ramco industries
-
రామ్‌కో సిమెంట్స్‌కు సీఐఐ డీఎక్స్ అవార్డు
హైదరాబాద్: రామ్‌కో సిమెంట్స్ ఢిల్లీలో జరిగిన 6వ విడత సీఐఐ డీఎక్స్ (డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్) అవార్డుల కార్యక్రమంలో ఆపరేషనల్ ఎక్సలెన్స్ పురస్కారాన్ని దక్కించుకుంది. అత్యంత వినూత్న టాప్ 10 ప్రాజెక్టుల జాబితాలో ‘రామ్‌కో బిజినెస్ ఇంటెలిజెన్స్’ ప్రాజెక్టు ఒకటిగా నిల్చింది. ఆపరేషనల్ ఎక్సలెన్స్ కేటగిరీలో పురస్కారం దక్కించుకున్న ట్లు సీఈవో ఏవీ ధర్మకృష్ణన్ తెలిపారు.అవార్డును కంపెనీ వైస్ ప్రెసిడెంట్ జి. మురుగేశన్, డిప్యుటీ జీఎంలు పీఎల్ సత్యనారాయణ, అబ్దుల్ బాసిత్ అందుకున్నారు. సీఐఐ–టాటా కమ్యూనికేషన్స్ సెంటర్ ఫర్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ నిర్వహించిన కార్యక్రమంలో ఈ ఏడాది 300 పైగా కంపెనీలు ప్రతిష్టాత్మక పురస్కారాల కోసం పోటీపడ్డాయి. -
రామ్‌కో సిమెంట్స్‌కు సీఎస్‌ఆర్‌బాక్స్ ఇంపాక్ట్ అవార్డులు
హైదరాబాద్: రామ్‌కో సిమెంట్స్ కంపెనీ కార్పొరేట్ సామాజిక బాధ్యత(సీఎస్ఆర్) కింద రెండు విభాగాల్లో సీఎస్‌ఆర్‌బాక్స్ ఇంపాక్ట్ అవార్డులు దక్కించుకుంది. అరియలూర్ ప్లాంట్‌కు వాటర్ శానిటైషన్ అండ్ హైజీన్(వాష్) అవార్డు, ఆర్ఆర్ నగర్ ప్లాంట్‌కు ఎంప్లాయి వాలంటీరింగ్ ఇనీషియేటివ్ అవార్డులు లభించాయి. సీఎస్ఆర్ కార్యక్రమాల ద్వారా సమాజంలో మెరుగైన ఫలితాలను సాధించే కంపెనీలను సీఎస్‌ఆర్‌బాక్స్ ఈ అవార్డుల ద్వారా ప్రోత్సహిస్తుంటుంది. సీఎస్ఆర్ను నిర్భంధంగా కాకుండా ఓ బాధ్యతగా రామ్‌కో సిమెంట్స్ భావిస్తుందని సీఈవో ఏవీ ధర్మకృష్ణన్ తెలిపారు. గత 60 ఏళ్లుగా కంపెనీ స్థాపించిన నాటి నుంచి సీఎస్ఆర్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. -
దినేశ్‌కు మూడు కాంస్యాలు
సాక్షి, హైదరాబాద్: ఉగాండా పారా బ్యాడ్మింటన్ అంతర్జాతీయ టోర్నీలో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన రామ్‌కో సిమెంట్స్ ఉద్యోగి దినేశ్ రాజయ్య రాణించి మూడు కాంస్య పతకాలు సాధించాడు. దినేశ్ ఎస్ఎల్–3 సింగిల్స్‌లో, ఎస్ఎల్3–ఎస్ఎల్4 డబుల్స్‌లో, ఎస్ఎల్3–ఎస్యు5 మిక్స్డ్ డబుల్స్ విభాగాల్లో మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాలు సొంతం చేసుకున్నాడు. ఈ టోర్నీ సందర్భంగా దినేశ్‌ను ఉగాండాలో భారత హైకమిషనర్‌గా ఉన్న ఎ.అజయ్ కుమార్ సన్మానించి అభినందించారు. మొత్తం 20 దేశాల నుంచి వివిధ కేటగిరీల్లో కలిపి 191 మంది క్రీడాకారులు ఈ టోర్నీలో పాల్గొన్నారు. భారత్‌కు 12 స్వర్ణాలు, 14 రజతాలు, 16 కాంస్యాలతో కలిపి మొత్తం 42 పతకాలు లభించాయి. -
పరిశ్రమలకు బెస్ట్.. ఏపీ
విస్తృతంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ‘గ్రీన్ ఎనర్జీ’పై ప్రత్యేకంగా దృష్టి పెట్టాం. రాయలసీమ ప్రాంతం ఇందుకు అనుకూలంగా ఉంది. ప్రస్తుతం రూ.72,188 కోట్ల పెట్టుబడులతో ఈ పరిశ్రమలకు అనుమతులు ఇచ్చాం. ఇప్పుడు ఇంకో అడుగు ముందుకు వేస్తూ రైతులు గ్రూపుగా ముందుకొస్తే వారి పొలాల్లో విండ్, సోలార్ యూనిట్లు ఏర్పాటు చేసే దిశగా ప్రణాళికలు రూపొందిస్తున్నాం. ఏటా ఎకరానికి రూ.30 వేల చొప్పున ప్రభుత్వం లీజు చెల్లిస్తుంది. తద్వారా రైతులకు నికర ఆదాయంతో పాటు వారి పిల్లలకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి. – సీఎం వైఎస్ జగన్ సాక్షి ప్రతినిధి, కర్నూలు: పారిశ్రామిక అభివృద్ధి, తద్వారా ఉద్యోగ అవకాశాల కల్పనపై ప్రభుత్వం నిర్దిష్ట ప్రణాళికతో ముందుకెళుతోందని, పరిశ్రమల ఏర్పాటుకు రాష్ట్రం అన్ని విధాలా అనుకూలమని సీఎం వైఎస్ జగన్ స్పష్టం చేశారు. ఇందులో భాగంగా ప్రతి అంశంలో ‘ఇండస్ట్రీ ఫ్రెండ్లీ’గా అడుగులు వేస్తూ.. గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టుల ఏర్పాటుకు సహకరిస్తోందన్నారు. నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలం కల్వటాలలో ఏర్పాటైన ‘రామ్‌కో సిమెంట్స్’ కర్మాగారాన్ని బుధవారం ఆయన ప్రజల సమక్షంలో బజర్ నొక్కి ప్రారంభించారు. అంతకు ముందు ఫ్యాక్టరీలోని పరికరాలు, టెక్నాలజీ, ఉత్పత్తి తదితర అంశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రామ్‌కో ఇండస్ట్రీ వల్ల మన ప్రాంతానికి, మనకు మంచి జరుగుతుందన్నారు. మన పిల్లలు ఎక్కడికో వెళ్లాల్సిన పరిస్థితి లేకుండా ఇక్కడే ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని చెప్పారు. ఈ ప్రాంతంలో లైమ్ స్టోన్ మైన్స్ ఉన్నప్పటికీ గతంలో ఎలాంటి పరిశ్రమలు లేవని.. ప్రస్తుతం ఇక్కడ 2 మిలియన్ టన్నుల క్లింకర్, 1.5 మిలియన్ టన్నుల గ్రైండింగ్ సామర్థ్యంతో ప్లాంట్ ఏర్పాటైందన్నారు. తద్వారా 3 మిలియన్ టన్నుల సిమెంట్ ఉత్పత్తి అవుతుందని, ఇది తొలి దశ మాత్రమేనని.. రాబోయే రోజుల్లో యాజమాన్యం దీన్ని విస్తరిస్తుందని అన్నారు. తద్వారా ఈ ప్రాంతంలో మెరుగైన వసతులు వస్తాయని, సీఎస్ఆర్ (కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్‌బులిటీ – సామాజిక బాధ్యత) వల్ల చుట్టుపక్కల గ్రామాలకు మంచి జరుగుతుందని తెలిపారు. 75 శాతం స్థానికులకే ఉద్యోగ అవకాశాలు ఉండాలని చట్టం చేయడం వల్ల మన పిల్లలకు మంచే జరుగుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. తొలిదశలో వెయ్యి మందికి ఉద్యోగాలు ► మన ప్రాంతంలో రామ్‌కో సిమెంట్‌ను స్థాపించిన వెంకట్రామరాజా అన్నకు మనస్ఫూర్తిగా అభినందనలు. రూ.2,500 కోట్ల పెట్టుబడితో స్థాపించిన ఈ ప్లాంటులో తొలి దశలో వెయ్యి మందికి ఉద్యోగ అవకాశాలు రానున్నాయి. 2019లో మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్ది నెలల్లోనే ఈ ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభమైంది. పనులు వేగంగా పూర్తి చేసింది. ► గొప్ప మార్పునకు ఈ ఫ్యాక్టరీ నిదర్శనం. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌కు దీనికంటే మరొక ఉదాహరణ అవసరం లేదు. ఎమ్మెల్యే, కలెక్టర్ నుంచి నా వరకు అందరి సహకారంతో ఎలాంటి జాప్యం జరగకుండా 30 నెలల్లో ప్రాజెక్టు పూర్తి చేశారు. ► 1961లో రామ్‌కో సిమెంట్స్ ప్రస్థానం మొదలైంది. రోజుకు 200 టన్నులు అంటే ఏటా 0.4 మిలియన్ టన్నుల సామర్థ్యంతో మొదలు పెట్టిన ప్లాంటు ఈ రోజు 20 మిలియన్ టన్నుల సామర్థ్యం దాకా అడుగులు వేసింది. ప్రతిచోటా వీరి యూనిట్లు బాగా పని చేస్తున్నాయి. 5 చోట్ల ఉత్పత్తి యూనిట్లు.. మరికొన్ని చోట్ల గ్రైండింగ్ యూనిట్లు.. మొత్తం 11 యూనిట్లు ఉన్నాయి. అన్నిచోట్ల సామర్థ్యాన్ని పెంచుతూ పోతున్నారు. ఇక్కడ ప్రారంభమైన ప్లాంట్‌కు ఇకపై కూడా మనందరి సహకారం అందిస్తే త్వరితగతిన మరింత అభివృద్ధి, విస్తరణకు దోహద పడుతుంది. ► కొద్ది రోజుల కిందట గ్రీన్కో 5,400 మెగావాట్ల సామర్థ్యంతో సౌర, పవన విద్యుత్ ఉత్పత్తి, పంప్డ్ స్టోరేజ్‌తో చేపట్టిన రెన్యువబుల్ ఎనర్జీ ప్లాంటుకు పునాది రాయి వేశాను. ఈ ప్రాజెక్టు వల్ల కర్నూలు జిల్లాలో 2,600 ఉద్యోగాలు వస్తాయి. మన పిల్లలకు మేలు జరుగుతుంది. ప్రభుత్వ సహకారం బావుందని వాళ్లే చెబుతున్నారు.. ► ప్రతి అంశంలో ‘ఇండస్ట్రీ ఫ్రెండ్లీ’గా రాష్ట్రం అడుగులు వేస్తోంది. ఇది చాలా కీలకం. ఈ మధ్య కాలంలో ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’లో రాష్ట్రం వరుసగా మూడో ఏడాది కూడా దేశంలో మొదటి స్థానంలో నిలిచింది. పరిశ్రమల నిర్వాహకులతో ఇక్కడి పరిస్థితులపై అభిప్రాయాలు తీసుకుని మార్కులు వేస్తున్నారు. ప్రత్యేకంగా ఎంఎస్ఎంఈలకు ఇస్తున్న సహాయం, ప్రోత్సాహకాలు కలిపి పరిశ్రమలకు రాష్ట్రం బాగా సహకరిస్తోందని పారిశ్రామికవేత్తలు చెబుతున్నారు. ► మన రాష్ట్రం, ప్రభుత్వం ఇస్తున్న మద్దతు గురించి, చేయి పట్టుకుని నడిపిస్తున్న తీరు గురించి పారిశ్రామికవేత్తలు సంతృప్తిగా ఉన్నారు. కాబట్టి మనకు మొదటి స్థానం వచ్చింది. ఇది సువర్ణాక్షరాలతో లిఖించదగింది. 2021–22లో దేశంలో అత్యధిక గ్రోత్‌రేట్ 11.43 శాతంతో మనం మొదటి స్థానంలో ఉన్నాం. ఇది గొప్ప మార్పునకు అవకాశం. రాష్ట్రంలో పారిశ్రామిక రంగానికి మనమంతా మద్దతు ఇస్తున్నాం కాబట్టే ఇంతగా మంచి జరుగుతోంది. రూ.1000 కోట్లతో గ్రాసిమ్ ఇండస్ట్రీ ► రాష్ట్రంలో ఇటీవలే రూ.1000 కోట్లతో గ్రాసిమ్ ఇండస్ట్రీని ప్రారంభించాం. దీనిని కుమార మంగళం బిర్లా ఏర్పాటు చేశారు. 1,150 ఉద్యోగాలు వచ్చాయి. అలాగే 10 వేల మందికి ఉద్యోగ అవకాశాలు ఇచ్చే అపాచీ ఫ్యాక్టరీని రూ.700 కోట్లతో చిత్తూరు, పులివెందులలో చేపట్టాం. ► దాదాపు రూ.1,700 కోట్ల పెట్టుబడితో టీసీఎల్ ప్యానల్ ఉత్పత్తి చేపడుతోంది. 3,100 మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. విశాఖలో ఏటీసీ టైర్స్ దాదాపు రూ.2,200 కోట్ల పెట్టబడితో ఏర్పాటు చేస్తున్నారు. దాదాపు 2 వేల మందికి ఉపాధి అవకాశాలు వస్తాయి. రామాయపట్నం పోర్టుకు పునాది రాయి వేశాం. ప్రతి 50 కిలోమీటర్లకు ఒక హార్బర్ లేదా పోర్టు ► ఇప్పటిదాకా రాష్ట్రంలో నాలుగు ప్రాంతాల్లో ఆరు పోర్టులు ఉన్నాయి. ఈ మూడేళ్లలో మరో నాలుగు పోర్టులు (రామాయపట్నం, మచిలీపట్నం, కాకినాడ, భావనపాడు) నిర్మించేందుకు వేగంగా అడుగులు వేస్తున్నాం. తొమ్మిది ఫిషింగ్ హార్బర్లు తీసుకొస్తున్నాం. ప్రతి 50 కిలోమీటర్లకు ఒక హార్బర్, పోర్టు ఉండేలా.. తద్వారా ఎగుమతులు పెంచేలా ప్రణాళికలు రచిస్తున్నాం. ► 2021–22లో రాష్ట్రం నుంచి రూ.1.70 లక్షల కోట్ల ఎగుమతులు ఉన్నాయి. దీన్ని రాబోయే ఐదేళ్లలో రూ. 3.40 లక్షల కోట్లకు పెంచేలా లక్ష్యంగా నిర్దేశించుకుని అడుగులు వేగంగా వేస్తున్నాం. దేశంలో ఎక్కడా జరగని విధంగా మూడు పారిశ్రామిక కారిడార్లు.. వైజాగ్–చెన్నై, చెన్నై–బెంగళూరు, హైదరాబాద్– బెంగళూరును అభివృద్ధి చేస్తున్నాం. ► వైఎస్సార్ జిల్లా కొప్పర్తిలో మెగా ఇండస్ట్రియల్ పార్క్, ఎలక్ట్రానిక్ మాన్యుఫాక్చరింగ్ యూనిట్, తిరుపతిలో మరో ఎలక్ట్రానిక్ మాన్యుఫాక్చరింగ్ యూనిట్ ప్రారంభిస్తున్నాం. ఇవన్నీ పూర్తయితే మన పిల్లలకు ఉద్యోగావకాశాలు విస్తృతమయ్యే పరిస్థితి వస్తుంది. మరిన్ని పరిశ్రమలు మన రాష్ట్రం వైపే చూసే పరిస్థితి వస్తుందని ఆశిస్తున్నా. పారిశ్రామికవేత్తలకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా అందుబాటులో ఉంటాం. పూర్తి సహకారం అందిస్తాం. ► ఈ కార్యక్రమంలో మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, గుడివాడ అమర్నాథ్, అంజాద్ బాషా, ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్సీలు గుంగుల ప్రభాకర్‌రెడ్డి, చల్లా భగీరథరెడ్డి, ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి, కలెక్టర్ మనజీర్ జిలానీ శామూన్ పాల్గొన్నారు. భూమికి లీజు.. పిల్లలకు ఉద్యోగాలు గ్రీన్ డోసాల్, ఆర్సిలర్ మిట్టల్, అరవిందో, అదానీ వాళ్లకు రూ.72,188 కోట్ల విలువైన ప్రాజెక్టులకు అనుమతులు ఇచ్చాం. 3–4 ఏళ్లలో ఆ ప్రాజెక్టులు పూర్తయితే 20 వేల ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయి. వీటికి తోడు.. రైతులు ముందుకొస్తే ఎకరాకు ఏడాదికి రూ.30 వేల చొప్పున లీజు ఇచ్చేలా ప్రభుత్వం ఒప్పందం చేసుకుంటుంది. 30.. 50.. ఎన్ని ఏళ్లయినా ఏటా లీజు డబ్బులు ఇస్తాం. మూడేళ్లకోసారి 5 శాతం లీజు పెంచుతాం. ఈ మేరకు అగ్రిమెంట్లు చేసుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఎమ్మెల్యేలు చొరవ తీసుకుని ఒక ప్రాంతంలో కనీసం 1,500 నుంచి 2 వేల ఎకరాలు ఒక క్లస్టర్‌గా అందుబాటులో ఉండేలా చూస్తే.. రైతులు, గ్రామాలు ముందుకొస్తే ఆ భూముల్లో సోలార్, విండ్ పవర్ ప్రాజెక్టులు చేపడతాం. తద్వారా రైతులకు మేలు జరగడంతో పాటు వారి పిల్లలకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. మరింత అభివృద్ధి చేస్తాం ఇక్కడ సిమెంట్ పరిశ్రమ ఏర్పాటుకు కలెక్టర్ నుంచి ముఖ్యమంత్రి వరకు పూర్తిగా సహకరించారు. వేగంగా పనులు పూర్తి చేసి ఉత్పత్తి ప్రారంభిస్తున్నాం. ఈ సందర్భంగా అందరికీ కృతజ్ఞతలు. ప్రభుత్వ సహకారంతో ప్లాంటును మరింత అభివృద్ధి చేస్తాం. ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పనలో మా వంతుగా సహకారం అందిస్తాం. – వెంకట్రామ రాజా, రామ్‌కో ఎండీ ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీస్.. పారిశ్రామికంగా రాష్ట్రం మంచి పురోగతి సాధిస్తోంది. రానున్న రోజుల్లో మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తాం. రాష్ట్రంలో పరిశ్రమలు ఎలాంటి వాతావరణంలో నడుస్తున్నాయో చెప్పేందుకు ‘ఈజ్ ఆఫ్ డూయింగ్’లో మనం ప్రథమ స్థానంలో ఉండటమే నిదర్శనం. ఏపీ ‘ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీస్’ రాష్ట్రంగా ఉంది. సముద్రతీరం, జాతీయ రహదారులు, పోర్టుల కనెక్టివిటీ లాంటి అంశాలు పరిశ్రమల రాక, అభివృద్ధికి దోహదపడుతున్నాయి. వీటన్నిటికీ తోడు గొప్ప ముఖ్యమంత్రి అండగా ఉండటం మన అదృష్టం. అనకాపల్లి నియోజకవర్గంలో కూడా రామ్‌కో ప్లాంటు ఉంది. ఇక్కడ మూడో ప్లాంట్ ప్రారంభోత్సవానికి రావడం పట్ల ఆనందంగా ఉంది. – గుడివాడ అమర్నాథ్, రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి -
నంద్యాల జిల్లా : రామ్‌కో సిమెంట్ ఫ్యాక్టరీని ప్రారంభించిన సీఎం జగన్ (ఫొటోలు)
-
రాంకో పరిశ్రమతో 1000 మందికి ఉద్యోగాలు వస్తాయి
-
రాంకో సిమెంట్ కంపెనీని ప్రారంభించిన సీఎం వైఎస్ జగన్
-
రామ్‌కో సిమెంట్ ఫ్యాక్టరీని ప్రారంభించిన సీఎం జగన్
Live Updates: పారిశ్రామిక వృద్ధికి ప్రభుత్వం చేయూత: సీఎం జగన్ పారిశ్రామిక వృద్ధికి ప్రభుత్వం చేయూతనిస్తోందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. ఒక ఇండస్ట్రీ రావడం వల్ల ఎంతో మంచి జరుగుతుందన్నారు. స్థానికులకు ఉద్యోగావకాశాలు పెరిగాయన్నారు. రామ్‌కో పరిశ్రమతో 1000 మందికి ఉద్యోగాలు వస్తాయని, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌కు ఏపీనే ఉదాహరణ అని సీఎం అన్నారు. పారిశ్రామిక అభివృద్ధితో ముందుకు.. మంత్రి అమర్నాథ్ ►రాష్ట్రాన్ని పారిశ్రామిక అభివృద్ధితో ముందుకు తీసుకెళుతున్నామని పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. పరిశ్రమలకు ఎంతో పోత్సాహం ఇస్తున్నామన్నారు. సీఎం జగన్ తీసుకున్న చర్యలతోనే పెట్టుబడులు వస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. ►నంద్యాల జిల్లాలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటించారు. కొలిమిగుండ్లలో రామ్‌కో సిమెంట్ ఫ్యాక్టరీని సీఎం ప్రారంభించారు. కొలిమిగుండ్ల(నంద్యాల జిల్లా): జిల్లా పారిశ్రామిక పథంలో పయనిస్తోంది. ప్రభుత్వం అందిస్తున్న సహకారంతో పలు కంపెనీలు పరిశ్రమలు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయి. ఇప్పటికే జిల్లాలో జయజ్యోతి, జేఎస్‌డబ్ల్యూ సిమెంట్ ఫ్యాక్టరీలు ఉండగా తాజాగా కల్వటాల వద్ద రూ.1,790 కోట్లతో రామ్‌కో కంపెనీ సిమెంట్ పరిశ్రమను నెలకొల్పింది. ఏటా 2 మిలియన్ టన్నుల సిమెంట్ ను ఉత్పత్తి చేసే ఈ పరిశ్రమ.. సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి చేతుల మీదుగా ప్రారంభమైంది. జిల్లాలో ఎక్కడా లేని విధంగా సిమెంట్ పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన ముడి ఖనిజపు నిల్వలు కొలిమిగుండ్ల మండలంలో అపారంగా ఉన్నాయి. రవాణా సౌకర్యం, నీటి వనరులు కూడా ఇక్కడ పుష్కలంగా ఉన్నాయి. దీనికితోడు వెనుకబడిన ఈ ప్రాంతాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు. దీంతో పరిశ్రమలు నెలకొల్పేందుకు పారిశ్రామికవేత్తలు ఆసక్తి చూపుతున్నారు. సిద్ధమైన రామ్‌కో సిమెంట్ ఫ్యాక్టరీ కొలిమిగుండ్ల మండలం కల్వటాల గ్రామ సమీపంలో అత్యాధునిక టెక్నాలజీతో రామ్‌కో సిమెంట్ పరిశ్రమను నిర్మించారు. ఈ ఫ్యాక్టరీ ఏర్పాటుకు కొలిమిగుండ్ల, నాయినపల్లె, కల్వటాల, ఇటిక్యాల, చింతలాయిపల్లె, కనకాద్రిపల్లె గ్రామాల రైతుల నుంచి దశల వారీగా 5 వేల ఎకరాల భూమిని సేకరించారు. 2018 డిసెంబర్ 14లో పరిశ్రమ నిర్మాణానికి భూమి పూజ చేయగా నాటి తెలుగుదేశం ప్రభుత్వం విధానాలతో పనుల్లో తీవ్ర జాప్యం జరిగింది. 2019లో అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పారిశ్రామిక ప్రగతే లక్ష్యంగా అడుగులు వేయడంతో రామ్‌కో సిమెంట్ పరిశ్రమకు అవసరమైన అన్ని రకాల అనుమతులు చకచకా లభించాయి. తర్వాత నిర్మాణ పనులు సాగుతున్న సమయంలో కరోనా ఎఫెక్ట్‌తో పనులకు కొంత కాలం బ్రేక్ పడినా ఆ తర్వాత యుద్ధప్రాతిపదికన చేపట్టి నిర్మాణం పూర్తి చేశారు. ఇందుకు ప్రభుత్వం సైతం పూర్తి సహకారం అందించింది. పరిశ్రమకు ప్రధానంగా నీటి వనరులు అవసరం. ఎక్కువ లోతులో బోర్లు వేసి భారీ మోటార్ల సాయంతో నీటిని పంపింగ్ చేస్తే సమీప గ్రామాల్లో సాగు, తాగునీటికి ఇబ్బంది ఎదురవుతుందనే ఉద్దేశంతో అవుకు రిజర్వాయర్ నుంచి 0.5 టీఎంసీల నీళ్లను పైపులైన్ ద్వారా ఉపయోగించుకునేందుకు ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. 2 మిలియన్ టన్నుల సిమెంట్ ఉత్పత్తి భారీ బడ్జెట్‌తో ఏర్పాటు చేసిన రామ్‌కో పరిశ్రమలో ఏడాదికి 2.0 మిలియన్ టన్నుల సిమెంట్ ఉత్పత్తి చేయనున్నారు. 30 మెగా వాట్ల థర్మల్ ప్లాంట్‌ను కంపెనీ సొంతంగా ఏర్పాటు చేసుకుంది. భూములు ఇచ్చిన రైతు కుటుంబాలకు ఉద్యోగాలిచ్చింది. త్వరలోనే మరో 1,050 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించనుంది. ఈ పరిశ్రమ ద్వారా పరోక్షంగా మరి కొంత మందికి ఉపాధి లభించనుంది. ఇప్పటికే ఫ్యాక్టరీ ఏర్పాటుతో కొలిమిగుండ్లలో ఇళ్ల స్థలా లతో పాటు భూముల ధరలకు రెక్కలొచ్చాయి. సీఎస్ఆర్ కింద అభివృద్ధి పనులు కంపెనీ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) కింద పరిశ్రమల పరిధిలోని వివిధ గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపడుతోంది. 2019 నుంచి 2022 వరకు సీఎస్ఆర్ కింద రూ.8.5 కోట్లు ఖర్చు చేసినట్లు కంపెనీ ప్రతినిధులు తెలిపారు. -
28న కొలిమిగుండ్లలో పర్యటించనున్న సీఎం జగన్
సాక్షి, కొలిమిగుండ్ల (నంద్యాల జిల్లా): కల్వటాల సమీపంలోని రామ్‌కో సిమెంట్ ఫ్యాక్టరీ నిర్మాణ పనులు పూర్తికావడంతో ఈ నెల 28న ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేతుల మీదుగా ఫ్యాక్టరీని ప్రారంభించనున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో పోలీస్ అధికారులు భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఫ్యాక్టరీ ఆవరణలో హెలిప్యాడ్‌ను కంపెనీ ప్రతినిధులు సిద్ధం చేస్తున్నారు. అక్కడి నుంచి సీఎం నేరుగా ఫ్యాక్టరీలోకి చేరుకొని స్విచ్ ఆన్‌చేసి పరిశ్రమను ప్రారంభిస్తారు. సీఎం వైఎస్ జగన్ కొలిమిగుండ్ల మండలంలో తొలిసారిగా అడుగుపెట్టనుండడం గమనార్హం. పరిశ్రమ నుంచి ఏటా 2 మిలియన్ టన్నుల సిమెంట్‌ను ఉత్పత్తి చేయనున్నారు. చదవండి: (ఆ విషయంపై కేటీఆర్, మహారాష్ట్ర సీఎం కేంద్రాన్ని ప్రశ్నించారు: సీఎం జగన్) -
రామ్‌కో సిమెంట్స్ విండ్ఫార్మ్కు అవార్డ్
హైదరాబాద్: రామ్‌కో సిమెంట్స్‌కు చెందిన విండ్ ఫార్మ్ (పవన విద్యుత్ పార్క్)కు ‘ఉత్తమ పనితీరు చూపిస్తున్న విండ్‌ఫార్మ్’గా విండ్ పవర్ అసోసియేషన్ అవార్డ్ ప్రకటించింది. 2 మెగావాట్ల సామర్థ్యానికి మించిన విభాగంలో ఈ అవార్డ్‌కు ఎంపిక చేసింది. జోన్ 1, జోన్ 2 పరిధిలోని తమిళనాడులో రామ్‌కో సిమెంట్స్‌కు చెందిన పవన విద్యుత్ పార్క్‌లను అవార్డ్‌కు పరిగణనలోకి తీసుకుంది. రామ్‌కో సిమెంట్స్ 1992–93లోనే పర్యా వరణ అనుకూల ఇంధనానికి ప్రాధాన్యత ఇచ్చింది. పవన విద్యుత్ సామర్థ్యం 4 మెగావాట్ల నుండి ఇప్పుడు 166 మెగావాట్లకు చేరింది. రామ్‌కో సిమెంట్స్‌కు ఉన్న మొత్తం క్యాపిటివ్ పవర్లో పునరుత్పాదక ఇంధన వాటా 45 శాతానికి చేరుకుంది. -
'నాట్యం' ఫేమ్ సంధ్యారాజు బ్యాక్‌గ్రౌండ్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..
Natyam Movie Heroine Sandhya Raju Family Background Details: ప్రముఖ కూచిపూడి డ్యాన్సర్ సంధ్యారాజు ప్రధాన పాత్రలో నటించిన సినిమా ‘నాట్యం’. రేవంత్ కోరుకొండ దర్శకత్వం వహించిన ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఉపాసన,ఎన్టీఆర్, రామ్‌చరణ్, వెంకటేశ్, చిరంజీవి లాంటి ప్రముఖులు నాట్యం చిత్రాన్ని ప్రమోట్ చేయడంతో ఈ సినిమాకు తొలి నుంచే పాజిటివ్ బజ్ క్రియేట్ అయ్యింది.చదవండి : కృష్ణంరాజు పెద్ద మనసు.. పనిమనిషికి ఖరీదైన బహుమతి అయితే క్షణం తీరిక లేకుండా గడిపే బిగ్ స్టార్స్ ఇంత ప్రత్యేకంగా ఈ సినిమాను ఎందుకు ప్రమోట్ చేస్తున్నారు? అసలు ఎవరీ సంధ్యారాజు అనే చర్చ సోషల్ మీడియాలో జోరుగా సాగుతుంది. ఇంతకీ ఈమె ఎవరంటే... వేల కోట్లకు అధిపతి, రాంకో సిమెంట్ ఇండస్ట్రీస్ యజమాని అయిన పి.ఆర్.వెంకట రామరాజు పెద్ద కుమార్తెనే సంధ్యారాజు. అంతేకాకుండా సత్యం కంప్యూటర్స్ వ్యవస్థాపకుడు రామలింగరాజు చిన్నకోడలు. సంధ్యారాజు స్వతహాగా కూచిపూడి నృత్యకారిణి. పేరు, ప్రఖ్యాతలున్న కుటుంబంలో పుట్టినా ఆమె స్వయంగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. ఇప్పటివరకు దేశ విదేశాల్లో కలిపి వెయ్యికి పైగా ప్రదర్శనలు ఇచ్చినట్లు సమాచారం. ప్రస్తుతం ఆమె రాజు రామ్ కో గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్‌లో భాగమైన సంధ్య స్పిన్నింగ్ మిల్స్ అనే సంస్థకు మేనేజింగ్ డైరెక్టర్ పనిచేస్తున్నారు. చదవండి : Natyam Movie Review: ‘నాట్యం’మూవీ రివ్యూ డబ్బుల కోసం ఇలాంటి పనులు చేస్తావా? హీరోయిన్‌పై ట్రోలింగ్ -
ఆక్సిజన్ కొరత.. ఎమ్మెల్యే వల్లభనేని వంశీ దాతృత్వం
సాక్షి, కృష్ణా: ఆంధప్రదేశ్‌లో కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నాయి.మరోవైపు కోవిడ్ బాధితులకు ఆక్సిన్ కొరత ఏర్పడుతోంది. ఈ నేపథ్యంలో గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ దాతృత్వం చాటకున్నారు. రాష్ట్రంలో ఆక్సిజన్ కొరత తీర్చేందుకు వంశీ చేయూతనందించారు. రూ.30 లక్షల విలువైన 70 ఆక్సిజన్ సిలిండర్లు వితరణ చేశారు. చిన్నఅవుటపల్లి పిన్నమనేని సిద్దార్థ కోవిడ్ ఆస్పత్రికి వీటిని అందజేశారు. ఈ మేరకు ఎమ్మెల్యే కార్యాలయ సిబ్బంది హాస్పిటల్ యాజమాన్యానికి ఆక్సిజన్ సిలిండర్లు అందించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నాయకులు తోట వెంకయ్య,అనగాని రవి,అన్నవరపు ఎలిజబెత్ రాణి,మేచినేని బాబు,గొంది పరందమయ్య తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా ఆక్సిజన్ బెడ్ల కోసం రామ్‌కో సిమెంట్ రూ.20 లక్షల విరాళం ప్రటించింది. ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ సమక్షంలో కంపెనీ ప్రతినిధులు విరాళం అందజేశారు. చదవండి: నా అక్కచెల్లమ్మలైన నర్సులందరికీ కృతజ్ఞతలు: సీఎం జగన్ -
బీపీసీఎల్ పతనం- రామ్‌కో సిస్టమ్స్ జోరు
తొలి సెషన్లో కన్సాలిడేట్ అయిన దేశీ స్టాక్ మార్కెట్లు మిడ్‌సెషన్‌కల్లా జోరందుకున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 209 పాయింట్లు జంప్‌చేసి 38,182ను తాకగా.. నిఫ్టీ 66 పాయింట్లు ఎగసి 11,245 వద్ద ట్రేడవుతోంది. కాగా.. చమురు దిగ్గజం బీపీసీఎల్ విక్రయానికి వీలుగా ఆసక్తి వ్యక్తీకరణ బిడ్స్(ఈవోఐ) దాఖలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం గడువును పెంచింది. దీంతో ఈ కౌంటర్లో అమ్మకాలు ఊపందుకున్నాయి. మరోపక్క గ్లోబల్ లాజిస్టిక్స్ దిగ్గజం నుంచి ఆర్డర్‌ను పొందినట్లు వెల్లడించడంతో ఐటీ సేవల కంపెనీ రామ్‌కో సిస్టమ్స్ కౌంటర్ వెలుగులోకి వచ్చింది. వెరసి బీపీసీఎల్ కౌంటర్ భారీగా నష్టపోగా.. రామ్‌కో సిస్టమ్స్ లాభాలతో కళకళలాడుతోంది. వివరాలు చూద్దాం.. బీపీసీఎల్ చమురు పీఎస్‌యూ.. బీపీసీఎల్‌ను ప్రయివేటైజ్ చేసే బాటలో కేంద్ర ప్రభుత్వం ఈవోఐల దాఖలుకు తాజాగా గడువును నవంబర్ 16వరకూ పొడిగించింది. ఈ ఏడాది మార్చి 7న తొలిసారి కేంద్ర ప్రభుత్వం బీపీసీఎల్‌లో మెజారిటీ వాటా విక్రయానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే కోవిడ్-19 నేపథ్యంలో కొనుగోలుకి ఆసక్తి చూపగల కంపెనీల నుంచి వినతులమేరకు గడువును పొడిగిస్తున్నట్లు ప్రభుత్వం తెలియజేసింది. కంపెనీలో ప్రభుత్వానికి దాదాపు 53 శాతం వాటా ఉంది. కాగా.. బీపీసీఎల్ కొనుగోలుపట్ల విదేశీ దిగ్గజాలు రాస్‌నెఫ్ట్, సౌదీ అరామ్కో విముఖత చూపుతున్నట్లు వార్తలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో బీపీసీఎల్ కౌంటర్లో అమ్మకాలు ఊపందుకున్నాయి. ప్రస్తుతం ఎన్ఎస్ఈలో బీపీసీఎల్ షేరు 9 శాతం పతనమై రూ. 352 దిగువకు చేరింది. రామ్‌కో సిస్టమ్స్ లాజిస్టిక్స్ రంగంలోని గ్లోబల్ కంపెనీతో డీల్‌ను కుదుర్చుకున్నట్లు రామ్‌కో సిస్టమ్స్ తాజాగా వెల్లడించింది. ఒప్పందంలో భాగంగా లాజిస్టిక్స్ కంపెనీకి చెందిన అంతర్జాతీయ పేరోల్ నిర్వహణలో ఆధునీకరణ, ట్రాన్స్‌ఫార్మేషన్‌కు వీలుగా ఐటీ సేవలు అందించనున్నట్లు తెలియజేసింది. మధ్యప్రాచ్యం, ఆఫ్రికా దేశాలలో గల పేరోల్ కార్యకలాపాలను లాజిస్టిక్స్ కంపెనీ ఏకీకృతం చేస్తున్నట్లు తెలియజేసింది. ఈ నేపథ్యంలో రామ్‌కో సిస్టమ్స్ షేరు ఎన్ఎస్ఈలో 5 శాతం అప్పర్ సర్క్యూట్‌ను తాకింది. అమ్మేవాళ్లు కరువుకావడంతో రూ. 425 సమీపంలో ఫ్రీజయ్యింది. ఇది 52 వారాల గరిష్టంకావడం విశేషం! -
సాఫ్ట్వేర్ సేవల ఈ షేరు యమస్పీడ్
ఐటీ కన్సల్టింగ్, సాఫ్ట్వేర్ సేవల మధ్యస్థాయి కంపెనీ రామ్‌కో సిస్టమ్స్ కొద్ది రోజులుగా ఇన్వెస్టర్ల ఫేవరెట్ షేరుగా నిలుస్తోంది. ఈ బాటలో అమ్మేవాళ్లు కరువుకాగా.. కొనేవాళ్లు అధికంకావడంతో వరుసగా రెండో రోజు శుక్రవారం 5 శాతం అప్పర్ సర్క్యూట్‌ను తాకింది. ఎన్ఎస్ఈలో రూ. 275 వద్ద ఫ్రీజయ్యింది. వెరసి 52 వారాల గరిష్టాన్ని చేరింది. ఇన్వెస్టర్ల నుంచి డిమాండ్ కొనసాగడంతో గత నెల రోజుల్లోనే ఈ కౌంటర్ 105 శాతం ర్యాలీ చేసింది. అంతేకాకుండా గత మూడు నెలల కాలాన్ని పరిగణిస్తే.. 277 శాతం దూసుకెళ్లింది. ఇదే కాలంలో ప్రామాణిక ఇండెక్స్ సెన్సెక్స్ 13 శాతమే లాభపడటం గమనార్హం! పలు అంశాలు పలు సానుకూల అంశాల నేపథ్యంలో క్లౌడ్ ఆధారిత ఐటీ సేవలందించే రామ్‌కో సిస్టమ్స్ కౌంటర్ ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్నట్లు నిపుణులు చెబుతున్నారు. జూన్ 10న ప్రసిద్ధ ఇన్వెస్టర్ విజయ్ కిషన్‌లాల్ కేడియా రామ్‌కో సిస్టమ్స్‌లో షేరుకి రూ. 87.8 ధరలో దాదాపు 3.4 లక్షల షేర్లను సొంతం చేసుకున్నారు. 1.1 శాతం వాటా కొనుగోలుకి రూ. 3 కోట్లు వెచ్చించారు. ఇదే విధంగా ఎన్ఎస్ఈ బల్క్ డేటా ప్రకారం గత వారం రామ్‌కో సిస్టమ్స్‌లో హెచ్డీఎఫ్సీ మ్యూచువల్ ఫండ్.. షేరుకి రూ. 240 ధరలో 1.57 లక్షల షేర్లను సొంతం చేసుకుంది. ఈ బాటలో ఇటీవల విభిన్న పథకాల ద్వారా 2.25 శాతం వాటాను కొనుగోలు చేసినట్లు వెల్లడైంది. దీంతో కంపెనీలో హెచ్డీఎఫ్సీ ఎంఎఫ్ వాటా తాజాగా 8.65 శాతానికి ఎగసింది. భారీ డీల్.. మలేసియాకు చెందిన డైవర్సిఫైడ్ బిజినెస్‌లు కలిగిన యుటిలిటీస్, ఇన్ఫ్రా గ్రూప్‌తో మల్టీ మిలియన్ డాలర్ డీల్‌ను కుదుర్చుకున్నట్లు రామ్‌కో సిస్టమ్స్ గత నెల 25న వెల్లడించింది. తద్వారా గ్రూప్ కంపెనీలకు పోర్టులు, లాజిస్టిక్స్ కార్యకలాపాలలో డిజిటల్ ట్రాన్స్ఫార్మేషన్ సేవలు అందించనున్నట్లు తెలియజేసింది. ఈ డీల్ నేపథ్యంలో రామ్‌కో ఎంటర్ప్రైజ్ ప్లాట్‌ఫామ్ మలేసియాలోని 50 శాతం పోర్టుల నిర్వహణలో ఐటీ సేవలు అందించేందుకు వీలు కలిగినట్లు విశ్లేషకులు తెలియజేశారు. -
రామ్‌కో సిస్టమ్స్- లక్ష్మీవిలాస్.. హైజంప్
ఇటీవల కొద్ది రోజులుగా ర్యాలీ బాటలో సాగుతున్న ఐటీ సేవల సంస్థ రామ్‌కో సిస్టమ్స్ మరోసారి ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. కాగా.. మరోపక్క క్లిక్స్ క్యాపిటల్‌తో నాన్‌బైండింగ్ ఒప్పందం(ఎల్వోఐ) కుదుర్చుకున్నట్లు వెల్లడికావడంతో ప్రయివేట్ రంగ సంస్థ లక్ష్మీ విలాస్ బ్యాంక్ కౌంటర్‌కు డిమాండ్ పెరిగింది. వెరసి ఈ రెండు కౌంటర్లూ భారీ లాభాలతో కళకళలాడుతున్నాయి. వివరాలు చూద్దాం.. రామ్‌కో సిస్టమ్స్ ప్రసిద్ధ ఇన్వెస్టర్ విజయ్ కేడియా కంపెనీలో 1 శాతం వాటా కొనుగోలు చేసినట్లు వెల్లడయ్యాక జోరందుకున్న సాఫ్ట్వేర్ సేవల సంస్థ రామ్‌కో సిస్టమ్స్ కౌంటర్ మళ్లీ వెలుగులోకి వచ్చింది. ఎన్ఎస్ఈలో ఈ షేరు ప్రస్తుతం 10 శాతం అప్పర్ సర్క్యూట్‌ను తాకింది. రూ. 13 పెరిగి రూ. 147 సమీపంలో ఫ్రీజయ్యింది. వెరసి వరుసగా ఐదో రోజు అప్పర్ సర్క్యూట్‌కు చేరింది. ఫలితంగా గత వారం రోజుల్లో ఈ కౌంటర్ ఏకంగా 90 శాతం దూసుకెళ్లింది. ఈ నెల 9న రామ్‌కో సిస్టమ్స్ షేరు రూ. 77 సమీపంలో ముగిసింది. కాగా.. గత వారం విజయ్ కేడియా ఓపెన్ మార్కెట్ ద్వారా రామ్‌కో సిస్టమ్స్‌లో షేరుకి రూ. 87.8 ధరలో 1.1 శాతం ఈక్విటీని కొనుగోలు చేశారు. 3.4 లక్షల షేర్ల కొనుగోలుకి రూ. 3 కోట్లు వెచ్చించారు. కంపెనీ శుక్రవారం(19న) క్యూ4 ఫలితాలు ప్రకటించనుంది. లక్ష్మీ విలాస్ బ్యాంక్ క్లిక్స్ క్యాపిటల్ సర్వీసెస్, క్లిక్ ఫైనాన్స్ ఇండియాలతో ప్రాథమిక నాన్‌బైండింగ్ ఒప్పందాన్ని(ఎల్వోఐ) కుదుర్చుకున్నట్లు లక్ష్మీ విలాస్ బ్యాంక్ తాజాగా వెల్లడించింది. బ్యాంకులో క్లిక్స్ గ్రూప్ విలీనానికి సంబంధించి ఎల్‌వోఐపై సంతకాలు చేసినట్లు పేర్కొంది. తద్వారా 45 రోజుల్లోగా ఇందుకు సంబంధించి నియంత్రణ సంస్థల అనుమతి తదితర సన్నాహాలు చేపట్టనున్నట్లు తెలియజేసింది. పీఈ సంస్థ అయాన్ క్యాపిటల్ పార్టనర్స్‌కు చెందినదే క్లిక్స్ క్యాపిటల్. అయాన్ క్యాపిటల్ పార్టనర్స్లో న్యూయార్క్ సంస్థ అపోలో గ్లోబల్ మేనేజ్మెంట్, దేశీ సంస్థ ఐసీఐసీఐ వెంచర్ భాగస్వాములుగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో లక్ష్మీ విలాస్ బ్యాంక్ షేరు ఎన్ఎస్ఈలో 5 శాతం అప్పర్ సర్క్యూట్‌ను తాకింది. రూ. 16 వద్ద ఫ్రీజయ్యింది. ఇంతక్రితం నియంత్రణ సంస్థలు అనుమతించకపోవడంతో ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్‌తో విలీనానికి లక్ష్మీ విలాస్ బ్యాంక్ చేసిన ప్రయత్నాలు విఫలమైన సంగతి తెలిసిందే. -
ఇండస్ఇండ్- రామ్‌కో సిస్టమ్స్.. దూకుడు
కోవిడ్-19 ప్రభావంతో ఈ ఏడాది అమెరికా జీడీపీ 6.5 శాతం క్షీణించనున్నట్లు ఫెడ్ వేసిన అంచనాలతో ప్రపంచవ్యాప్తంగా సెంటిమెంటు బలహీనపడింది. దీంతో దేశీయంగానూ అమ్మకాలదే పైచేయిగా నిలుస్తోంది. ప్రస్తుతం సెన్సెక్స్ 340 పాయింట్లు పతనమై 33,907ను తాకింది. తద్వారా 34,000 పాయింట్ల మార్క్ దిగువకు చేరింది. నిఫ్టీ 90 పాయింట్లు క్షీణించి 10,026 వద్ద ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలోనూ సానుకూల వార్తల కారణంగా ప్రయివేట్ రంగ దిగ్గజం ఇండస్ఇండ్ బ్యాంక్, ఐటీ సేవల కంపెనీ రామ్‌కో సిస్టమ్స్ కౌంటర్లు ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్నాయి. వెరసి నష్టాల మార్కెట్లోనూ భారీ లాభాలతో కళకళలాడుతున్నాయి. వివరాలు చూద్దాం.. ఇండస్ఇండ్ బ్యాంక్ సెకండరీ మార్కెట్ ద్వారా అదనపు వాటాను కొనుగోలు చేయనున్నట్లు ప్రమోటర్లు పేర్కొనడంతో ప్రయివేట్ రంగ సంస్థ ఇండస్ఇండ్ బ్యాంక్ కౌంటర్ జోరు చూపుతోంది. ప్రస్తుతం ఎన్ఎస్ఈలో 5.3 శాతం జంప్‌చేసి రూ. 526 వద్ద ట్రేడవుతోంది. తొలుత 8 శాతం ఎగసి గరిష్టంగా రూ. 541కు చేరింది. వెరసి వరుసగా ఐదో రోజు లాభాలతో కదులుతోంది. గత వారం రోజుల్లో ఈ షేరు 30 శాతం దూసుకెళ్లడం విశేషం! అయితే గతేడాది ఆగస్ట్‌లో నమోదైన చరిత్రాత్మక గరిష్టం రూ. 2038తో పోలిస్తే ఇప్పటికీ 73 శాతం పతనంలో ఉన్నట్లు నిపుణులు పేర్కొన్నారు. ఇక మార్చి 24న రూ. 236 వద్ద 52 వారాల కనిష్టాన్ని తాకింది. ఈ స్థాయి నుంచి చూస్తే రెట్టింపునకుపైగా ఎగసింది. కాగా.. ప్రస్తుతం ఇండస్‌ఇండ్‌లో ప్రమోటర్లకు 14.68 శాతం వాటా ఉంది. ఈ వాటాను 26 శాతానికి పెంచుకునేందుకు అనుమతించమంటూ ఏప్రిల్‌లోనే ప్రమోటర్లు ఆర్బీఐకు దరఖాస్తు చేసుకున్న విషయం విదితమే. రామ్‌కో సిస్టమ్స్ సుప్రసిద్ధ ఇన్వెస్టర్ విజయ్ కిషన్‌లాల్ కేడియా ఈ నెల 10న రామ్‌కో సిస్టమ్స్ ఈక్విటీలో 1.1 శాతం వాటాకు సమానమైన దాదాపు 3.4 లక్షల షేర్లను కొనుగోలు చేసినట్లు ఎన్ఎస్ఈ డేటా వెల్లడించింది. ఐటీ కన్సల్టింగ్ కంపెనీ రామ్‌కో సిస్టమ్స్‌లో వాటాను ఓపెన్ మార్కెట్ ద్వారా షేరుకి రూ. 87.82 ధరలో సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. కేడియా సెక్యూరిటీస్ ద్వారా విజయ్ కేడియా రెప్రో ఇండియా, ఎవరెస్ట్ ఇండస్ట్రీస్, సుదర్శన్ కెమికల్స్, సెరా శానిటరీ తదితర స్మాల్ క్యాప్ కంపెనీలలో ఇన్వెస్ట్ చేసిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో గత రెండు రోజులుగా రామ్‌కో సిస్టమ్స్ కౌంటర్‌కు డిమాండ్ పెరిగింది. వెరసి వరుసగా రెండో రోజు 20 శాతం అప్పర్ సర్క్యూట్‌ను తాకింది. ప్రస్తుతం ఎన్ఎస్ఈలో రూ. 18.4 ఎగసి రూ. 110 వద్ద ఫ్రీజయ్యింది. ఎన్ఎస్ఈ, బీఎస్ఈలో కలిపి ఇప్పటివరకూ 7 లక్షల షేర్లకుపైగా చేతులు మారినట్లు నిపుణులు వెల్లడించారు. మంగళవారం ఈ షేరు రూ. 77 సమీపంలో ముగిసింది. -
రామ్‌కో సిమెంట్ భారీ విస్తరణ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సిమెంటు తయారీ సంస్థ రామ్‌కో సిమెంట్స్ భారీ విస్తరణ చేపట్టింది. ఇందుకోసం రూ.4,000 కోట్లు వ్యయం చేస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాలో 3.15 మిలియన్ టన్నుల సామర్థ్యంతో సిమెంటు ఉత్పత్తి కేంద్రాన్ని రూ.1,500 కోట్లతో నెలకొల్పుతోంది. ప్లాంటు ద్వారా ప్రత్యక్షంగా 300 మందికి, పరోక్షంగా 1,000 మందికి ఉపాధి లభిస్తుందని రామ్‌కో మార్కెటింగ్ ఈడీ బాలాజీ కె మూర్తి గురువారం వెల్లడించారు. సూపర్‌క్రీట్ సిమెంట్‌ను ఇక్కడి మార్కెట్లో విడుదల చేసిన సందర్భంగా మార్కెటింగ్ ప్రెసిడెంట్ ఆర్.రామకృష్ణన్‌తో కలిసి మీడియాతో మాట్లాడారు. కృష్ణా జిల్లాలో 1.5 మిలియన్ టన్నుల క్లింకర్ యూనిట్, విశాఖపట్నం జిల్లాలో 1 మిలియన్ టన్నుల గ్రైండింగ్ కేంద్రం ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. ఒడిశాలోని సిమెంటు తయారీ ప్లాంటులో 1.5 మిలియన్ టన్నులు, కోల్‌కతాలో 1 మిలియన్ టన్నుల సామర్థ్యం జోడిస్తున్నట్టు పేర్కొన్నారు. వచ్చే ఏడాది చివరికల్లా.. కంపెనీ చేపట్టిన అన్ని ప్రాజెక్టులు 2020 డిసెంబరుకల్లా పూర్తి కానున్నాయి. కర్నూలు ప్లాంటు రాకతో ఆంధ్రప్రదేశ్‌లో రామ్‌కో సిమెంటు ఉత్పత్తి సామర్థ్యం 10 మిలియన్ టన్నులు నమోదు కానుంది. తద్వారా ఏపీలో అత్యధిక ఉత్పత్తి సామర్థ్యమున్న సంస్థగా నిలుస్తుంది. అన్ని తయారీ కేంద్రాలు కలిపి ప్రస్తుతం సంస్థ వార్షిక సిమెంటు ఉత్పత్తి సామర్థ్యం 12.5 మిలియన్ టన్నులు ఉంది. విస్తరణ పూర్తి అయితే ఇది 20 మిలియన్ టన్నులకు చేరుతుందని బాలాజీ వెల్లడించారు. 2018–19లో కంపెనీ టర్నోవరు రూ.5,146 కోట్లు. 2020–21లో ఇది రూ.7,500 కోట్లను తాకుతుందని ఆయన పేర్కొన్నారు. సుస్థిర ప్రభుత్వం ఉంటే.. ‘ఆంధ్రప్రదేశ్‌లో పలు ప్రాజెక్టులు నిలిచిపోయాయి. మీరేమో విస్తరణ చేపడుతున్నారు. ఫలితం ఎలా ఉండబోతోంది’ అని మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు.. ‘ఏ రాష్ట్రంలోనైనా ఒడిదుడుకులు తాత్కాలికం. మళ్లీ మార్కెట్ పుంజుకుంటుందన్న నమ్మకం మాకుంది. సుస్థిర ప్రభుత్వం ఉన్నప్పుడు సిమెంటుకు డిమాండ్ ఉంటుంది. మా పెట్టుబడులు కొనసాగిస్తాం’ అని బాలాజీ స్పష్టం చేశారు. మందగమన ప్రభావం సిమెంటు రంగంపై ఉందా అన్న మరో ప్రశ్నకు వ్యక్తిగత గృహాల నిర్మాణాలు అన్ని ప్రాంతాల్లోనూ కొనసాగుతున్నాయని వివరించారు. ప్రభుత్వ గృహ నిర్మాణ ప్రాజెక్టులు సాగుతున్నాయని చెప్పారు. సిమెంటు వినియోగం దేశంలో ఏప్రిల్–జూన్ కాలంలో 7–8 శాతం వృద్ధి నమోదైందన్నారు. -
శ్రీవారికి రూ. 17.5 లక్షల విరాళం
తిరుపతి : తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారికి ఆదివారం ఓ భక్తుడు రూ.17.5 లక్షలు విరాళంగా అందించారు. రామ్‌కో ఇండస్ట్రీస్‌కు చెందిన పి.రామసుబ్రమణ్యం రాజు ఆదివారం తిరుమలకు చేరుకున్నారు. శ్రీవారిని దర్శించుకున్న అనంతరం రంగనాయక మండపంలో టీటీడీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తిని కలిసి బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని ట్రస్టుకు రూ.17.5లక్షల విరాళాన్ని చెక్ రూపంలో అందించారు. దాత రాజుకు స్వామివారి తీర్థప్రసాదాలు అందించారు.