సిమెంట్ రంగంపై క్రిసిల్ నివేదిక
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చడానికి భారత సిమెంట్ పరిశ్రమ 2027 మార్చి నాటికి రూ.1.25 లక్షల కోట్లు పెట్టుబడి చేయనుందని రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ నివేదిక తెలిపింది. ఈ కాలంలో 130 మిలియన్ టన్నుల సిమెంట్ గ్రైండింగ్ సామర్థ్యం తోడవుతోందని వెల్లడించింది. ఇది ప్రస్తుతం ఉన్న సామర్థ్యంలో 20 శాతానికి సమానం అని వివరించింది.
క్రిసిల్ నివేదిక ప్రకారం.. ఆరోగ్యకర డిమాండ్ దృక్పథం, మార్కెట్ వాటా కోసం పోటీ ఈ పెట్టుబడులను నడిపిస్తాయి. తక్కువ మూలధన వ్యయాలు, బలమైన బ్యాలెన్స్ షీట్లు కంపెనీల క్రెడిట్ ప్రొఫైల్స్‌ను స్థిరంగా ఉంచుతాయి. అంచనా వేసిన పెట్టుబడులు గత మూడు ఆర్థిక సంవత్సరాలలో చేసిన క్యాపెక్స్ కంటే 1.8 రెట్లు ఉంటుంది. అయినప్పటికీ తయారీదారుల క్రెడిట్ రిస్క్ ప్రొఫైల్‌లు స్థిరంగా ఉంటాయి.
దశాబ్దంలో గరిష్టంగా..
గత మూడు ఆర్థిక సంవత్సరాలలో సిమెంట్ డిమాండ్‌లో ఆరోగ్యకరంగా 10 శాతం వార్షిక పెరుగుదల.. సామర్థ్యం జోడింపును మించిన వృద్ధిని సాధించింది. 2023–24లో వినియోగ స్థాయి ఈ దశాబ్దంలో గరిష్టంగా 70 శాతానికి చేర్చింది. ఇది సిమెంట్ తయారీదారులను ‘క్యాపెక్స్ పెడల్‌ను నొక్కడానికి‘ ప్రేరేపించింది. 2024 మార్చి 31 నాటికి పరిశ్రమ స్థాపిత సిమెంట్ గ్రైండింగ్ సామర్థ్యంలో 80 శాతానికి పైగా కైవసం చేసుకున్న 20 సిమెంట్ తయారీ సంస్థల విశ్లేషణ ఆధారంగా ఈ నివేదిక రూపొందించినట్టు క్రిసిల్ తెలిపింది.
డిమాండ్ ఔట్‌లుక్..
సిమెంట్ పరిశ్రమ మూలధన వ్యయాలు ఇప్పటికీ తక్కువగా ఉన్నాయి. 2025–26, 2026–27 ఆర్థిక సంవత్సరాలలో 0.7–0.9 శ్రేణిలో ఉండొచ్చు. ఇది గత మూడు ఆర్థిక సంవత్సరాల మాదిరిగానే ఉంది. 2025–2029 ఆర్థిక సంవత్సరాల్లో 7 శాతం వార్షిక వృద్ధి రేటుతో సిమెంట్ డిమాండ్ ఔట్‌లుక్ ఆరోగ్యంగా ఉంది.
రాబోయే మూడు ఆర్థిక సంవత్సరాల్లో క్యాపెక్స్‌లో వృద్ధి ప్రధానంగా పెరుగుతున్న డిమాండ్‌తోపాటు.. దేశవ్యాప్తంగా ఉనికిని మెరుగుపరుచుకోవాలనే సిమెంట్ తయారీదారుల ఆకాంక్షలకు అనుగుణంగా ఉంటుందని క్రిసిల్ రేటింగ్స్ సీనియర్ డైరెక్టర్, డిప్యూటీ చీఫ్ రేటింగ్స్ ఆఫీసర్ మనీష్ గుప్తా తెలిపారు. సిమెంట్ తయారీదారుల సంఘం (సీఎంఏ) ప్రకారం దేశంలో స్థాపిత సిమెంట్ సామర్థ్యం 670 మిలియన్ టన్నులు.
Comments
Please login to add a commentAdd a comment