అది ఆవు కాదు బర్రె మాంసం బిర్యానీ!
లక్నో: అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ (ఏఎంయూ) క్యాంటీన్‌లో వడ్డించిన బిర్యానీ ఆవు మాంసంతో చేసింది కాదని, దానిని బర్రె (గెదే) మాంసంతో వండారని వర్సిటీ వైస్ చాన్స్‌లర్ ఆదివారం వివరణ ఇచ్చారు. ఏఎంయూ క్యాంటీన్‌లో బీఫ్ బిర్యానీ వడ్డిస్తుండటంపై తీవ్ర దుమారం రేగిన సంగతి తెలిసిందే. మైనారిటీ యూనివర్సిటీ అయిన ఏఎంయూలోని మెడికల్ కాలేజీ క్యాంటీన్‌లో బీఫ్ బిర్యానీ వండుతున్నారని వాట్సాప్‌లో ఫొటోలు దర్శనమివ్వడం శుక్రవారం దుమారం రేపింది. బీఫ్ బిర్యానీ ఫొటోలు ఒక్కసారిగా వైరల్ కావడంతో ఈ ఆరోపణలను వర్సిటీ వెంటనే ఖండించింది.
'నిరాధార ఆరోపణలను ఖండిస్తున్నాను. మత అలజడులు సృష్టించేందుకే వీటిని వ్యాప్తి చేస్తున్నారు. ఏఎంయూ క్యాంటీన్‌లో గెదే బిర్యానీ మాత్రమే లభిస్తుంది. ఆవు మాంసం ఎంతమాత్రం లేదు. ఈ విషయంలో మా తనిఖీలతో స్థానిక బీజేపీ ఎంపీ సైతం సంతృప్తి చెందారు' అని ఏఎంయూ వర్సిటీ వీసీ జమీర్ ఉద్దీన్ షా తెలిపారు.
'బీఫ్ బిర్యానీ' వడ్డిస్తున్న ఏఎంయూ క్యాంటీన్ కాంట్రాక్టర్‌పై కేసు పెట్టాలని డిమాండ్ చేస్తూ స్థానిక బీజేపీ మేయర్, పార్టీ నేతలు శనివారం ఎస్పీ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు. మరోవైపు స్థానిక బీజేపీ ఎంపీ సతీష్ గౌతం మాట్లాడుతూ యూనివర్సిటీ ప్రాంగణంలో బీఫ్ బిర్యానీని వండడం కానీ వడ్డించడం కానీ చేయడం లేదని వీసీ తెలిపారని, దీనిపై ఇంకా ప్రశ్నించడానికి ఏమీ లేదని స్పష్టం చేశారు.