రామ్‌కో సిమెంట్‌ భారీ విస్తరణ | Ramco Cement launches Supercrete Cement in AP and Telangana | Sakshi
Sakshi News home page

రామ్‌కో సిమెంట్‌ భారీ విస్తరణ

Aug 30 2019 6:04 AM | Updated on Aug 30 2019 6:04 AM

Ramco Cement launches Supercrete Cement in AP and Telangana - Sakshi

మీడియా సమావేశంలోరామకృష్ణన్, బాలాజీ కె మూర్తి (కుడి)

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: సిమెంటు తయారీ సంస్థ రామ్‌కో సిమెంట్స్‌ భారీ విస్తరణ చేపట్టింది. ఇందుకోసం రూ.4,000 కోట్లు వ్యయం చేస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాలో 3.15 మిలియన్‌ టన్నుల సామర్థ్యంతో సిమెంటు ఉత్పత్తి కేంద్రాన్ని రూ.1,500 కోట్లతో నెలకొల్పుతోంది. ప్లాంటు ద్వారా ప్రత్యక్షంగా 300 మందికి, పరోక్షంగా 1,000 మందికి ఉపాధి లభిస్తుందని రామ్‌కో మార్కెటింగ్‌ ఈడీ బాలాజీ కె మూర్తి గురువారం వెల్లడించారు. సూపర్‌క్రీట్‌ సిమెంట్‌ను ఇక్కడి మార్కెట్లో విడుదల చేసిన సందర్భంగా మార్కెటింగ్‌ ప్రెసిడెంట్‌ ఆర్‌.రామకృష్ణన్‌తో కలిసి మీడియాతో మాట్లాడారు. కృష్ణా జిల్లాలో 1.5 మిలియన్‌ టన్నుల క్లింకర్‌ యూనిట్, విశాఖపట్నం జిల్లాలో 1 మిలియన్‌ టన్నుల గ్రైండింగ్‌ కేంద్రం ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. ఒడిశాలోని సిమెంటు తయారీ ప్లాంటులో 1.5 మిలియన్‌ టన్నులు, కోల్‌కతాలో 1 మిలియన్‌ టన్నుల సామర్థ్యం జోడిస్తున్నట్టు పేర్కొన్నారు.  

వచ్చే ఏడాది చివరికల్లా..
కంపెనీ చేపట్టిన అన్ని ప్రాజెక్టులు 2020 డిసెంబరుకల్లా పూర్తి కానున్నాయి. కర్నూలు ప్లాంటు రాకతో ఆంధ్రప్రదేశ్‌లో రామ్‌కో సిమెంటు ఉత్పత్తి సామర్థ్యం 10 మిలియన్‌ టన్నులు నమోదు కానుంది. తద్వారా ఏపీలో అత్యధిక ఉత్పత్తి సామర్థ్యమున్న సంస్థగా నిలుస్తుంది. అన్ని తయారీ కేంద్రాలు కలిపి ప్రస్తుతం సంస్థ వార్షిక సిమెంటు ఉత్పత్తి సామర్థ్యం 12.5 మిలియన్‌ టన్నులు ఉంది. విస్తరణ పూర్తి అయితే ఇది 20 మిలియన్‌ టన్నులకు చేరుతుందని బాలాజీ వెల్లడించారు. 2018–19లో కంపెనీ టర్నోవరు రూ.5,146 కోట్లు. 2020–21లో ఇది రూ.7,500 కోట్లను తాకుతుందని ఆయన పేర్కొన్నారు.  

సుస్థిర ప్రభుత్వం ఉంటే..
‘ఆంధ్రప్రదేశ్‌లో పలు ప్రాజెక్టులు నిలిచిపోయాయి. మీరేమో విస్తరణ చేపడుతున్నారు. ఫలితం ఎలా ఉండబోతోంది’ అని మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు.. ‘ఏ రాష్ట్రంలోనైనా ఒడిదుడుకులు తాత్కాలికం. మళ్లీ మార్కెట్‌ పుంజుకుంటుందన్న నమ్మకం మాకుంది. సుస్థిర ప్రభుత్వం ఉన్నప్పుడు సిమెంటుకు డిమాండ్‌ ఉంటుంది. మా పెట్టుబడులు కొనసాగిస్తాం’ అని బాలాజీ   స్పష్టం చేశారు. మందగమన ప్రభావం సిమెంటు రంగంపై ఉందా అన్న మరో ప్రశ్నకు వ్యక్తిగత గృహాల నిర్మాణాలు అన్ని ప్రాంతాల్లోనూ కొనసాగుతున్నాయని వివరించారు. ప్రభుత్వ గృహ నిర్మాణ ప్రాజెక్టులు సాగుతున్నాయని చెప్పారు. సిమెంటు వినియోగం దేశంలో ఏప్రిల్‌–జూన్‌ కాలంలో 7–8 శాతం వృద్ధి నమోదైందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement