Cement Industry
-
అదానీ చేతికి ఓరియంట్ సిమెంట్
న్యూఢిల్లీ: సిమెంట్ పరిశ్రమలో స్థానాన్ని మరింత పటిష్టం చేసుకునే దిశగా అదానీ గ్రూప్ కొనుగోళ్ల పరంపర కొనసాగిస్తోంది. తాజాగా సీకే బిర్లా గ్రూప్‌లో భాగమైన ఓరియంట్ సిమెంట్ (ఓసీఎల్) కొనుగోలుకు ఒప్పందం కుదుర్చుకుంది. డీల్ విలువ సుమారు రూ. 8,100 కోట్లుగా ఉండనుంది. కంపెనీ ప్రకటన ప్రకారం అదానీ గ్రూప్‌లో భాగమైన అంబుజా సిమెంట్స్ సంస్థ... ఓరియంట్ సిమెంట్‌లో 46.8 శాతం వాటాలను చైర్మన్ సీకే బిర్లాతో పాటు నిర్దిష్ట పబ్లిక్ షేర్‌హోల్డర్ల నుంచి రూ.3,791 కోట్లకు కొనుగోలు చేయనుంది.దీంతో మరో 26 శాతం వాటాను కొనుగోలు చేసేందుకు ఓపెన్ ఆఫర్ ఇవ్వాల్సి ఉంది. ఒక్కో ఓసీఎల్ షేరుకు రూ. 395.40 రేటు చొప్పున చెల్లించనున్నట్లు, ఈ కొనుగోలుతో తమ మార్కెట్ వాటా రెండు శాతం మేర పెరగనున్నట్లు అంబుజా సిమెంట్స్ తెలిపింది. ఇందుకు సంబంధించి ఒప్పందం కుదుర్చుకున్నట్లు వెల్లడించింది. ‘ఓసీఎల్ కొనుగోలుతో అంబుజా 2025 ఆర్థిక సంవత్సరం నాటికి 100 మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యాన్ని సాధిస్తుంది. కీలక మార్కెట్లలో విస్తరించడానికి, మార్కెట్ వాటాను 2% మేర పెంచుకోవడానికి ఈ డీల్ తోడ్పడుతుంది‘ అని అంబుజా సిమెంట్స్ డైరెక్టర్ కరణ్ అదానీ తెలిపారు. టెక్నాలజీ, సరీ్వస్ ఆధారిత వ్యాపారాలపై మరింత ఇన్వెస్ట్ చేసే క్రమంలో విక్రయ నిర్ణయం తీసుకున్నట్లు ఓరియంట్ సిమెంట్ చైర్మన్ సీకే బిర్లా తెలిపారు.అదనంగా మరో 8.5 మిలియన్ టన్నుల సామర్థ్యం .. ఓరియంట్ సిమెంట్‌కు పశ్చిమంలో ఒకటి, దక్షిణాదిలో ఒకటి చొప్పున మొత్తం 2 సిమెంట్ ప్లాంట్లు ఉన్నాయి. వీటి ఉత్పత్తి సామర్థ్యం 8.5 మిలియన్ టన్నులు. అలాగే, మరో 8.1 మిలియన్ టన్నుల ప్రాజెక్టులు సిద్ధంగా ఉన్నాయి. రాజస్తాన్‌లోని చిత్తోర్‌గఢ్‌లో అత్యంత నాణ్యమైన సున్నపు రాయి గని ఈ సంస్థ సొంతం. ఓసీఎల్ కొనుగోలుతో అంబుజా సామర్థ్యం 97.4 మిలియన్ టన్నులకు పెరుగుతుంది. -
సిమెంట్ పరిశ్రమలో తగ్గిన వృద్ధి వేగం
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సిమెంట్ పరిశ్రమలో వృద్ధి నిదానించొచ్చని, 7–8 శాతం మేర నమోదు కావొచ్చని రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ అంచనా వేసింది. 475 మిలియన్ టన్నుల మేర డిమాండ్ ఉండొచ్చని పేర్కొంది. గడిచిన రెండు ఆర్థిక సంవత్సరాల్లో సిమెంట్ రంగంలో డిమాండ్ ఏటా 11 శాతం చొప్పున వృద్ధి చెందడం గమనార్హం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో (ఏప్రిల్–జూన్) సిమెంట్ డిమాండ్ కేవలం 3 శాతం వృద్ధినే నమోదు చేయడం గమనార్హం. వేసవిలో అధిక వేడి వాతావరణానికి తోడు, సాధారణ ఎన్నికల సమయంలో కార్మికుల కొరత డిమాండ్ మందగించడానికి కారణాలుగా క్రిసిల్ తెలిపింది. రెండో త్రైమాసికంలోనూ (జూలై–సెపె్టంబర్) సిమెంట్ డిమాండ్ మొదటి క్వార్టర్లో మాదిరే నమోదై ఉండొచ్చని అంచనా వేసింది. అయితే, అక్టోబర్ నుంచి వచ్చే ఏడాది మార్చి వరకు ద్వితీయ ఆరు నెలల కాలం (2024–25)లో సిమెంట్ పరిశ్రమలో డిమాండ్ మెరుగ్గా ఉంటుందని పేర్కొంది. అంతేకాదు మార్జిన్లు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మెరుగ్గా ఉంటాయని తెలిపింది. నిర్వహణ లాభం టన్నుకు రూ.975–1,000 మధ్య ఉండొచ్చని, ఇది దశాబ్ద సగటు రూ.963 కంటే ఎక్కువని పేర్కొంది. దేశ విక్రయాల్లో 85% వాటా కలిగిన 18 సిమెంట్ తయారీ సంస్థలను విశ్లేశించి క్రిసిల్ ఈ నివేదికను రూపొందించింది. హౌసింగ్ నుంచి డిమాండ్.. ఇళ్ల నిర్మాణ రంగం నుంచి సిమెంట్ డిమాండ్ పుంజుకోవచ్చని, మెరుగైన వర్షాలు, గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్ పుంజుకోవడాన్ని క్రిసిల్ నివేదిక ప్రస్తావించింది. మొత్తం సిమెంట్ వినియోగంలో ఇళ్ల నిర్మాణ రంగం 55–60% వాటా ఆక్రమిస్తుండడం గమనార్హం. దీనికి తోడు మౌలిక వసతుల కల్పనపై ప్రభుత్వం చేస్తున్న వ్యయాలు సైతం సిమెంట్ డిమాండ్‌కు మద్దతుగా నిలుస్తాయని.. సిమెంట్ డిమాండ్‌లో మౌలిక రంగం వాటా 30 శాతంగా ఉంటుందని తెలిపింది. వాస్తవానికి మౌలిక రంగం నుంచి సిమెంట్‌కు డిమాండ్ జూలై వరకు స్తబ్దుగానే ఉన్నప్పటికీ.. అక్టోబర్ నుంచి కేంద్ర ప్రభుత్వ మూలధన వ్యయాలు పెరుగుతాయని అంచనా వేస్తున్నట్టు పేర్కొంది. ఇది ఇన్ఫ్రాస్ట్రక్చర్ నుంచి సిమెంట్‌కు డిమాండ్‌ను పెంచుతుందని వివరించింది. 2024–25 బడ్జెట్లో మూలధన వ్యయాలకు కేటాయింపులను కేంద్రం 6% పెంచడంతో మౌలిక రంగ ప్రాజెక్టులపై ప్రభుత్వ వ్యయాలు పెరుగుతాయని తెలిపింది. కంపెనీల వద్ద నగదు నిల్వలు మెరుగైన స్థితిలో ఉండడం వాటి రుణ పరపతిని స్థిరంగా ఉంచేలా చేస్తుందని పేర్కొంది. ఇక నిర్మాణ రంగ కార్యకలాపాలు మందగించడం లేదా మౌలిక ప్రాజెక్టులకు సంబంధించిన వ్యయాలు బలహీనంగా ఉంటే కనుక అది సిమెంట్ డిమాండ్‌ను దెబ్బతీయవచ్చని రిస్‌్కలను ప్రస్తావించింది. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల వల్ల ఇంధన, కమోడిటీల ధరల్లో తీవ్ర హెచ్చుతగ్గులు లేదా కంపెనీలు సిమెంట్ విక్రయ ధరలను పెంచలేకపోవడం కంపెనీల లాభదాయకతపై ప్రతికూల ప్రభావం చూపించొచ్చని హెచ్చరించింది. -
రూ.1.25 లక్షల కోట్ల పెట్టుబడులు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చడానికి భారత సిమెంట్ పరిశ్రమ 2027 మార్చి నాటికి రూ.1.25 లక్షల కోట్లు పెట్టుబడి చేయనుందని రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ నివేదిక తెలిపింది. ఈ కాలంలో 130 మిలియన్ టన్నుల సిమెంట్ గ్రైండింగ్ సామర్థ్యం తోడవుతోందని వెల్లడించింది. ఇది ప్రస్తుతం ఉన్న సామర్థ్యంలో 20 శాతానికి సమానం అని వివరించింది. క్రిసిల్ నివేదిక ప్రకారం.. ఆరోగ్యకర డిమాండ్ దృక్పథం, మార్కెట్ వాటా కోసం పోటీ ఈ పెట్టుబడులను నడిపిస్తాయి. తక్కువ మూలధన వ్యయాలు, బలమైన బ్యాలెన్స్ షీట్లు కంపెనీల క్రెడిట్ ప్రొఫైల్స్‌ను స్థిరంగా ఉంచుతాయి. అంచనా వేసిన పెట్టుబడులు గత మూడు ఆర్థిక సంవత్సరాలలో చేసిన క్యాపెక్స్ కంటే 1.8 రెట్లు ఉంటుంది. అయినప్పటికీ తయారీదారుల క్రెడిట్ రిస్క్ ప్రొఫైల్‌లు స్థిరంగా ఉంటాయి. దశాబ్దంలో గరిష్టంగా.. గత మూడు ఆర్థిక సంవత్సరాలలో సిమెంట్ డిమాండ్‌లో ఆరోగ్యకరంగా 10 శాతం వార్షిక పెరుగుదల.. సామర్థ్యం జోడింపును మించిన వృద్ధిని సాధించింది. 2023–24లో వినియోగ స్థాయి ఈ దశాబ్దంలో గరిష్టంగా 70 శాతానికి చేర్చింది. ఇది సిమెంట్ తయారీదారులను ‘క్యాపెక్స్ పెడల్‌ను నొక్కడానికి‘ ప్రేరేపించింది. 2024 మార్చి 31 నాటికి పరిశ్రమ స్థాపిత సిమెంట్ గ్రైండింగ్ సామర్థ్యంలో 80 శాతానికి పైగా కైవసం చేసుకున్న 20 సిమెంట్ తయారీ సంస్థల విశ్లేషణ ఆధారంగా ఈ నివేదిక రూపొందించినట్టు క్రిసిల్ తెలిపింది. డిమాండ్ ఔట్లుక్.. సిమెంట్ పరిశ్రమ మూలధన వ్యయాలు ఇప్పటికీ తక్కువగా ఉన్నాయి. 2025–26, 2026–27 ఆర్థిక సంవత్సరాలలో 0.7–0.9 శ్రేణిలో ఉండొచ్చు. ఇది గత మూడు ఆర్థిక సంవత్సరాల మాదిరిగానే ఉంది. 2025–2029 ఆర్థిక సంవత్సరాల్లో 7 శాతం వార్షిక వృద్ధి రేటుతో సిమెంట్ డిమాండ్ ఔట్లుక్ ఆరోగ్యంగా ఉంది. రాబోయే మూడు ఆర్థిక సంవత్సరాల్లో క్యాపెక్స్‌లో వృద్ధి ప్రధానంగా పెరుగుతున్న డిమాండ్‌తోపాటు.. దేశవ్యాప్తంగా ఉనికిని మెరుగుపరుచుకోవాలనే సిమెంట్ తయారీదారుల ఆకాంక్షలకు అనుగుణంగా ఉంటుందని క్రిసిల్ రేటింగ్స్ సీనియర్ డైరెక్టర్, డిప్యూటీ చీఫ్ రేటింగ్స్ ఆఫీసర్ మనీష్ గుప్తా తెలిపారు. సిమెంట్ తయారీదారుల సంఘం (సీఎంఏ) ప్రకారం దేశంలో స్థాపిత సిమెంట్ సామర్థ్యం 670 మిలియన్ టన్నులు. -
లెక్కలతో సహా నిజాలు చెప్పిన వై ఎస్ ఆర్
-
మైనింగ్ సంస్కరణలతో మరింత పారిశ్రామికాభివృద్ధి
సాక్షి, అమరావతి/చెన్నై: గనుల లీజుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం మరిన్ని సంస్కరణలు చేపడితే మరింత పారిశ్రామికాభివృద్ధి సాధ్యమవుతుందని రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ పేర్కొన్నారు. ఇండియా సిమెంట్స్ ఏర్పాటై 75 ఏళ్లుపూర్తయిన సందర్భంగా చెన్నైలో శనివారం నిర్వహించిన ప్లాటినం జూబ్లీ వేడుకల్లో మంత్రి బుగ్గన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సున్నపురాయి వంటి కీలక ఖనిజాల లీజులకు సంబంధించి కేంద్ర ఎంఎండీఆర్ పాలసీలో కొద్దిపాటి మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. 1946లో 1.3 మిలియన్ టన్నుల సామర్థ్యంతో మొదలైన ఇండియా సిమెంట్స్ ప్రస్థానం... ఇప్పుడు 6 మిలియన్ టన్నులకు చేరిందని, దృఢమైన భారతజాతి నిర్మాణంలో ఈ సంస్థ కీలక భాగస్వామిగా నిలిచిందని అన్నారు. ఇండియా సిమెంట్స్‌కు ఆంధ్రప్రదేశ్‌కు పటిష్టమైన బంధం ఉందని, రాష్ట్రంలో సిమెంట్ పరిశ్రమను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పెద్దఎత్తున ప్రోత్సహిస్తున్నారని చెప్పారు. ఇండియా సిమెంట్స్ ఎండీ ఎన్.శ్రీనివాసన్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా, తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి, కేంద్ర సహాయ మంత్రి ఎల్.మురుగన్, భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని తదితరులు పాల్గొన్నారు. -
రూ.5 వేల కోట్ల డీల్: అదానీ చేతికి మరో సిమెంట్ కంపెనీ!
సాక్షి, ముంబై: బిలియనీర్, ప్రపంచ మూడో అతిపెద్ద కుబేరుడు గౌతమ్ అదానీకి చెందిన అదానీ గ్రూపు మరో సిమెంట్ కంపెనీనీ కొనుగోలు చేసినట్టు సమాచారం. సిమెంట్ పరిశ్రమలో తమ ఆధిపత్యాన్ని చాటుకునేలా తాజా డీల్ చేసుకున్నారని మార్కట్ వర్గాలు భావిస్తున్నాయి. అప్పుల భారంతో ఉన్న జైప్రకాష్ పవర్ వెంచర్స్ లిమిటెడ్ సిమెంట్ యూనిట్‌ను కొనుగోలుకు ఎడ్వాన్స్డ్ చర్చలు జరుపుతోంది. ఈ డీల్ విలువ సుమారు 5 వేల కోట్ల రూపాయలని పలు నివేదికల ద్వారా తెలుస్తోంది. ఈ డీల్చర్చలు సక్సెస్ అయితే త్వరలోనే ఒక అధికారిక ప్రకటన వెలువడనుందని భావిస్తున్నారు. (ఓలా దివాలీ గిఫ్ట్: కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్, అతిచౌక ధరలో) రుణ సంక్షోభంలో ఉన్న జైప్రకాష్ అసోసియేట్స్ అనుబంధ సంస్థ జైప్రకాష్ సిమెంట్ గ్రౌండింగ్ ప్లాంట్ ఇతర ఆస్తులను కొనుగోలు చేయనుందట. సోమవారం నాటి స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో బోర్డు రుణాన్ని తగ్గించుకునే క్రమంలో సిమెంట్ వ్యాపారాన్ని విక్రయించాలని భావిస్తున్నట్టు జైప్రకాష్ అసోసియేట్స్ వెల్లడించింది. జైప్రకాష్ పవర్ వెంచర్స్ సిమెంట్ గ్రైండింగ్ ప్లాంట్, అలాగే ఇతర నాన్-కోర్ ఆస్తులను విక్రయానికి, కొనుగోలుదారులను అన్వేషిస్తోందని ప్రకటించడం ఈ వార్తలు బలాన్నిస్తోంది. అయితే తాజా నివేదికలపై వ్యాఖ్యానించేందుకు అదానీ గ్రూప్, జైప్రకాష్ అసోసియేట్స్ ప్రతినిధులు అందుబాటులో లేరు. (WhatsApp update: అదిరిపోయే అప్డేట్,అడ్మిన్లకు ఫుల్ జోష్) సిమెంట్ వ్యాపారం పై దృష్టిపెట్టిన అదానీ గ్రూపు మేలో స్విట్జర్లాండ్‌కు చెందిన హోల్సిమ్ లిమిటెడ్ నుండి అంబుజా సిమెంట్స్ లిమిటెడ్ , ఏసీసీ లిమిటెడ్‌లను కొనుగోలు చేసిన తరువాత ఏటా 67.5 మిలియన్ టన్నుల స్థాపిత ఉత్పత్తి సామర్థ్యంతో దాదాపు భారతదేశంలో రెండవ అతిపెద్ద సిమెంట్ ఉత్పత్తిదారుగా అవతరించింది. సిమెంట్ పరిశ్రమలో 200 బిలియన్ రూపాయల పెట్టుబడులు పెట్టాలని, రానున్న ఐదేళ్లలో తమ ఉత్పత్తి సామర్థ్యాన్ని 140 మిలియన్ టన్నులకు పెంచాలని లక్క్ష్యంగా పెట్టుకున్నట్టు గత నెలలో అదానీ ప్రకటించిన సంగతి విదితమే. ఇదీ చదవండి: బిలియనీర్ గౌతమ్ అదానీ విదేశీ నిధులపై కన్ను: భారీ కసరత్తు -
ఏపీకి ‘స్విస్’ సిమెంట్ టెక్నాలజీ!
సాక్షి, అమరావతి: వాతావరణ కాలుష్యాన్ని తగ్గించి, విద్యుత్‌ను పొదుపు చేయగలిగే సామర్థ్యం గల కొత్తరకం సిమెంట్ మిక్స్ సాంకేతికతను రాష్ట్రానికి అందించేందుకు స్విట్జర్లాండ్‌కు చెందిన స్విస్ ఏజెన్సీ ఫర్ డెవలప్మెంట్ అండ్ కో–ఆపరేషన్ (ఎస్డీసీ) ముందుకొచ్చింది. లైంస్టోన్ కాల్సిన్డ్ క్లే సిమెంట్ (ఎల్సీ–3) అనే ఈ కొత్త సాంకేతికత సిమెంట్ పరిశ్రమలకు లాభాలను కూడా తెచ్చిపెడుతుందని వివరించింది. ఈ మేరకు స్విట్జర్లాండ్ ఎంబసీ కో–ఆపరేషన్, డెవలప్మెంట్ హెడ్ జోనాథన్ డెమింగే ప్రతిపాదించినట్లు ఇంధన శాఖ గురువారం వెల్లడించింది. చదవండి: ‘సంక్షేమం’ ఖర్చులో ఏపీదే అగ్రస్థానం సిమెంట్ తయారీ రంగంలో మన దేశం ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉంది. క్లింకర్ అనే ముడి పదార్థాన్ని సిమెంట్ తయారీలో ఎక్కువ మోతాదులో ఉపయోగించటంవల్ల అది వాతావరణ కాలుష్యానికి దారితీస్తోందని శాస్త్రవేత్తలు ఎప్పటినుంచో ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. సాధారణంగా సిమెంట్ తయారీలో ఉపయోగించే ముడిపదార్థాల్లో 95 శాతం క్లింకర్, 5 శాతం జిప్సం వాడతారు. కానీ, ఎస్డీసీ ప్రతిపాదిస్తున్న లైంస్టోన్ కాల్సిన్డ్ క్లే సిమెంట్ మిక్స్‌ను వాడటంవల్ల వాతావరణంలో కర్బన ఉద్గారాలు 40 శాతం తగ్గుతాయని, 20 శాతం ఇంధనాన్ని ఆదా చెయ్యొచ్చని ఇంధన శాఖ వెల్లడించింది. పరిశ్రమల దృష్టికి తీసుకెళ్తాం.. ఇండో స్విస్ బీప్ ద్వారా ఏపీ గృహ నిర్మాణ పథకంలో ఇంటి లోపలి ఉష్ణోగ్రతలు తగ్గించే సాంకేతికతను కొన్ని రోజుల ముందే ప్రవేశపెట్టగా, ఇప్పుడు సిమెంట్ పరిశ్రమలకు ఎల్సీ–3 సాంకేతికతను అందించేందుకు స్విస్ ఏజెన్సీ ముందుకొచ్చింది. ఎస్డీసీ ప్రతిపాదించిన నూతన సిమెంట్ మిక్స్ సాంకేతికత గురించి ప్రభుత్వానికి వివరించి, పరిశ్రమల శాఖ సహకారంతో ఈ అంశాన్ని సిమెంట్ పరిశ్రమల దృష్టికి తీసుకెళ్తాం. – కె.విజయానంద్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ఇంధన శాఖ -
సిమెంట్ పరిశ్రమ పురోభివృద్ధిపై కేంద్రం దృష్టి
సాక్షి, న్యూఢిల్లీ: సిమెంట్ పరిశ్రమ పురోగతిపై కేంద్రం ప్రత్యేక దృష్టి పెట్టింది. దాల్మియా భారత్ గ్రూప్ సీఎండీ పునీత్ దాల్మియా నేతృత్వంలో 25 మంది సభ్యులతో ప్రత్యేకంగా ఒక మండలిని (డెవలప్మెంట్ కౌన్సిల్ ఫర్ సిమెంట్ ఇండస్ట్రీ–డీసీసీఐ) ఏర్పాటు చేసింది. ఈ మండలి కాలపరిమితి రెండేళ్లని అంతర్గత వాణిజ్యం, పారిశ్రామిక అభివృద్ధి శాఖ (డీపీఐఐటీ) ఒక ప్రకటనలో పేర్కొంది. దృష్టి సారించే అంశాలు.. పరిశ్రమలో వ్యర్థాల నివారణ, గరిష్ట ఉత్పత్తి సాధన, నాణ్యత పెంపు, వ్యయాల తగ్గింపు, ఉత్పిత్తి ప్రమాణాల మెరుగుదల వంటి కీలక అంశాలపై ఈ మండలి తగిన సిఫారసులు చేస్తుందని ఉన్నత స్థాయి వర్గాలు తెలిపాయి. వ్యవస్థాపక సామర్థ్యం పూర్తి వినియోగం, పరిశ్రమ పనితీరు మెరుగుదల, అంతగా సామర్థ్యంలేని కర్మాగారాలకు సంబంధించి నిర్ణయాలు– సిఫారసులు, ఈ రంగంలో మానవ వనరులకు ప్రత్యేక శిక్షణ, అలాగే శాస్త్రీయ, పారిశ్రామిక పరిశోధన, కార్మికులకు భద్రతా ప్రమాణాలు, కొత్త పరికరాలు, విధానాల అభివృద్ధి, అత్యుత్తమ పని పరిస్థితుల కల్పన వంటి అంశాలపై కూడా మండలి దృష్టి సారిస్తుంది. అకౌంటింగ్, కాస్టింగ్ అంశాల్లో ప్రమాణాల స్థిరీకరణకు కృషి చేస్తుంది. సభ్యుల్లో కొందరు... ప్రకటన ప్రకారం కమిటీ సభ్యుల్లో అల్ట్రాటెక్ సిమెంట్ ఎండీ కేసీ జన్వార్, శ్రీ సిమెంట్ ఎండీ హెచ్ఎం బంగూర్, ఇండియా సిమెంట్స్ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ రాకేశ్ సింగ్; బిర్లా కార్పొరేషన్ సీఈఓ ప్రచేతా మజుందార్; జేకే సిమెంట్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ మాధవకృష్ణ సింఘానియా, జెఎస్‌డబ్లు్య సిమెంట్ సీఈఓ నీలేష్ నార్వేకర్‌లు ఉన్నారు. -
వైఎస్సార్సీపీ నేతపై ‘చెట్టినాడ్’ సెక్యూరిటీ దాడి
దాచేపల్లి (గురజాల): సిమెంట్ పరిశ్రమలో కార్మికుల సమస్యలపై యాజమాన్యంతో చర్చించేందుకు వెళ్లిన వైఎస్సార్సీపీ నాయకుడు కర్పూరపు వెంకటకోటయ్యపై సెక్యూరిటీ దాడి చేసిన ఘటన గుంటూరు జిల్లా పెదగార్లపాడు గ్రామ సమీపంలోని చెట్టినాడ్ సిమెంట్ పరిశ్రమ వద్ద బుధవారం జరిగింది. బాధితుడు వెంకటకోటయ్య, స్థానికుల కథనం ప్రకారం.. చెట్టినాడ్ సిమెంట్ పరిశ్రమలో పనిచేస్తున్న తమకు యాజమాన్యం జీతాలు చెల్లించడంలేదని, లాక్డౌన్ సమయంలో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నామని పలువురు కార్మికులు పెదగార్లపాడు వైఎస్సార్సీపీ నేత వెంకటకోటయ్యతో చెప్పుకున్నారు. సమస్యను యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లేందుకు వెంకటకోటయ్య, అతని కుమారుడు శ్రీనివాసరావు బుధవారం పరిశ్రమ ప్రధానగేట్ వద్దకు చేరుకున్నారు. అప్పటికే అక్కడున్న టీడీపీ నాయకుడిని సెక్యూరిటీ సిబ్బంది తనిఖీలు చేయకుండా, విజిటర్స్ రిజిస్టర్లో సంతకం చేయించకుండా లోపలికి పంపించారు. వెంకటకోటయ్యను మాత్రం సంతకం చేసి సెల్‌ఫోన్ తమకు అప్పగించిన తరువాతే లోపలికి వెళ్లాలని చెప్పారు. టీడీపీ నాయకుడిని పంపించి తననెందుకు పంపించరని అడుగుతున్న వెంకటకోటయ్యపై సెక్యూరిటీ సిబ్బంది, పర్సనల్ డిపార్ట్మెంట్ అధికారి శివశంకర్ దుర్భాషలాడుతూ పిడిగుద్దులు, లాఠీకర్రలతో దాడికి తెగబడ్డారు. వెంకటకోటయ్య స్పృహతప్పి పడిపోయాడు. వెంకటకోటయ్య కుమారుడు శ్రీనివాసరావుపై కూడా సెక్యూరిటీ సిబ్బంది దాడి చేయడంతో తలకు బలమైన గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న గ్రామస్తులు, వైఎస్సార్సీపీ కార్యకర్తలు పరిశ్రమ వద్దకు చేరుకుని వెంకటకోటయ్యపై దాడిచేసిన వ్యక్తులపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని ఆందోళనకు దిగారు. పోలీసులు చేరుకొని వెంకటకోటయ్యపై దాడికి పాల్పడిన శివశంకర్‌తో పాటుగా మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. గాయపడిన వెంకటకోటయ్య, శ్రీనివాసరావును పిడుగురాళ్లలోని వేట్ వైద్యశాలకు తరలించారు. -
రామ్‌కో సిమెంట్ భారీ విస్తరణ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సిమెంటు తయారీ సంస్థ రామ్‌కో సిమెంట్స్ భారీ విస్తరణ చేపట్టింది. ఇందుకోసం రూ.4,000 కోట్లు వ్యయం చేస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాలో 3.15 మిలియన్ టన్నుల సామర్థ్యంతో సిమెంటు ఉత్పత్తి కేంద్రాన్ని రూ.1,500 కోట్లతో నెలకొల్పుతోంది. ప్లాంటు ద్వారా ప్రత్యక్షంగా 300 మందికి, పరోక్షంగా 1,000 మందికి ఉపాధి లభిస్తుందని రామ్‌కో మార్కెటింగ్ ఈడీ బాలాజీ కె మూర్తి గురువారం వెల్లడించారు. సూపర్‌క్రీట్ సిమెంట్‌ను ఇక్కడి మార్కెట్లో విడుదల చేసిన సందర్భంగా మార్కెటింగ్ ప్రెసిడెంట్ ఆర్.రామకృష్ణన్‌తో కలిసి మీడియాతో మాట్లాడారు. కృష్ణా జిల్లాలో 1.5 మిలియన్ టన్నుల క్లింకర్ యూనిట్, విశాఖపట్నం జిల్లాలో 1 మిలియన్ టన్నుల గ్రైండింగ్ కేంద్రం ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. ఒడిశాలోని సిమెంటు తయారీ ప్లాంటులో 1.5 మిలియన్ టన్నులు, కోల్‌కతాలో 1 మిలియన్ టన్నుల సామర్థ్యం జోడిస్తున్నట్టు పేర్కొన్నారు. వచ్చే ఏడాది చివరికల్లా.. కంపెనీ చేపట్టిన అన్ని ప్రాజెక్టులు 2020 డిసెంబరుకల్లా పూర్తి కానున్నాయి. కర్నూలు ప్లాంటు రాకతో ఆంధ్రప్రదేశ్‌లో రామ్‌కో సిమెంటు ఉత్పత్తి సామర్థ్యం 10 మిలియన్ టన్నులు నమోదు కానుంది. తద్వారా ఏపీలో అత్యధిక ఉత్పత్తి సామర్థ్యమున్న సంస్థగా నిలుస్తుంది. అన్ని తయారీ కేంద్రాలు కలిపి ప్రస్తుతం సంస్థ వార్షిక సిమెంటు ఉత్పత్తి సామర్థ్యం 12.5 మిలియన్ టన్నులు ఉంది. విస్తరణ పూర్తి అయితే ఇది 20 మిలియన్ టన్నులకు చేరుతుందని బాలాజీ వెల్లడించారు. 2018–19లో కంపెనీ టర్నోవరు రూ.5,146 కోట్లు. 2020–21లో ఇది రూ.7,500 కోట్లను తాకుతుందని ఆయన పేర్కొన్నారు. సుస్థిర ప్రభుత్వం ఉంటే.. ‘ఆంధ్రప్రదేశ్‌లో పలు ప్రాజెక్టులు నిలిచిపోయాయి. మీరేమో విస్తరణ చేపడుతున్నారు. ఫలితం ఎలా ఉండబోతోంది’ అని మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు.. ‘ఏ రాష్ట్రంలోనైనా ఒడిదుడుకులు తాత్కాలికం. మళ్లీ మార్కెట్ పుంజుకుంటుందన్న నమ్మకం మాకుంది. సుస్థిర ప్రభుత్వం ఉన్నప్పుడు సిమెంటుకు డిమాండ్ ఉంటుంది. మా పెట్టుబడులు కొనసాగిస్తాం’ అని బాలాజీ స్పష్టం చేశారు. మందగమన ప్రభావం సిమెంటు రంగంపై ఉందా అన్న మరో ప్రశ్నకు వ్యక్తిగత గృహాల నిర్మాణాలు అన్ని ప్రాంతాల్లోనూ కొనసాగుతున్నాయని వివరించారు. ప్రభుత్వ గృహ నిర్మాణ ప్రాజెక్టులు సాగుతున్నాయని చెప్పారు. సిమెంటు వినియోగం దేశంలో ఏప్రిల్–జూన్ కాలంలో 7–8 శాతం వృద్ధి నమోదైందన్నారు. -
ఏపీలో అల్ట్రాటెక్ సిమెంట్ భారీ ప్రాజెక్టు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సిమెంటు తయారీ సంస్థ అల్ట్రాటెక్... ఆంధ్రప్రదేశ్‌లో భారీ ప్లాంటును ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ నుంచి సంస్థకు గ్రీన్ సిగ్నల్ లభించింది. కర్నూలు జిల్లా పెట్నికోట వద్ద రానున్న ఈ ప్రాజెక్టుకై అల్ట్రాటెక్ సుమారు రూ.2,500 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. ఇప్పటికే కంపెనీ 431.92 హెక్టార్ల స్థలాన్ని ప్లాంటు కోసం కొనుగోలు చేసింది. ప్రతిపాదిత ప్రాజెక్టులో భాగంగా 40 లక్షల టన్నుల వార్షిక సామర్థ్యంతో క్లింకర్ యూనిట్, 60 లక్షల టన్నుల సామర్థ్యంతో సిమెంటు తయారీ కేంద్రాలు ఏర్పాటవుతాయి. అలాగే ప్లాంటు అవసరాల కోసం 60 మెగావాట్ల విద్యుత్ ప్లాంటుతోపాటు తయారీ ప్రక్రియలో జనించే వేడి నుంచి విద్యుత్‌ను ఉత్పత్తి చేసే 15 మెగావాట్ల పవర్ ప్రాజెక్టు కూడా రానుంది. 900 మందికి ఈ ప్రాజెక్టు ద్వారా ఉపాధి లభించనుందని సమాచారం. ప్రాజెక్టు ఏర్పాటు, నిర్వహణకై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి నుంచి అల్ట్రాటెక్ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. విభిన్న రంగాల్లో ఉన్న ఆదిత్య బిర్లా గ్రూప్ కంపెనీయే అల్ట్రాటెక్ సిమెంట్. సామర్థ్యం పరంగా భారత్‌లో అతిపెద్ద సిమెంటు ఉత్పత్తిదారుగా నిలిచింది. అయిదు దేశాల్లో విస్తరించిన ఈ సంస్థకు ఏటా 6.8 కోట్ల టన్నుల సిమెంటు తయారీ సామర్థ్యం ఉంది. -
సిమెంట్‌పై జీఎస్టీని 18%కి తగ్గించాలి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశ ఆర్థికాభివృద్ధి, ఉద్యోగ కల్పనలో సిమెంట్ పరిశ్రమ ప్రధాన భాగస్వామి అని ఫస్ట్ కన్స్ట్రక్షన్ కౌన్సిల్ (ఎఫ్‌సీసీ) తెలియజేసింది. ప్రస్తుతం సిమెంట్‌పై ఉన్న 28 శాతం జీఎస్టీని వెంటనే 18 శాతానికి తగ్గించాలనే అభ్యర్థనను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుందని.. త్వరలోనే అధికారికంగా నిర్ణయం వెలువడుతుందని ఎఫ్‌సీసీ ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ ప్రతాప్ పడోడే తెలిపారు. గురువారమిక్కడ ప్రారంభమైన రెండు రోజుల 10వ సిమెంట్ ఎక్స్పో సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. జీఎస్టీ తగ్గింపుతో అందుబాటు గృహాలు, రహదారులు, విద్యుత్ వంటి మౌలిక రంగాల్లో సిమెంట్ వినియోగం పెరుగుతుందని చెప్పారు. దేశ వృద్ధి కంటే సిమెంట్ పరిశ్రమ వృద్ధి జోరుగా ఉందన్నారు. ప్రపంచ సిమెంట్ ఉత్పత్తిలో మన దేశానిది రెండో స్థానంలో ఉందని, థర్మల్ ప్రాసెస్ సామర్థ్యాల పరంగా సిమెంట్ ఉత్పత్తిని చేయడంలో మన దేశానిది స్థానం ఉందని చెప్పారు. వచ్చే ఐదేళ్లలో దేశంలో రహదారులు, పట్టణాభివృద్ధి, విద్యుత్ వంటి మౌలిక రంగాల్లో 454 బిలియన్ డాలర్లు ఖర్చు చేయనుంది. తెలుగు రాష్ట్రాల్లో అదనంగా10–15 మిలియన్ టన్నులు.. వచ్చే ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో 10–15 మిలియన్ టన్నుల సిమెంట్ సామర్థ్యం జత అవుతుందని ప్రతాప్ తెలిపారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో 50–60 సిమెంట్ కంపెనీలున్నాయని.. 75 మి.టన్నుల సామర్థ్యం ఉందన్నారు. ముడి పదార్థాల ధర, విద్యుత్, రవాణా చార్జీలపై సిమెంట్ బ్యాగ్ ధర ఆధారపడి ఉంటుందన్నారు. 2 రోజుల సిమెంట్ ఎక్స్పో ప్రదర్శనకు భారతీ సిమెంట్ సిల్వర్ పార్టనర్ గా వ్యవహరించింది. ఎక్స్‌పోలో ఏబీబీ, ఏసీసీ, అం బుజా వంటి 80కి పైగా సిమెంట్ కంపెనీలు, 1,200 స్టాళ్లను ఏర్పాటు చేశాయి. సిమెంట్, కన్స్ట్రక్షన్, ఎక్విప్మెంట్, టెక్నాలజీ కంపెనీలు పాల్గొన్నాయి. రెండేళ్లకొకసారి ప్రాంతీయ మార్కెట్లలో సిమెంట్ ఎక్స్పో ప్రదర్శను నిర్వహిస్తామని నిర్వాహకులు తెలిపారు. -
జీఎస్టీతో ప్రయోజనాలు తక్కువే: నోమురా
ఎన్నో అంచల పన్నులతో క్లిష్టంగా మార్చేశారు... న్యూఢిల్లీ: జీఎస్టీ ప్రస్తుత నిర్మాణ స్వరూపం ద్వారా వచ్చే ప్రయోజనాలు గతంలో ఊహించినదానికంటే చాలా తక్కువగా ఉంటాయని జపాన్‌కు చెందిన ప్రముఖ అంతర్జాతీయ బ్రోకరేజీ సంస్థ నోమురా అభిప్రాయపడింది. పలు అంచల పన్ను రేట్ల ద్వారా జీఎస్టీ స్వరూపం చాలా క్లిష్టంగా ఉందని తన పరిశోధనా నివేదికలో పేర్కొంది. జీఎస్టీలో అన్ని రకాల వస్తువులు, సేవలను 5, 12, 18, 28 పన్ను పరిధిలోకి చేర్చిన విషయం తెలిసిందే. ఇక ఖరీదైన కార్లు, ఏరేటెడ్ డ్రింక్స్, పొగాకు ఉత్పత్తులపై అదనంగా సెస్‌లు కూడా ఉన్నాయి. ‘‘పలు అంచల పన్నుల ద్వారా జీఎస్టీని క్లిష్టంగా మార్చేశారు. ద్రవ్యోల్బణ ప్రభావాన్ని పరిమితం చేసేందుకు, రాజకీయ పరమైన అవసరాల కోసం ఇలా చేశారు’’ అని నోమురా పేర్కొంది. సులభతరమైన పన్ను వ్యవస్థను కలిగి ఉండడం ద్వారా పొందే ప్రయోజనాలను ఇది తగ్గించేస్తుందని అభిప్రాయపడింది. రానున్న సంవత్సరాల్లో మరింత అనుకూలమైన జీఎస్టీ రేటు దిశగా ప్రభుత్వం కృషి చేస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేసింది. దీర్ఘకాలంలో రవాణా వ్యయాలు తగ్గడం కారణంగా జీఎస్టీ ద్రవ్యోల్బణాన్ని తగ్గిస్తుందన్న ఈ సంస్థ... సమీప కాలంలో అది ఉండకపోవచ్చని అభిప్రాయపడింది. వృద్ధి అవకాశాలకు దెబ్బ: సిమెంట్ పరిశ్రమ జీఎస్టీలో సిమెంట్‌పై 28 శాతం పన్ను విధించడం ద్వారా సమస్యల్లో ఉన్న ఈ రంగంతోపాటు మౌలిక రంగానికి ఊతమిచ్చే అవకాశాన్ని ప్రభుత్వం కోల్పోయిందని సిమెంట్ తయారీ దారుల సంఘం (సీఎంఏ) అభిప్రాయపడింది. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో సిమెంట్‌పై ఇంత భారీ పన్ను మన దేశంలోనే ఉందని పేర్కొంది. ‘‘దేశంలో సిమెంట్ ధరలో 60 శాతం పన్నే. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో ఇది 11.4 శాతంగానే ఉంది. శ్రీలంకలో 20 శాతాన్ని మించలేదు’’ అని సీఎంఏ వివరించింది. తక్కువ డిమాండ్‌తో 70 శాతం సామర్థ్యాన్నే వినియోగించుకుంటున్న ఈ రంగానికి గొడ్డలి పెట్టుగా పేర్కొంది. ‘‘50 కేజీల సిమెంట్ బ్యాగు ధర రూ.300 గా ఉంది. ఇందులో రూ.180 పన్నులు, రవాణా వ్యయమే వున్నాయి. తక్కువ మార్జిన్లు, అధిక మూలధనం అవసరమైన ఈ పరిశ్రమకు ఉపశమనం కల్పించేందుకు జీఎస్టీ ఓ అవకాశం. కానీ, ఇది చేజారిపోయింది’’ అని సీఎంఏ ప్రెసిడెంట్ శైలేంద్ర చౌక్సే అన్నారు. -
సిమెంటు పరిశ్రమ 8% వృద్ధి
ఏపీ, తెలంగాణల్లో డిమాండ్ పెరుగుతోంది ► సీఎంఏ అడ్వైజర్ హండూ వెల్లడి హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సిమెంటు పరిశ్రమ ఈ ఏడాది 7–8 శాతం వృద్ధి నమోదు చేస్తుందని సిమెంట్ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్ (సీఎంఏ) అంచనా వేస్తోంది. దేశంలో 2016–17లో 300 మిలియన్ టన్నుల ఉత్పత్తి జరిగింది. ప్లాంట్ల సామర్థ్యం 425 మిలియన్ టన్నులు ఉందని సీఎంఏ టెక్నికల్ అడ్వైజర్ సురిందర్ కె హండూ తెలిపారు. గురువారమిక్కడ సీఐఐ ఆధ్వర్యంలో ప్రారంభమైన సిమెంటెక్ సదస్సులో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రపంచ సగటు వినియోగం 570 కిలోలుంటే, దేశంలో ఇది కేవలం 218 కిలోలకే పరిమితమైందని గుర్తు చేశారు. ప్రభుత్వ ప్రాజెక్టులతో సిమెంటు పరిశ్రమకు మంచి భవిష్యత్ ఉందని తెలిపారు. ప్రస్తుతం సిమెంటు ప్లాంట్ల నుంచి 300 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతోందని చెప్పారు. 800 మెగావాట్లు ఉత్పత్తి చేయగలిగే అవకాశం ఉందని, ఇందుకు ప్రభుత్వం ప్రోత్సహించాలని కోరారు. నిర్మాణాలు పెరగనున్నందున తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ఈ ఏడాది సిమెంటు డిమాండ్ గతం కంటే అధికంగా ఉంటుందని ఏసీసీ సిమెంట్ ఎనర్జీ విభాగం డైరెక్టర్ కె.ఎన్.రావు తెలిపారు. సిమెంటు ప్లాంట్లలో బొగ్గుకు ప్రత్యామ్నాయంగా చెత్తను వినియోగించడం పెరిగిందని చెప్పారు. 2010లో ఈ వినియోగం 0.6 శాతం ఉండగా, ప్రస్తుతం 4 శాతానికి చేరిందన్నారు. దీనిని 25 శాతానికి చేర్చాలని పరిశ్రమ లక్ష్యంగా చేసుకుందని అన్నారు. తయారీ వ్యయంలో ఇంధనానికి 50 శాతం ఖర్చు అవుతోందని చెప్పారు. 200 ప్లాంట్లలో 25 కంపెనీలే చెత్తను ఇంధనంగా వాడుతున్నాయని వివరించారు. -
సిమెంటు రంగంలో ఈ ఏడాది 6% వృద్ధి
• విక్రయాలు 31.8 కోట్ల టన్నులకు • ధరలు కొంత పెరిగే అవకాశం • జేఎస్‌డబ్ల్యు సీఎంవో పుష్పరాజ్ సింగ్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సిమెంటు పరిశ్రమలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 6 శాతం వృద్ధి నమోదు కానుందని జేఎస్‌డబ్ల్యు సిమెంట్ వెల్లడించింది. 2015-16లో దేశవ్యాప్తంగా 30 కోట్ల టన్నుల సిమెంటు అమ్ముడైంది. 2016-17లో ఇది 31.8 కోట్ల టన్నులు ఉండొచ్చని అంచనా వేస్తున్నట్టు సంస్థ సీఎంవో పుష్పరాజ్ సింగ్ చెప్పారు. 2015 అక్టోబరు-2016 మార్చి కాలంతో పోలిస్తే ఏప్రిల్-సెప్టెంబరులో 7-8 శాతం వృద్ధి నమోదైందని చెప్పారు. కాంక్రీల్ హెచ్డీ పేరుతో తయారు చేసిన నూతన రకం సిమెంటును విడుదల చేసిన సందర్భంగా కంపెనీ స్ట్రాటజీ వైస్ ప్రెసిడెంట్ రాహుల్ అక్కరతో కలిసి గురువారమిక్కడ మీడియాతో పుష్పరాజ్ మాట్లాడారు. హైవేలు, భారీ ప్రాజెక్టుల కారణంగా 2017-18లో విక్రయాలు 35 కోట్ల టన్నులకు చేరొచ్చన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు సైతం తారు రోడ్లకు బదులుగా ఎక్కువ కాలం మన్నే సిమెంటు రోడ్ల వైపు మొగ్గు చూపుతున్నాయని వివరించారు. పెరుగుతున్న వ్యయం.. రానున్న రోజుల్లో సిమెంటు ధరలు కొంత పెరిగే అవకాశం ఉందని, తయారీ వ్యయం అధికమవడమే ఇందుకు కారణమని పుష్పరాజ్ సింగ్ తెలిపారు. ‘సున్నపురాయి నిల్వలు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, రాజస్థాన్, కర్నాటక, చత్తీస్‌గఢ్, జార్ఖండ్ రాష్ట్రాలకే పరిమితమయ్యాయి. దీంతో సున్నపురాయి ధర నాలుగైదు రెట్లు పెరిగింది. రవాణా, ఇంధనం ఖర్చులూ అధికమవుతున్నాయి. ఇక దక్షిణాది రాష్ట్రాల్లో సిమెంటు కంపెనీల ప్లాంట్ల వినియోగం 60 శాతానికే పరిమితమైంది. తయారీ సామర్థ్యం ఎక్కువ ఉండడమే ఈ పరిస్థితికి కారణం. తూర్పు, మధ్య భారత్‌లో ప్లాంట్ల వినియోగం 80 శాతంగా ఉంది’ అని అన్నారు. జీఎస్టీ అమలైతే సిమెంటు పరిశ్రమకు ప్రయోజనమేనని చెప్పారు. విస్తరణకు రూ.12,700 కోట్లు.. జేఎస్‌డబ్ల్యు సిమెంట్ 2020 నాటికి ఉత్పత్తి సామర్థ్యాన్ని 3 కోట్ల టన్నులకు చేర్చాలని లక్ష్యంగా చేసుకుంది. ఇందుకుగాను రూ.12,700 కోట్లు వెచ్చించనున్నట్టు రాహుల్ అక్కర తెలిపారు. కర్నూలు జిల్లా నంద్యాల ప్లాంటుతోపాటు మహారాష్ట్ర, కర్నాటకలో ఉన్న ప్లాంట్ల మొత్తం సామర్థ్యం 70 లక్షల టన్నులు. కొత్తగా పశ్చిమ బెంగాల్, ఒడిషా, కర్నాటక, మధ్యప్రాచ్య దేశంలోనూ ప్లాంటును నెలకొల్పుతోంది. కాంక్రీల్ హెచ్డీ ఉత్పాదనకై పేటెంటుకు దరఖాస్తు చేసుకున్నట్టు రాహుల్ వెల్లడించారు. -
సిమెంటు రేట్లు పెరుగుతాయ్!
* బొగ్గు రవాణా చార్జీల పెంపు ప్రభావం * సిమెంటు తయారీదార్ల సంఘం వెల్లడి న్యూఢిల్లీ: రైల్వేలు బొగ్గు రవాణా చార్జీలను పెంచడంతో సిమెంటు రేట్లు పెరిగే అవకాశం ఉందని పరిశ్రమ విశ్లేషకులు పేర్కొంటున్నారు. రవాణా చార్జీల పెంపు కారణంగా సిమెంటు పరిశ్రమపై రూ.2,000 కోట్లకు పైగానే ప్రతికూల ప్రభావం పడుతుందని.. ఈ భారాన్ని వినియోగదారులకే మళ్లించాల్సివస్తుందని వారు అంటున్నారు. బొగ్గు రవాణా టారిఫ్‌లలో రైల్వే శాఖ గత వారం కొన్ని మార్పులు చేసింది. ఎక్కువ దూరం రవాణా టారిఫ్‌లను కొంత తగ్గించి.. తక్కువ దూరానికి సంబంధించిన టారిఫ్‌లను పెంచింది. అంతేకాకుండా 100 కిలోమీటర్లకు మించిన బొగ్గు రవాణాపై లోడింగ్, అన్‌లోడింగ్‌కు టన్నుకు రూ.110 చొప్పున కోల్ టెర్మినల్ సర్‌చార్జీని కూడా విధించింది. ‘రైల్వేల తాజా టారిఫ్ పెంపు వల్ల సిమెంటు పరిశ్రమ ఉత్పాదక వ్యయం పెరిగేందుకు దారి తీస్తుంది. మరోపక్క, విద్యుత్ ఉత్పాదక వ్యయం కూడా పెరుగుతుంది. ఈ రెండింటి కారణంగా పరిశ్రమపై రూ.2,000 కోట్ల భారం ఉంటుందని అంచనా. ఇప్పుడున్న పరిస్థితుల్లో దీన్ని కంపెనీలు భరించడం కష్టమే. ఫలితంగా సిమెంటు ధరలు పెరిగే అవకాశం ఉంది’ అని సిమెంటు తయారీదార్ల అసోసియేషన్(సీఎంఏ) ప్రెసిడెంట్ శైలేంద్ర చౌక్సీ వ్యాఖ్యానించారు. -
కొత్త రాజధానితో సిమెంటుకు డిమాండ్
సాక్షి ప్రత్యేక ప్రతినిధి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో నిర్మాణ రంగం పుంజుకునేంతవరకు సిమెంట్ పరిశ్రమలో ఒడుదుడుకులు తప్పవని సాగర్ సిమెంట్స్ జాయింట్ మేనేజింగ్ డెరైక్టర్ ఎస్. ఆనంద్ రెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో కొత్త రాజధాని వ్యవహారం ఇంకా ఓ కొలిక్కి రాకపోవడం, రియల్ ఎస్టేట్ సంస్థలు దూకుడు తగ్గించటం వంటి అంశాలు సిమెంట్ విక్రయాలపై ప్రభావం చూపుతోందన్నారు. ప్రభుత్వ రంగంలో నిర్వహించే గృహ, రోడ్డు, ప్రాజెక్టు నిర్మాణ పనులు వేగవంతం కాకపోవడం, మందగించిన డిమాండ్, స్థిర వ్యయాల భారం, పెరుగుతున్న రవాణా ఛార్జీలు తయారీ సంస్థల లాభదాయకతపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని సాక్షి ప్రతినిధికి ఆయన వివరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కొత్త రాజధానికి మౌలిక వసతుల కల్పన సిమెంట్ పరిశ్రమకు ఎంతో కలిసివచ్చే అంశమని, ఈ ఆర్థిక సంవత్సరం చివరికల్లా పరిస్థితుల్లో మార్పు వస్తుందని తాము ఆశిస్తున్నట్లు తెలిపారు. బీఎంఎం విలీనం పూర్తికావచ్చింది...: తాడిపత్రిలో ఇటీవల తాము కొనుగోలు చేసిన బీఎంఎం విలీనం ప్రక్రియ పూర్తికావచ్చిందన్నారు. ఈ ఆర్థిక సంవత్సరం చివరికల్లా బీఎంఎం పూర్తిగా సాగర్ గ్రూప్ కంపెనీ అవుతుందని ఆనంద రెడ్డి వివరించారు. విలీనం తర్వాత సాగర్ సిమెంట్స్ స్థాపక సామర్థ్యం 37.5 లక్షల టన్నులకు చేరుకుంటుందన్నారు. బీఎంఎం ప్లాంటువల్ల సాగర్ బ్రాండ్ సిమెంట్ కర్నాటక, కేరళ, సీమంధ్ర ప్రాంతాల మార్కెట్‌కు అందుబాటులో ఉంటుందన్నారు. సిమెంట్ మార్కెట్లో కన్సాలిడేషన్: దేశంలో దక్షినాదిన మొత్తం వ్యవస్థాపక సామర్థ్యం 125 మిలియన్ టన్నులు కాగా అందులో 50%(56మిలియన్ టన్నులు) మాత్రమే ఉత్పత్తి అవుతోందని ఆయన చెప్పారు. సిమెంట్ కంపెనీల వ్యవస్థాపక సామర్థ్యం పూర్తిగా వినియోగంలోకి రావాలంటే మరికొంత సమయం పట్టివచ్చన్నారు. పెరుగుతున్న వ్యయాలకు అనుగుణంగా సిమెంట్ ధరలు పెరగకపోవడంతో ఓ మోస్తరు కంపెనీలకు కూడా మార్కెట్లో నిలదొక్కుకోవడం సవాలుగా మారుతోందన్నారు. దీంతో ఈ రంగంలో మరిన్ని కొనుగోళ్లు, విలీనాలు జరిగే అవకాశం ఉన్నట్లు మార్కెట్ పోకడలు సూచిస్తున్నాయన్నారు. ఫార్మాలోకి వస్తున్నారా? సిమెంట్ రంగ దిగ్గజం సాగర్ సిమెంట్స్ ఫార్మా వ్యాపారంలోకి అడుగిడనుందా? హైదరాబాద్‌లో 30 వేల కోట్లతో రూపుదిద్దుకుంటున్న ఫార్మా సిటీలో యూనిట్ నెలకొల్పే యోచన చేస్తోందా? ఇటీవల ఫార్మా సిటీ స్థల ఎంపిక కోసం తెలంగాణ సీఎం కేసీఆర్ నిర్వహించిన ఏరియల్ సర్వేలో ఫార్మా సంస్థల దిగ్గజాలతో కలిసి సాగర్ సిమెంట్స్ జేఎండీ ఆనంద రెడ్డి పాల్గొనటం పారిశ్రామికవేత్తలను ఆశ్చర్యానికి గురిచేసింది. ఇదే విషయమై ఆయనతో ప్రస్తావించగా...‘‘మా ప్రధాన వ్యాపారం సిమెంట్. అదే మా కోర్ కాంపిటెన్సీ. ప్రస్తుతానికి ఆ ఆలోచన లేదు కాని, భవిష్యత్తులో పెట్టుబడికి ప్రతిఫలం అందించే పరిశ్రమల్లో ప్రవేశించాలన్నదే మా అభిలాష’’ అన్నారు. ప్రతిపాదిత ఫార్మా సిటీలో ఇన్వెస్ట్మెంట్ అవకాశాలు బాగా ఉన్నాయని చెప్పారు. వికాట్ సాగర్ సిమెంట్ జాయింట్ వెంచర్లో తన వాటా 47 శాతం ఫ్రెంచి సంస్థ వికాట్‌కు 2014లో రూ. 435 కోట్లకు సాగర్ విక్రయించింది. ఈ మొత్తాన్ని కొత్త వ్యాపారా అవకాశాల కోసం వినియోగించనున్నట్లు కంపెనీ ఇంతకుముందే ప్రకటించింది. ప్రస్తుతం సిమెంట్ పరిశ్రమ క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటుండటంతో అధికాదాయ మార్గాలపై సాగర్ సిమెంట్స్ దృష్టి పెడుతోన్న విషయం స్పష్టం అవుతోంది. -
సిమెంట్ పరిశ్రమలకు కఠిన నిబంధనలు!
కాలుష్య కారక పరిశ్రమల్లో సిమెంట్ రంగం ‘కంప’ నిధుల్లో 95 శాతం రాష్ట్రాలకే రెండు రాష్ట్రాలు ఐక్యంగా అభివృద్ధి సాధించాలి సాక్షి, హైదరాబాద్: వాతావరణ కాలుష్యానికి ప్రధాన కారణమవుతున్న 17 రకాల్లో ఒకటైన సిమెంట్ పరిశ్రమలకు కాలుష్య నిబంధనలను మరింత కఠినతరం చేయనున్నట్టు కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ చెప్పారు. పరిశుభ్రమైన పర్యావరణం కోసం నిబంధనలను మరింత ఆధునీకరించనున్నామన్నారు. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల అటవీ శాఖ కార్యక్రమాల సమీక్ష కోసం వచ్చిన మంత్రి గురువారమిక్కడ మీడియాతో మాట్లాడారు. ‘గ్రీన్ ఇండియా, క్లీన్ ఇండియా’ (పచ్చని, పరిశుభ్ర భారతం) తమ ప్రభుత్వ నినాదమని తెలిపారు. 280 మిలియన్ టన్నుల ఉత్పత్తితో ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉన్న సిమెంట్ పరిశ్రమలు వదిలే దుమ్ము,ధూళితో వాతావరణం బాగా కలుషితమవుతోందని ఆందోళన వ్యక్తంచేశారు. అందువల్ల అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలను అమలు పర్చాలని నిర్ణయించినట్టు తెలిపారు. ‘విధ్వంసం లేని అభివృద్ధి, మానవజాతి వికాసం’ తమ ఉద్దేశమని ప్రకటించారు. కంప నిధుల్లో 95 శాతం రాష్ట్రాలకే... పర్యావరణ అభివృద్ధిలో భాగంగా ప్రత్యామ్నాయ అడవుల పెంపకం నిధుల నిర్వహణ, ప్రణాళిక సంస్థ (కంప) నిధుల్లో 95 శాతాన్ని రాష్ట్రాలకే ఇవ్వాలని కేంద్రమంత్రివర్గం నిర్ణయించిందని, ఈ మేరకు నియమ నిబంధనలతో ముసాయిదాను రూపొందిం చామని జవదేకర్ తెలిపారు. అభివృద్ధి పథకాల కోసం వంద ఎకరాలలోపు అటవీ ప్రాంతాన్ని ఇచ్చే అధికారాన్ని ఇకపై ప్రాంతీయ సాధికారిక కమిటీలే చూస్తాయని చెప్పారు. మైనింగ్, ఆక్రమణల క్రమబద్ధీకరణ, జల విద్యుత్ ప్రాజెక్టులకు స్థలాలు ఇచ్చే విషయాన్ని మాత్రమే కేంద్ర పర్యావరణ శాఖ చూస్తుందని తెలిపారు. -
సిమెంటు రంగంలో ఈ ఏడాది 4% వృద్ధి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశీయ సిమెంటు పరిశ్రమ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 3.5 నుంచి 4 శాతం వృద్ధి చెందుతుందని నిపుణులు అంటున్నారు. గతేడాది సిమెంటు పరిశ్రమ 3 శాతం వృద్ధి నమోదు చేసింది. 2014-15లో నిర్మాణ రంగంలో కదలిక వస్తుందన్న సంకేతాలు ఉన్నాయని బిర్లా కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ జి.జయరామన్ అన్నారు. సీఐఐ, సిమెంట్ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం ప్రారంభమైన గ్రీన్ సిమెంటెక్ 2014 కార్యక్రమంలో సదస్సు చైర్మన్ హోదాలో ఆయన మాట్లాడారు. దేశంలో సిమెంటు ప్లాంట్ల స్థాపిత సామర్థ్యం మొత్తం 36 కోట్ల టన్నులు. ఉత్పత్తి మాత్రం 26 కోట్ల టన్నులకు పరిమితమైందని చెప్పారు. 2020 నాటికి స్థాపిత సామర్థ్యం 50 కోట్ల టన్నులకు చేరుతుందని పేర్కొన్నారు. చైనా తర్వాత అధికంగా సిమెంటును ఉత్పత్తి చేస్తున్న దేశం భారత్. ప్రస్తుతం ప్రపంచ ఉత్పత్తిలో భారత్ వాటా 7 శాతం. ఇక సరాసరి సిమెంటు వినియోగం 202 కిలోలుంది. ప్రపంచ సరాసరి 543 కిలోలు. ఉష్ణమూ ఉపయోగమే.. సిమెంటు ప్లాంట్లలో వెలువడే ఉష్ణం నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు (వేస్ట్ హీట్ రికవరీ సిస్టమ్) అపార అవకాశాలున్నాయి. దేశంలో ఎంత కాదన్నా 500-600 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయవచ్చని జయరామన్ అన్నారు. ఈ విధానంలో ఏర్పాటవుతున్న విద్యుత్ ప్లాంట్ల స్థాపిత సామర్థ్యం 2014లో 200 మెగావాట్లు దాటొచ్చని చెప్పారు. అయితే ఈ విధానం విస్తృతం అవ్వాలంటే పునరుత్పాదక ఇంధన హోదా ఇవ్వాలని సిమెంట్ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ సెక్రటరీ జనరల్ ఎన్.ఏ.విశ్వనాథ న్ డిమాండ్ చేశారు. ఇదే జరిగితే చిన్న సిమెంటు కంపెనీలకూ ఉపయుక్తంగా ఉంటుందని చెప్పారు. హోల్సిమ్, లఫార్జ్‌ల విలీన ప్రభావం సామాన్య వినియోగదారునిపై ఏమాత్రం ఉండబోదని పేర్కొన్నారు. ప్రత్యామ్నాయం అతిస్వల్పం.. ఇంధనం కోసం సిమెంటు కంపెనీలు పూర్తిగా బొగ్గుపైనే ఆధారపడ్డాయి. ప్రత్యామ్నాయ ఇంధనం కేవలం 1 శాతం లోపే ఉందని మధ్యప్రదేశ్ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్ ఎన్.పి.శుక్లా చెప్పారు. ప్రత్యామ్నాయ ఇంధన వినియోగం స్విట్జర్లాండ్‌లో 47 శాతం, జర్మనీలో 42 శాతం ఉందని వివరించారు. ప్లాస్టిక్ వ్యర్థాలు సద్వినియోగం చేసుకోవాలని, బొగ్గుతో పోలిస్తే మూడు రెట్లు ఉష్ణం అధికంగా విడుదల చేస్తాయని తెలిపారు. వ్యయం కూడా తగ్గుతుందన్నారు. మధ్యప్రదేశ్‌లోని సత్నలో ఓ సిమెంటు ప్లాంటు ప్లాస్టిక్ వ్యర్థాలతో 14 మెగావాట్ల విద్యుదుత్పత్తి చేస్తోందని వివరించారు. మధ్యప్రదేశ్‌లో ఒక స్వచ్ఛంద సంస్థ ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించి సిమెంటు ప్లాంట్లకు సరఫరా చేస్తోందని, రవాణా వ్యయాలను మున్సిపల్ కార్పొరేషన్ భరిస్తోందని చెప్పారు. -
ప్రస్తుతం నష్టాల్లో పరిశ్రమ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రాష్ట్రంలో సిమెంటు రంగం ఆరు నెలల్లో గాడిన పడుతుందని పరిశ్రమ భావిస్తోంది. కొత్త రాష్ట్రాల్లో సాధారణంగా మౌలిక వసతుల పరంగా అభివృద్ధి ఉంటుంది కాబట్టి సిమెంటుకు డిమాండ్ పెరుగుతుందని పరిశ్రమ వర్గాలు విశ్వసిస్తున్నాయి. ఇదే జరిగితే పరిశ్రమకు పెద్ద ఊరట లభిస్తుందని ప్రముఖ కంపెనీకి చెందిన అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. నాలుగేళ్లుగా ఆంధ్రప్రదేశ్‌లో నెలకొన్న అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో నిర్మాణ రంగం ఆశించిన స్థాయిలో అభివృద్ధి చెందలేదు. ప్రభుత్వ సంబంధిత నిర్మాణ పనులవల్ల సాధారణంగా ఎన్నికల ముందు సిమెంటకు డిమాండ్ పెరుగుతుంది. అయితే ఈ దఫా ఆ తరహా పనులేవీ జరగడం లేదు. దాంతో పరిశ్రమ ఇంకా నీరసంగానే నెట్టుకొస్తోంది. సిమెంటు కంపెనీలు పెద్ద ఎత్తున నష్టాలను మూటగట్టుకుంటున్నాయి. సిమెంటు వినియోగం పెరిగితేనే కంపెనీలు మనగలుగుతాయి. ఈ ఏడాది అక్టోబరు నుంచి నెలకు 20 లక్షల టన్నుల సిమెంటు అమ్ముడవుతుందని పరిశ్రమ అంచనా వేస్తోంది. బస్తాకు రూ.60 దాకా నష్టం..: రాష్ట్రంలో నాలుగేళ్ల క్రితం నెలకు 23-24 లక్షల టన్నుల సిమెంటు అమ్ముడైంది. ఇప్పుడది నెలకు 15-16 లక్షల టన్నులకు పడిపోయింది. రాజకీయ అనిశ్చితి, బలహీన సెంటిమెంటుతో అమ్మకాలు గణనీయంగా క్షీణించాయి. రాష్ట్రంలో బస్తా సిమెంటు ధర అటూఇటూగా రూ.220-250 పలుకుతోంది. ఉత్తరాదిన ఇది రూ.350 ఉంది. కంపెనీల మధ్య పోటీ కారణంగానే రాష్ట్రంలో ధర తక్కువగా ఉందని ఒక కంపెనీ ప్రతినిధి వెల్లడించారు. ఒక్కో బస్తాపైన రకాన్నిబట్టి కంపెనీలు రూ.20-60 దాకా నష్టపోతున్నాయని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో మూడు కంపెనీలు మూతపడ్డాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే మరిన్ని ప్లాంట్లు మూతపడక తప్పదని అన్నారు. అక్టోబరు నుంచి అమ్మకాలు పుంజుకుంటాయన్న సంకేతాలు ఉన్నాయి. బస్తా ధర రూ.300-320 ఉండాలని కంపెనీలు భావిస్తున్నాయి. అలా అయితేనే నష్టాల నుంచి గట్టెక్కుతామన్న ధీమాను వ్యక్తం చేస్తున్నాయి. ఖర్చులనుబట్టే ధర..: గిరాకీ-సరఫరాకుతోడు సెంటిమెంటు బాగోలేనప్పుడు సహజంగానే సిమెంటు ధరలు తక్కువగా ఉంటాయి. రాష్ట్రంలో ఇప్పుడున్న పరిస్థితి ఇలాంటిదే. రానున్న రోజుల్లో డిమాండ్ పెరిగినంత మాత్రాన ధరలు గణనీయంగా పెరుగుతాయని చెప్పలేమని ఒక కంపెనీ ప్రతినిధి వెల్లడించారు. కేంద్రంలో, రాష్ట్రంలో స్థిర ప్రభుత్వం వస్తేనే అభివృద్ధి ఉంటుంది. దీనికనుగుణంగానే సిమెంటు పరిశ్రమ వృద్ధి ఆధారపడుతుందన్నారు. బొగ్గు, డీజి ల్, విద్యుత్ చార్జీలపై కొత్త సర్కారు పన్నుల విధానం పరిశ్రమకు కీలకమని వెల్లడించారు. వీటి ధరలకుతోడు తయారీ వ్యయం ఆధారంగానే సిమెంటు ధర నిర్ణయమవుతుందని ఆయన చెప్పారు. కాగా, ఆంధ్రప్రదేశ్‌లోని సిమెంటు కంపెనీలన్నింటి వార్షిక స్థాపిత సామర్థ్యం సుమారు 70 మిలియన్(7 కోట్లు) టన్నులు. ఉత్పత్తి 45-50 మిలియన్ టన్నులకు పరిమితమైంది. ఇందులో రాష్ట్ర అవసరాలకుపోను మిగిలినది తమిళనాడు, కర్నాటక, ఒరిస్సాలకు తరలివెళ్తోంది. ప్రోత్సాహమిస్తే మరిన్ని.. రాష్ట్ర కంపెనీలు ఇటీవలి కాలం నుంచి శ్రీలంక, బంగ్లాదేశ్‌కు నెలకు సుమారు లక్ష టన్నుల సిమెంటు, క్లింకర్‌ను ఎగుమతి చేస్తున్నాయి. పోర్టు చార్జీల తగ్గింపు, పన్నుల మినహాయింపు వంటి ప్రోత్సాహకాలిస్తే ఎగుమతులు మరింత పెంచేందుకు పరిశ్రమ సిద్ధంగా ఉంది. కొత్త ప్రభుత్వం గనక చార్జీలు పెంచితే తయారీ వ్యయంతోపాటు సిమెంటు ధరలకూ రెక్కలొస్తాయి. తద్వారా ఎగుమతులు తగ్గుతాయనేది పరిశ్రమ ఆందోళన. -
ప్రేమజంట బలవన్మరణం
మేళ్లచెర్వు, మండలంలోని కీర్తి సిమెంట్ పరిశ్రమ పరిధిలో ఉరి వేసుకొని ఓ ప్రేమజంట బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది. ఎస్ఐ సుమన్ తెలిపిన వివరాల ప్రకారం.. మేళ్లచెర్వుకు చెందిన చిన్నపంగు శౌరి కూతురు మౌనిక (18) రెండేళ్లుగా కీర్తి పరిశ్రమ గేటు ఎదురుగా డబ్బాకొట్టు నిర్వహిస్తున్నది. మునగాల మండలం తాడ్వాయి గ్రామానికి చెందిన గుణకుంట వీరస్వామి (30) కీర్తి పరిశ్రమలో లోడింగ్ పనులు చేసుకుంటూ జీవిస్తున్నాడు. వీరస్వామికి పెళ్లయింది. భార్య, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. కాగా, మౌనిక, వీరస్వామి కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఆదివారం రాత్రి వీరి ఇరువురి కలిసి సిమెంట్ పరిశ్రమ పక్కన గల వేపచెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. సోమవారం ఉదయం పరిశ్రమలో డ్యూటీ దిగి అటుగా వెళ్తున్న కొంతమంది కార్మికులు చూసి పోలీసులకు తెలియజేశారు. పోలీసులు సంఘటనస్థలాన్ని పరిశీలించారు. మృతదేహాలను కిందికి దించి చూడగా వీరస్వామి షర్ట్ జేబులో సూసైడ్ నోట్ దొరికింది. అందులో మా చావుకి ఎవరూ కారకులు కారని తమ వాళ్లను ఎటువంటి ఇబ్బందులకూ గురిచేయవద్దని, ఇద్దరికీ ఒకేచోట దహనసంస్కారాలు చేయాలని రాసి ఉంది. విషయం తెలుకున్న గ్రామస్తులు పెద్దసంఖ్యలో సంఘటనస్థలానికి చేరుకున్నారు. పోలీసులు మృతదేహాలను పోసుమార్టం నిమిత్తం కోదాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతిరాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్టు ఎస్ఐ తెలిపారు. అయ్యో..పాపం వీరస్వామి మృతదేహం వద్ద అతని భార్య, పిల్లలు ఏడుస్తున్న తీరు గ్రామస్తులను కలిచివేసింది. మృతుడికి నాలుగేళ్ల, నాలుగు నెలల వయస్సుగల ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. తల్లి ఎందుకు ఏడుస్తుందో తెలియక ఆ పిల్లలు ఆమెవైపు దీనంగా చూస్తుండడంతో స్థానికులు అయ్యో.. పాపం అంటూ కంటతడి పెట్టుకున్నారు.