కండలు పెరిగి సిక్స్ ప్యాక్ రావాలంటే.....
న్యూయార్క్: నేడు సిక్స్ ప్యాక్‌లు పెంచుకోవడం బాలీవుడ్, టాలీవుడ్ హీరోలకే పరిమితం కాలేదు. సిక్స్ ప్యాక్‌లను పెంచుకునేందుకు నేటి కుర్రకారంతా తహతహలాడుతున్నారు. అందుకోసం జిమ్‌ల వెంట పరుగులు తీస్తున్నారు. కండర గండులు కావాలంటే జిమ్ములకెళ్లి గంటల కొద్ది కసరత్తు చేయడం ఒక్కటే సరిపోదు. శరీరంలో కండలు పెరిగేందుకు పద్ధతిగా ప్రోటీన్లు తీసుకోవడం తప్పనిసరి.
ప్రొటీన్లు మాంసాహారంలో ఎక్కువగా ఉంటాయా లేదా శాకాహారంలో ఎక్కువ ఉంటాయా? మాంసాహారులైతే రెండూ తీసుకోవచ్చు. మరి శాకాహారాలు ఏం చేయాలి? ఈ అంశంపై ఆది నుంచి ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఆదిలో మంసాహారంలోనే ఎక్కువ ప్రోటీన్లు ఉంటాయని, మాంసాహారం తీసుకోవడమే మేలన్న వాదన కొనసాగేది. ఆ తర్వాత కాలంలో శాకాహారానికి ప్రోత్సాహం, ఆదరణ పెరిగాక శాకాహారంలోనూ ప్రోటీన్లు ఎక్కువగా ఉన్నాయి. శాకాహారాన్ని తీసుకోవడమే మంచిదన్న వాదన పుట్టుకొచ్చింది. ఒకరి వాదనను ఒకరు ఒప్పుకోకుండా ఈ అంశంపై మాంసాహారులు, శాకాహారులు రెండుగా చీలిపోయారు.
ఎవరి వాదనలో నిజం ఎంతుందో శాస్త్రీయంగా తెలుసుకునేందుకు అమెరికాలోని ఓ న్యూట్రిషన్ బృందం ప్రాక్టికల్‌గా ఓ అధ్యయనం జరిపింది. ఇందుకోసం ఆ బందం కసరత్తు, ప్రోటీన్ల ద్వారా కండలు పెంచుకోవాలనుకుంటున్న మూడు ఏజ్ గ్రూపులకు చెందిన మూడు వేల మంది వలంటీర్లను ఎంపిక చేసింది. వారిలో జిమ్ములకెళ్లి కసరత్తు ఎక్కువ చేయగలిగిన కుర్రవాళ్లను ఓ గ్రూపుగాను, మధ్యవయస్కులను మరో గ్రూపుగాను, పెద్ద వయస్కులను మరో గ్రూపుగాను విభజించింది. మళ్లీ ఈ మూడు గ్రూపులను శాకాహారులుగా, మాంసాహారులుగా విభజించింది. శాకాహారులకు అత్యధిక పోషక విలువలు కలిగిన పండ్లు, కూరగాయలతో కూడిన ఆరు రకాల డైట్‌ను అందజేయగా, మాంసాహారులకు మేక, కోడి మాంసం, చేపలు, గుడ్డు, తక్కువ ఫ్యాట్ కలిగిన పాలను డైట్‌ను అందజేసింది. ఎవరు ఎంత మోతాదులో ఆహారం తీసుకుంటారు, ఎంత సేపు కసరత్తు చేస్తున్నారనే అంశాలను కూడా ఎప్పటికప్పుడు రికార్డు చేస్తూ వచ్చారు.
కొన్ని నెలల తర్వాత అన్ని గ్రూపుల వారి కండలను కొలిచి చూడగా ఆశ్చర్యకరమైన ఫలితాలు కనిపించాయి. అన్ని గ్రూపుల్లోనూ మాంసాహారం తీసుకున్నవారిలోనే కండరాలే ఎక్కువగా పెరిగాయి. ఎక్కువ మోతాదులో శాకాహారం తీసుకున్న వారికన్నా తక్కువ మోతాదులో మాంసాహారాన్ని తీసుకున్న వారిలో మంచి ఫలితాలు కనిపించాయి. అంటే శాకాహారులు అత్యధిక పోషక విలువలు కలిగిన 60 గ్రాముల శాకాహారాన్ని తీసుకున్న వారికన్నా 20 గ్రాముల మాంసాహారాన్ని తీసుకున్న వారిలోనే మంచి ఫలితాలు వచ్చాయి, ఎందుకు అలా జరిగిందో నిపుణుల బృందం మళ్లీ అధ్యయనం జరిపింది.
మనుషుల్లో కండరాలు పెరగడానికి, అవి బలోపేతం అవడానికి లూసినో లాంటి ఆమ్లో ఆసిడ్స్ కారణమని, అవి మాంసాహారుల్లో ఎక్కువ ఉండడం వల్ల వాటిని డైట్‌గా తీసుకున్న వారిలో మంచి ఫలితాలు కనిపించాయని తేలింది. లూసినో లాంటి కీలకమైన ఆమ్లో ఆసిడ్ మాంసాహారంలో 9 నుంచి 13 శాతం ఉండగా, పండ్లు, కూరగాయలు, పప్పుదినుసులు లాంటి వెజిటేరియన్ డైట్‌లో ఆరు నుంచి ఎనిమిది శాతం ఉన్నాయి.
మొక్కజొన్న, సజ్జలు, కొర్రల్లో మాత్రమే 12 శాతం వరకు ఉన్నాయని తేలింది. ముఖ్యంగా మాంసహారంలో మొత్తం తొమ్మిది రకాల ఆమ్లో ఆసిడ్స్ ఉండగా, శాకాహారంలో రెండు రకాల ఆసిడ్స్ తక్కువగా ఉన్నాయని, అవి కూడా అధ్యయన ఫలితాలను ప్రభావితం చేసి ఉంటాయని నిపుణుల బృందం పేర్కొంది. ఈ అధ్యయనం వివరాలను ‘అమెరికన్ జనరల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్’లో ప్రచురించారు.