రామ్‌కో సిమెంట్‌ ఫ్యాక్టరీని ప్రారంభించిన సీఎం జగన్‌ | CM YS Jagan Nandyal District Tour Live Updates | Sakshi
Sakshi News home page

రామ్‌కో సిమెంట్‌ ఫ్యాక్టరీని ప్రారంభించిన సీఎం జగన్‌

Published Wed, Sep 28 2022 10:35 AM | Last Updated on Wed, Sep 28 2022 2:53 PM

CM YS Jagan Nandyal District Tour Live Updates - Sakshi

Live Updates:

పారిశ్రామిక వృద్ధికి ప్రభుత్వం చేయూత: సీఎం జగన్‌
పారిశ్రామిక వృద్ధికి ప్రభుత్వం చేయూతనిస్తోందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ఒక ఇండస్ట్రీ రావడం వల్ల ఎంతో మంచి జరుగుతుందన్నారు. స్థానికులకు ఉద్యోగావకాశాలు పెరిగాయన్నారు. రామ్‌కో పరిశ్రమతో 1000 మందికి ఉద్యోగాలు వస్తాయని, ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌కు ఏపీనే ఉదాహరణ అని సీఎం అన్నారు. 

పారిశ్రామిక అభివృద్ధితో ముందుకు.. మంత్రి అమర్‌నాథ్‌
రాష్ట్రాన్ని పారిశ్రామిక అభివృద్ధితో ముందుకు తీసుకెళుతున్నామని పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ అన్నారు. పరిశ్రమలకు ఎంతో పోత్సాహం ఇస్తున్నామన్నారు. సీఎం జగన్‌ తీసుకున్న చర్యలతోనే పెట్టుబడులు వస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.

నంద్యాల జిల్లాలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటించారు. కొలిమిగుండ్లలో రామ్‌కో సిమెంట్‌ ఫ్యాక్టరీని సీఎం ప్రారంభించారు.

కొలిమిగుండ్ల(నంద్యాల జిల్లా): జిల్లా పారిశ్రామిక పథంలో పయనిస్తోంది. ప్రభుత్వం అందిస్తున్న సహకారంతో పలు కంపెనీలు పరిశ్రమలు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయి. ఇప్పటికే  జిల్లాలో జయజ్యోతి, జేఎస్‌డబ్ల్యూ సిమెంట్‌ ఫ్యాక్టరీలు ఉండగా తాజాగా కల్వటాల వద్ద రూ.1,790 కోట్లతో  రామ్‌కో కంపెనీ సిమెంట్‌ పరిశ్రమను నెలకొల్పింది. ఏటా 2 మిలియన్‌ టన్నుల సిమెంట్‌ ను ఉత్పత్తి చేసే ఈ పరిశ్రమ..  సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి చేతుల మీదుగా ప్రారంభమైంది.

జిల్లాలో ఎక్కడా లేని విధంగా  సిమెంట్‌ పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన ముడి ఖనిజపు నిల్వలు కొలిమిగుండ్ల మండలంలో అపారంగా ఉన్నాయి.  రవాణా సౌకర్యం, నీటి వనరులు కూడా ఇక్కడ పుష్కలంగా ఉన్నాయి. దీనికితోడు  వెనుకబడిన ఈ ప్రాంతాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు. దీంతో   పరిశ్రమలు నెలకొల్పేందుకు పారిశ్రామికవేత్తలు ఆసక్తి చూపుతున్నారు.

సిద్ధమైన రామ్‌కో సిమెంట్‌ ఫ్యాక్టరీ
కొలిమిగుండ్ల మండలం కల్వటాల గ్రామ సమీపంలో అత్యాధునిక టెక్నాలజీతో  రామ్‌కో  సిమెంట్‌ పరిశ్రమను నిర్మించారు.  ఈ ఫ్యాక్టరీ ఏర్పాటుకు కొలిమిగుండ్ల, నాయినపల్లె, కల్వటాల, ఇటిక్యాల, చింతలాయిపల్లె, కనకాద్రిపల్లె గ్రామాల రైతుల నుంచి దశల వారీగా 5 వేల ఎకరాల భూమిని సేకరించారు. 2018 డిసెంబర్‌ 14లో పరిశ్రమ నిర్మాణానికి భూమి పూజ చేయగా  నాటి  తెలుగుదేశం ప్రభుత్వం  విధానాలతో   పనుల్లో తీవ్ర జాప్యం జరిగింది. 2019లో  అధికారంలోకి వచ్చిన వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం పారిశ్రామిక ప్రగతే లక్ష్యంగా అడుగులు వేయడంతో  రామ్‌కో సిమెంట్‌ పరిశ్రమకు అవసరమైన అన్ని రకాల అనుమతులు చకచకా లభించాయి.

తర్వాత నిర్మాణ పనులు  సాగుతున్న సమయంలో కరోనా ఎఫెక్ట్‌తో పనులకు కొంత కాలం బ్రేక్‌ పడినా ఆ తర్వాత  యుద్ధప్రాతిపదికన  చేపట్టి నిర్మాణం పూర్తి చేశారు. ఇందుకు ప్రభుత్వం సైతం పూర్తి సహకారం అందించింది. పరిశ్రమకు ప్రధానంగా నీటి వనరులు అవసరం. ఎక్కువ లోతులో బోర్లు వేసి భారీ మోటార్ల సాయంతో నీటిని పంపింగ్‌ చేస్తే సమీప గ్రామాల్లో సాగు, తాగునీటికి ఇబ్బంది ఎదురవుతుందనే ఉద్దేశంతో అవుకు రిజర్వాయర్‌ నుంచి 0.5 టీఎంసీల నీళ్లను పైపులైన్‌ ద్వారా ఉపయోగించుకునేందుకు ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది.

2 మిలియన్‌ టన్నుల సిమెంట్‌ ఉత్పత్తి  
భారీ బడ్జెట్‌తో ఏర్పాటు చేసిన రామ్‌కో పరిశ్రమలో ఏడాదికి 2.0 మిలియన్‌ టన్నుల సిమెంట్‌ ఉత్పత్తి చేయనున్నారు. 30 మెగా వాట్ల థర్మల్‌ ప్లాంట్‌ను కంపెనీ సొంతంగా ఏర్పాటు చేసుకుంది.  భూములు ఇచ్చిన రైతు  కుటుంబాలకు ఉద్యోగాలిచ్చింది. త్వరలోనే మరో 1,050 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించనుంది. ఈ పరిశ్రమ ద్వారా పరోక్షంగా మరి కొంత మందికి ఉపాధి లభించనుంది. ఇప్పటికే  ఫ్యాక్టరీ ఏర్పాటుతో కొలిమిగుండ్లలో ఇళ్ల స్థలా లతో పాటు భూముల ధరలకు రెక్కలొచ్చాయి.

సీఎస్‌ఆర్‌ కింద అభివృద్ధి పనులు
కంపెనీ సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్‌) కింద పరిశ్రమల పరిధిలోని వివిధ గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపడుతోంది.   2019 నుంచి 2022 వరకు సీఎస్‌ఆర్‌ కింద రూ.8.5 కోట్లు ఖర్చు చేసినట్లు కంపెనీ ప్రతినిధులు తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement