అంతా.. 15 నిమిషాల్లోనే జరిగిపోయింది. పదునైన వేటకొడవళ్లు, ఎలక్ట్రిక్ రంపం.. మూడు హత్యలు.. ఒకరకంగా అతను ఊచకోత కోశాడు. కొత్త ఇల్లు రక్తసిక్తమైంది. వరంగల్‌నగరం ఎల్‌బీనగర్‌లో తెల్లవారుజామున ఒకే కుటుంబానికి చెందిన చాంద్ పాషా, అతడి భార్య సాబీరా, బావమరిది ఖలీల్‌ను కేవలం నిమిషాల వ్యవధిలోనే వరుసబెట్టి నిందితుడు ఎండీ షఫీ హతమార్చాడు. 2.20 నుంచి 2.35 నిమిషాల వ్యవధిలోనే మూడు హత్యలు జరిగాయి. దీంతో ఒక్కసారిగా ఉమ్మడి వరంగల్ జిల్లా ఉలిక్కిపడింది.
సాక్షి, వరంగల్ / ఎంజీఎం/ వరంగల్ క్రైం: తల్లిదండ్రులను తన కళ్లెదుటే కత్తులతో నరకడం.. అడ్డుకోబోయిన మేనమామను క్షణాల్లో మట్టుబెట్టడం.. తోడబుట్టిన తమ్ముళ్లపై పైశాచికంగా కత్తులతో దాడి చేయడం చూసిన ఆ యువతి గుండె పగిలిపోయింది.. కాపాడండి అంటూ ఆ క్షణం గొంతెత్తి అరిచింది. ఒక పక్క తల్లిదండ్రులు, మేనమామ రక్తం మడుగులో కొట్టుకొంటుకుంటుగా తమ్ముళ్ల రోదనలు చెవుల్లో మార్మోగాయి. బాబాయ్ వెంట వచ్చిన కిరాయి గుండాలు రక్త బీభత్సం సృష్టించి బయట పడ్డారు. వరంగల్ ఎల్బీనగర్‌లో జరిగిన దారుణ హత్య సంఘటనతో నగరంతోపాటు ఉమ్మడి జిల్లా ఒక్కసారిగా ఉలిక్కిపడింది.
కొత్త ఇల్లే హత్యకు కారణమైందా?
చాంద్‌పాషా, షఫీ అన్నదమ్ములు. 20 ఏళ్లుగా పశువుల క్రయ విక్రయాలు చేస్తూ గొడ్డు మాంసం వ్యాపారం చేస్తున్నారు. మూడేళ్ల క్రితం వ్యాపారంలో సుమారు రూ.1.20 కోట్ల వరకు అప్పు తేలింది. ఇందులో రూ.80 లక్షలు షఫీ, రూ.40 లక్షలు చాంద్‌పాషా భరించాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయంలో ఇద్దరి మధ్య బేదాభిప్రాయాలు వచ్చాయి. రెండు, మూడుసార్లు పెద్ద మనుషుల వద్ద పంచాయితీ జరిగినా.. లావాదేవీలు షఫీ చూసేవాడని, అతనే కట్టాలని చాంద్‌పాషా చెప్పుకొచ్చాడు. ఎల్‌బీనగర్‌లో సుమారు రూ.కోటికి పైగా వ్యయంతో చాంద్‌పాషా ఏడాది కిందట కొత్త ఇంటిని నిర్మించాడు. అన్న తనకు అప్పులు వేసి, అతను మాత్రం డబ్బులు లేవంటూనే కోటి రూపాయలతో కొత్త ఇల్లు ఎలా కట్టుకున్నాడు. తనను మోసం చేసి డబ్బులు మిగుల్చుకున్నాడని కోపం పెంచుకున్నాడు. తనకు అప్పుల భారం తీవ్రమైందని, ఆదుకోవాలని అన్నావదినలను కోరినా వారు వినకపోవడంతో కోపం కాస్త కసిగా మారి హత్యకు దారి తీసినట్లు తెలుస్తోంది.
చనిపోయారని వెళ్లిపోయారు..
చాంద్‌పాషా, సాబీరా, ఖలీల్‌లను చంపాక చాంద్‌పాషా కుమారులు సమద్, ఫహాద్‌లు వచ్చారు. వారిని కూడా విచక్షణారహితంగా పొడిచారు. రక్తపు మడుగులో పడిపోవడంతో చనిపోయారని భావించి వెళ్లిపోయారు. కానీ ఆ తరువాత వారిలో చలనం ఉండడంతో స్థానికులు ఆస్పత్రికి తరలించారు.
దాడిలో పాల్గొన్నది స్నేహితులే..
ముగ్గురి హత్యలో పాల్గొన్న వారిలో ప్రధాన నిందితుడు షఫీకి సంబంధించిన స్నేహితులు, సేవకులు ఉన్నట్లు సమాచారం. వీరికి, చాంద్‌పాషాకు చాలాఏళ్లుగా పరిచయం కూడా ఉన్నట్లు సమాచారం. వీరి పశువులు, మాంసం వ్యాపారంలో సుమారు 10 సంవత్సరాల పైన పనిచేస్తున్న వ్యక్తి కూడా ఉన్నట్లు తెలిసింది. దీంతో పాటు షఫీ డ్రైవర్ కూడా ఈ హత్యల సంఘటనలో నిందితుడిగా ఉన్నాడు. చాంద్‌పాషా ఇల్లు కట్టుకునే సమయంలో నిందితుడు షఫీ దగ్గర ఉండి కట్టించాడు. ఆ ఇంట్లో అణువణువూ అతనికి తెలుసు. హత్య ఘటనలో పాల్గొన్న వారిలో ఒకరు పరకాల ప్రాంతానికి చెందిన నిందితుడు ఉండగా, మరొకరు నర్సంపేట ప్రాంతానికి చెందిన వ్యక్తి ఉన్నట్లు సమాచారం.
హత్యకు గురైంది.. చాంద్‌పాషా (50), సాబీరా (42) (భార్య), ఖలీల్ (40) చాంద్‌పాషా బావమరిది
క్షతగాత్రులు: చాంద్‌పాషా కుమారులు సమద్(21), ఫహాద్ (28)
క్షణాల్లో ప్రాణాలు పోయాయి..
దుండగులు కత్తులతోపాటు దాడిలో రంపాన్ని వినియోగించడం వల్ల ఆ.. ముగ్గురు క్షణాల్లో ప్రాణాలను కోల్పోయారు. చాంద్‌పాషా మెడను రంపంతో కోశారు. భుజాలు, చేతులపై పదునైన కత్తిపోట్లు ఉన్నాయి. మెడ భాగం పూర్తిగా కట్ అయి ఉంది. ముఖంపై పడిన కత్తిపోటుతో ముక్కు వరకు తెగింది. ఖలీల్‌పాషాకు గొంతు దగ్గర రంపంతో కోశారు. తల.. మొండం వేరు పడలేదు కానీ రెండింటి మధ్య పెద్ద ఖాళీ స్థలం ఏర్పడింది. చిన్నపాటి కాలువ మాదిరిగా మృత దేహాలపై గుర్తులు ఉండిపోయాయి. సాబీరా బేగం ముఖంపై పదునైన కత్తిపోటు పడింది. మెడపై రంపంతో కోసినట్లు ఉంది. ముగ్గురి మృతదేహాలకు ఎంజీఎం ఆస్పత్రి లో బుధవారం పోస్టుమార్టం నిర్వహించా రు. చాంద్‌పాషా కూతురు రూబీనా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఇంతేజార్‌గంజ్ ఇన్‌స్పెక్టర్ దగ్గు మల్లేష్ తెలిపారు. నింది తులపై 302, 307, 460 సెక్షన్‌ల కింద కేసు నమోదు చేసినట్లు చెప్పారు.
వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలింపు
ఘటనలో గాయపడి ప్రాణపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న సమద్, ఫహాద్‌ను సోదరి రూబీనా బేగం స్థానికులతో కలిసి ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం వారిని ఉదయం 11 గంటల ప్రాంతంలో హైదరాబాద్‌కు తరలించారు.
ఎప్పుడు ఏమి జరిగిందంటే..
- మంగళవారం అర్ధరాత్రి 1.45 : షఫీతోపాటు స్నేహితులు పీకల దాకా మద్యం తాగారు.
- 2.05 : ఆటోలో అందరూ ఎల్‌బీనగర్‌కు చేరుకున్నారు.
- 2.05 నుంచి 2.20 : ఎలక్ట్రిక్ రంపంతో చాంద్‌పాషా ఇంటి తలుపుల కింది భాగంలో సగం వరకు షఫీ కోశాడు.
- 2.20 : రంపం శబ్దం విని నిద్ర నుంచి లేచివచ్చిన చాంద్‌పాషా ఛాతిపై రఫీ రంపంతో కోశాడు. పదునైన కత్తితో దాడి చేశాడు. ఆ తర్వాత శరీరంలోకి పలుమార్లు కత్తితో పొడిచాడు.
- 2.23 : నిద్ర నుంచి లేచి అడ్డుకోబోయిన బావమరిది ఖలీల్ శరీరం ముందు భాగంలోకి పలుమార్లు పొడిచాడు. ఇలా దాదాపు రెండు నిమిషాల పాటు ఖలీల్‌ను విచక్షణారహితంగా నరికాడు.
- 2.25 : వీరి అరుపులు విని నిద్రలేచిన వదిన సాబీరాను కూడా పదునైన కత్తితో పొడిచి చంపాడు.
- 2.28 : ఈ రక్తపు మడుగుల్లో పడి ఆర్తనాదాలు చేస్తుండగా చాంద్‌పాషా కుమారులు సమద్, ఫహాద్‌లు లేచి వచ్చారు. వారిపై అదే పదునైన కత్తితో పొడిచాడు. దీంతో కుప్పకూలిపోయారు.
- 2.35 : షఫీతోపాటు నిందితులు వచ్చిన ఆటోలోనే తిరిగి వెళ్లిపోయారు.
Comments
Please login to add a commentAdd a comment