నేడు శాకాహార దినోత్సవం | Today Vegetarian Day | Sakshi
Sakshi News home page

నేడు శాకాహార దినోత్సవం

Published Wed, Oct 1 2014 2:16 AM | Last Updated on Wed, Sep 19 2018 8:17 PM

నేడు శాకాహార దినోత్సవం - Sakshi

నేడు శాకాహార దినోత్సవం

సాక్షి, సిటీబ్యూరో/లైఫ్‌స్టైల్ ప్రతినిధి: శాకాహారం, సమతుల్య ఆహారం వైపుగ్రేటర్ సిటీజన్లు మొగ్గు చూపుతున్నారు. వీటితోనే దీర్ఘాయుష్షు సాధ్యమని విశ్వసిస్తున్నారు. నేడు శాకాహార దినోత్సవం (వెజిటేరియన్స్‌డే) సందర్భంగా నగర వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు వెజిటేరియన్స్. ‘మాంసాహారం లేకపోతే ముద్ద దిగదు’ అనే వారికి వీరి నినాదం కాస్త చేదుగా అనిపించినా.. శాకాహార ప్రియులు పెరుగుతున్నారడంలో సందేహం లేదు. ‘వెజిటేరియన్‌గా మారడమంటే సమాజానికి సేవ చేయడంతో సమానం’ అంటున్న ‘హైదరాబాద్ వెగాన్స్’ సంస్థ సభ్యులు... పాలు, గుడ్డు, ఆఖరికి తేనెతో సహా ఇతర జీవులను హింసించి పొందే ఆహారమేదీ మనది కాదని అందరికీ నచ్చచెప్పడానికి తమవంతు ప్రయత్నం చేస్తున్నారు.

హైదరాబాద్ వెగాన్స్ ఆవిర్భావం ఇలా..
వంకాయ వంటి కూర లేదంటారు. టమాట రుచి మాటలకందనిదంటూ లొట్టలేస్తారు. బీరకాయ‘పీచు’ వంటికి బోలెడంత ఫైబర్‌నిచ్చునంటూ ఉద్బోధిస్తారు. పాలకూర తిను... ఉక్కులా మారు నీ మేను అని హామీలు గుప్పిస్తారు. అలాగని వీరు కూరగాయల వ్యాపారులు కాదు. పక్కా ‘వెజ్’ ఫ్యాన్స్. ‘అచ్చమైన శాకాహారిగా మారడానికి గర్వపడుతున్నాం, మీరూ మారండని చెప్పడానికి తొందరపడుతున్నాం’ అంటూ ఒక బృందంగా ఏర్పడింది ‘హైదరాబాద్ వెగాన్స్’. ఈ బృందంలో సాత్విక ఆహారపు అలవాట్లను స్వచ్ఛందంగా అనుసరించే పలువురు సభ్యులుగా ఉన్నారు. ఏడాదిన్నర క్రితం ఓ అరడజను మందితో ఏర్పడిన ఈ గ్రూప్... తమ కార్యకలాపాలను విస్తరిస్తూ అనతి కాలంలోనే సభ్యుల సంఖ్యను 250కి చేర్చగలిగింది.
 
కార్యక్రమాలివీ..
‘వెగాన్స్’... నెలవారీ సమావేశాలు నిర్వహిస్తారు. తమలో నుంచి ఒక వలంటీర్ ఇంటిని దీని కోసం ఎంచుకుంటారు. అక్కడ పాట్ లాక్ (ఒక్కొక్కరు ఒక్కో వంటకం వండి తెచ్చి తినే విందు శైలి) నిర్వహించుకుంటారు. గెట్ టు గెదర్స్ పేరుతో జరిగే ఈ సమావేశాలకు తలా ఒక ఆరోగ్యకరమైన వంటకంతో హాజరవుతారు. బఫేలో అన్ని వంటకాలు రుచి చూస్తారు. అనంతరం మనిషికి మేలు చేసే ఆహారంపై తాము ఆ నెల రోజుల్లో తెలుసుకున్న కొత్త విషయాలు, అంశాలను ఒక్కొక్కరు ప్రస్తావిస్తారు. వీరు తెచ్చే వంటల్లో మలాయ్‌కుఫ్తా, తోఫు(పనీర్) మసాలా, కర్డ్ రైస్, కేక్స్, ఐస్‌క్రీమ్స్, కాజూ ఛీజ్‌తో పిజ్జా, విభిన్న రకాల ఫ్లేవర్స్‌ను విరజిమ్మే హెర్బల్ టీ, సోయా ఐస్‌క్రీమ్స్, వెగాన్ కేక్స్, మిల్క్ ఫ్రీ చాక్లెట్ బిస్కెట్స్... వంటివెన్నో ఉంటాయి. ఇవేవీ జీవ సంబంధ ఉత్పత్తులతో తయారైనవి కాకపోవడం విశేషం.  

శాకాహారుల నినాదాలివే..
ఏ జీవి అయినా బాధ పడుతూ నీకు ఆహారం ఇస్తే... అది నీకు క్షేమకరం కాదు’ అనేదే వెగాన్ సిద్ధాంతం. పాలు, పెరుగు, ఛీజ్, నెయ్యి... ఇంకా పాల ఉత్పత్తులు, ఊలు దుస్తులు, తోలు ఉత్పత్తులు, సిల్క్, తేనె... ఇలా జంతువుల నుంచి వచ్చేదేదైనా సరే వాడడం సరికాదు.
 
ఏనుగులు, గుర్రాల వంటి అత్యంత శక్తివంతమైన జంతువులు పూర్తిగా వెజిటేరియన్లే. వాటికి ఎముకల బలహీనత వంటి సమస్యలు రాని కారణం అదే.
 
అత్యధికంగా డెయిరీ ఉత్పత్తులను వినియోగిస్తున్న దేశాలు అదే స్థాయిలో ఆస్టియోపొరోసిస్ (ఎముకల గుల్లబారే వ్యాధి) బాధితులున్నవిగా గుర్తింపు పొందాయి.
 
మీరు అవసరమైనన్ని కేలరీల ఆహారం తీసుకుంటున్నట్లయితే అవసరమైనంత ప్రోటీన్ లభిస్తున్నట్టే. మనం నిజానికి అవసరానికి మించి ప్రోటీన్‌ను తీసుకుంటాం. అదే మనకు ఆస్టియోపొరోసిస్, కిడ్నీ సమస్యలను తెస్తుంది. పప్పులు, బీన్స్, శనగలు, రాజ్‌మా, సోయా, ఆల్మండ్స్ వంటివన్నీ పుష్కలంగా ప్రొటీన్స్‌ను అందిస్తాయి.
 
ఒలింపియన్ ఆఫ్ ది సెంచురీ కార్ల్‌లూయిస్ నుంచి జోల్ కిర్కిలిస్ దాకా అందరూ వెగాన్సే. బిల్‌క్లింటన్ సైతం వెగాన్.
   
శాకాహారం అంటే ఆహారపు అలవాట్లలో ఒక విధానం కాదు. మనిషి అసలైన ఆహార విధానం. మాంసాహారం ద్వారా లభించే పోషక విలువలన్నీ శాకాహార పదార్థాల్లో పుష్కలంగా ఉంటాయి.
   
పాలు తీసుకోవద్దంటే పూర్తిగా పాల ఉత్పత్తుల రుచులకు దూరం కావాల్సిన పని లేదు. సహజసిద్ధమైన దినుసుల నుంచి పాలు తయారీ విధానాలు ఉన్నాయి. పాల పదార్థాలన్నింటినీ దినుసుల పాలను ఉపయోగించి తయారు చేసుకోవచ్చు. ఖరీదు కూడా ఒకటే. పైగా కొలెస్ట్రాల్ ఫ్రీ.
   
బాదంపప్పు, వేరుశనగ పప్పు, జీడిపప్పు, కొబ్బరి, బియ్యం, బీన్స్ నుంచి పాలు తయారు చేసుకోవడం చాలా సులువు. 100 గ్రాముల బాదం పాలు ఇంటిల్లిపాదికీ సరిపోతాయి.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement