హైదరాబాద్‌ శివార్లలోని ఇబ్రహీంపట్నంలో ఉన్న విద్యాభారతి ఇంజనీరింగ్‌ కాలేజీలో పనిచేసే దంపతులు తమ తొమ్మిది నెలల చిన్నారిని తీసుకుని హన్మకొండ కుమార్‌పల్లిలో ఉన్న బంధువుల ఇంటికి వెళ్లారు. ఇంటి మేడపై తల్లిదండ్రులతో కలిసి నిద్రిస్తున్న చిన్నారిని అపహరించుకుపోయిన ప్రవీణ్‌ అనే వ్యక్తి నిర్జన ప్రదేశంలో అత్యాచారం చేసి చంపేశాడు. ఈ దారుణంపై అదే రోజు హన్మకొండ పోలీసుస్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ కేసుకు ఏసీపీ సీహెచ్‌ శ్రీధర్‌ దర్యాప్తు అధికారిగా నియమితులయ్యారు. పాశవికమైన ఈ ఉదంతంపై తీవ్రమైన ప్రజాగ్రహం వ్యక్తమైంది. నిందితుడిని ఎన్‌కౌంటర్‌ చేయాలని, తక్షణమే ఉరి తీయాలని డిమాండ్లు వెల్లువెత్తాయి.  

51వ రోజు తీర్పు..
చిన్నారిపై హత్యాచారం కేసు దర్యాప్తు, విచారణ పూర్తి చేసి ప్రవీణ్‌కు శిక్షపడేలా చేస్తామని వరంగల్‌ సీపీ వి.రవీందర్‌ ప్రజలకు హామీ ఇచ్చారు. ఇచి్చన మాట ప్రకారం దర్యాప్తు, విచారణ పూర్తి చేయించి, 51వ రోజు తీర్పు వచ్చేలా చేశారు. ఆ కేసు దర్యాప్తు అధికారి శ్రీధర్‌ ప్రస్తుతం చిక్కడపల్లి డివిజన్‌ ఏసీపీగా పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో నగర పోలీసు కమిషనర్‌ అంజనీ కుమార్‌ ఆ కేస్‌ స్టడీని నగర పోలీసు అధికారులకు బోధించాల్సిందిగా శ్రీధర్‌ను ఆదేశించారు. దీంతో ఆయన జోన్ల వారీగా ఇన్‌స్పెక్టర్లు, ఏసీపీలకు బషీర్‌బాగ్‌లోని కమిషనరేట్‌లో శిక్షణ ఇస్తూ, నాటి రికార్డులను పంపిణీ చేస్తూ దర్యాప్తుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరిస్తున్నారు. ఇప్పటికే మూడు జోన్ల అధికారులకు తరగతులు పూర్తి కాగా.. ఈ వారం మరో రెండు జోన్లకు చెందిన వారికి నిర్వహించనున్నారు.

చిన్నారి కేసు వివరాలు
అత్యాచారం, హత్య కేసు నమోదైంది: జూన్‌ 18, 2019
దర్యాప్తు పూర్తయి ఛార్జ్ షీట్ దాఖలైంది: జూలై 11 (27 రోజుల్లో)
కోర్టులో సాక్షుల విచారణ: జూలై 24, 25, 30, 31, ఆగస్టు 1, 2
న్యాయస్థానంలో ఇరు పక్షాల వాదనలు: ఆగస్టు 6
తీర్పు వెలువడింది: ఆగస్టు 8 (51 రోజుల్లో)
►స్థానిక కోర్టు దోషికి ఉరి శిక్ష వేయగా.. ఉన్నత న్యాయస్థానం జీవితఖైదుగా మార్చింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement