సాక్షి, హైదరాబాద్: సీనియర్ ర్యాగింగ్ వేధింపులు తాళలేక ఆత్మహత్యాయత్నం చేసి.. చికిత్స పొందుతూ కన్నుమూసింది మెడికో ధరావత్ ప్రీతి(26). ఈ ఉదంతం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే ప్రీతి మృతదేహానికి గాంధీ ఆస్పత్రిలో పరీక్షలు నిర్వహించగా.. ఆ నివేదిక ఇప్పుడు వరంగల్ పోలీసులకు చేరింది.
ప్రీతి ఉదంతంలో ఇప్పుడు ఫోరెన్సిక్ రిపోర్ట్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇంజెక్షన్‌లతో ఆమె ఆత్మహత్యాయత్నం చేసిందని తొలుత చికిత్స అందించిన వైద్యులు ప్రకటించారు. అయితే.. ప్రీతి తల్లిదండ్రులు మాత్రం ఇది హత్యేనని, ఎవరో ఇంజెక్షన్‌లు చేశారంటూ అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ప్రీతి బ్లడ్ శాంపిల్స్ రిపోర్ట్‌లను సైతం వరంగల్ పోలీసులు తెప్పించుకున్నారు.
ఇక ఫోరెన్సిక్ నివేదికలో ఏం ఉంది, పోలీసులు ఏం ప్రకటిస్తారనే అంశాలు ఇప్పుడు ఉత్కంఠ రేకెత్తిస్తున్నాయి. గాంధీ ఆస్పత్రిలో పోస్ట్ మార్టం నిర్వహించగా.. ఈ నివేదిక ఆధారంగా స్పష్టమైన ప్రకటనతో అనుమానాలకు తెర దించనున్నారు వరంగల్ పోలీసులు.
సాక్షి, వరంగల్: మరోవైపు.. మెడికో ప్రీతి కేసులో ప్రధాన నిందితుడు సైఫ్ పోలీస్ కస్టడీలోనే ఉన్నాడు. మొత్తం 9 మంది అందించిన కీలక ఆధారాలతో నిందితుడు సైఫ్ ను విచారిస్తున్నారు ఏసీపీ బోనాల కిషన్. రెండు రోజుల విచారణలో కీలకాంశాలే సేకరించినట్లు పోలీసులు చెప్తున్నారు. ఈ క్రమంలో వాట్సాప్ ఛాటింగ్ కీలకంగా మారినట్లు తెలుస్తోంది. వాట్సాప్‌లో 27 స్క్రీన్ షాట్స్, మెసేజ్‌లను.. సాంకేతిక ఆధారాలను సరిపోల్చుతూ సైఫ్‌ను విచారిస్తున్నారు. కస్టడీ గడువు ముగిసేలోపు నిందితుడి నుంచి మరింత సమాచారం రాబట్టేందుకు యత్నిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment