ఐదేళ్ల కాల వ్యవధికి పాస్‌పోర్ట్ ఇవ్వాలని హైకోర్టు ఆదేశం
ప్రత్యేక కోర్టు ఉత్తర్వులు రద్దు
సాక్షి, అమరావతి: వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తాజా పాస్‌పోర్ట్ పొందేందుకు అవసరమైన నిరభ్యంతర పత్రాన్ని (ఎన్‌వోసీ) జారీ చేస్తూ హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఐదేళ్ల కాల వ్యవధితో వైఎస్ జగన్‌కు పాస్‌పోర్ట్ జారీ చేయాలని పాస్‌పోర్ట్ అధికారులను ఆదేశించింది. కుమార్తె డిగ్రీ ప్రదానోత్సవ కార్యక్రమం నిమిత్తం ఈ నెల 16న యునైటెడ్ కింగ్‌డమ్ (యూకే) వెళ్లేందుకు జగన్‌మోహన్‌రెడ్డికి అనుమతి ఇచ్చింది. ఎన్‌వోసీ ఇవ్వాలంటే స్వయంగా కోర్టు ముందు హాజరై, రూ.20 వేలతో వ్యక్తిగత పూచీకత్తు సమర్పించాల్సిందేనన్న ప్రత్యేక కోర్టు ఆదేశాలను రద్దు చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ కొనకంటి శ్రీనివాసరెడ్డి మంగళవారం తీర్పు వెలువరించారు.
తాజాగా ఐదేళ్ల కాల వ్యవధితో పాస్‌పోర్ట్ జారీకి ఎన్‌వోసీ ఇవ్వాలంటే స్వయంగా కోర్టు ముందు హాజరై, రూ.20 వేలతో వ్యక్తిగత పూచీకత్తు సమర్పించాల్సిందేనంటూ విజయ వాడ ప్రజా ప్రతినిధుల ప్రత్యేక కోర్టు ఇటీవల ఇచ్చిన ఆదేశాలను రద్దు చేయాలని కోరుతూ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యంపై సోమవారం వాదనలు విన్న జస్టిస్ శ్రీనివాసరెడ్డి మంగళవారం తన నిర్ణయాన్ని వెలువరించారు. ‘క్రిమినల్ కేసు పెండింగ్‌లో ఉన్నప్పుడు సంబంధిత కోర్టు నుంచి నిరభ్యంతర పత్రం అడగటంలో ప్రధాన ఉద్దేశం ఏమిటంటే.. క్రిమినల్ ప్రొసీడింగ్స్‌కు దరఖాస్తు దారు అందుబాటులో ఉండేలా చూడటమే. పాస్‌పోర్ట్ కలిగి ఉండటం రాజ్యాంగం ప్రసాదించిన హక్కు. విదేశాలకు వెళ్లేందుకు తగిన పాస్‌పోర్ట్ కలిగి ఉండాలి.
జగన్ మోహన్‌రెడ్డి ఈ నెల 16న తన కుమార్తె డిగ్రీ ప్రదానోత్సవంలో పాల్గొనేందుకు విదేశాలకు వెళ్లాల్సి ఉంది. జగన్‌మోహన్‌రెడ్డి పులివెందుల ఎమ్మెల్యే. మాజీ ముఖ్యమంత్రి. వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు. నారాయణ దాఖలు చేసిన పరువు నష్టం కేసులో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపునిస్తే.. ఇదే హైకోర్టు గత నవంబర్‌లో ఉత్తర్వులిచ్చింది. జగన్ తరఫున ఆయన న్యాయవాది హాజరైతే సరిపోతుందని చెప్పింది. ఈ నేపథ్యంలో తాజా పాస్‌పోర్ట్ పొందేందుకు నిరభ్యంతర పత్రం జారీ చేయడానికి ఎలాంటి అడ్డంకి లేదు. ఎన్‌వోసీ జారీ చేయాలన్న జగన్ అభ్యర్థనను తిరస్కరిస్తూ ప్రత్యేక కోర్టు చెప్పిన కారణాలేవీ చెల్లవు. అందువల్ల ప్రత్యేక కోర్టు ఉత్తర్వులను రద్దు చేస్తున్నాం’ అని శ్రీనివాసరెడ్డి తన తీర్పులో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment