![BPCL extends EOI deadline -Ramco systems jumps on logistics company order - Sakshi](/styles/webp/s3/article_images/2020/09/30/BPCL-%20Ramco%20systems.jpg.webp?itok=iOb2w0sG)
తొలి సెషన్‌లో కన్సాలిడేట్ అయిన దేశీ స్టాక్ మార్కెట్లు మిడ్‌సెషన్‌కల్లా జోరందుకున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 209 పాయింట్లు జంప్‌చేసి 38,182ను తాకగా.. నిఫ్టీ 66 పాయింట్లు ఎగసి 11,245 వద్ద ట్రేడవుతోంది. కాగా.. చమురు దిగ్గజం బీపీసీఎల్ విక్రయానికి వీలుగా ఆసక్తి వ్యక్తీకరణ బిడ్స్(ఈవోఐ) దాఖలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం గడువును పెంచింది. దీంతో ఈ కౌంటర్లో అమ్మకాలు ఊపందుకున్నాయి. మరోపక్క గ్లోబల్ లాజిస్టిక్స్ దిగ్గజం నుంచి ఆర్డర్‌ను పొందినట్లు వెల్లడించడంతో ఐటీ సేవల కంపెనీ రామ్‌కో సిస్టమ్స్ కౌంటర్ వెలుగులోకి వచ్చింది. వెరసి బీపీసీఎల్ కౌంటర్ భారీగా నష్టపోగా.. రామ్‌కో సిస్టమ్స్ లాభాలతో కళకళలాడుతోంది. వివరాలు చూద్దాం..
బీపీసీఎల్
చమురు పీఎస్‌యూ.. బీపీసీఎల్‌ను ప్రయివేటైజ్ చేసే బాటలో కేంద్ర ప్రభుత్వం ఈవోఐల దాఖలుకు తాజాగా గడువును నవంబర్ 16వరకూ పొడిగించింది. ఈ ఏడాది మార్చి 7న తొలిసారి కేంద్ర ప్రభుత్వం బీపీసీఎల్‌లో మెజారిటీ వాటా విక్రయానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే కోవిడ్-19 నేపథ్యంలో కొనుగోలుకి ఆసక్తి చూపగల కంపెనీల నుంచి వినతులమేరకు గడువును పొడిగిస్తున్నట్లు ప్రభుత్వం తెలియజేసింది. కంపెనీలో ప్రభుత్వానికి దాదాపు 53 శాతం వాటా ఉంది. కాగా.. బీపీసీఎల్ కొనుగోలుపట్ల విదేశీ దిగ్గజాలు రాస్‌నెఫ్ట్, సౌదీ అరామ్‌కో విముఖత చూపుతున్నట్లు వార్తలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో బీపీసీఎల్ కౌంటర్లో అమ్మకాలు ఊపందుకున్నాయి. ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో బీపీసీఎల్ షేరు 9 శాతం పతనమై రూ. 352 దిగువకు చేరింది.
రామ్‌కో సిస్టమ్స్
లాజిస్టిక్స్ రంగంలోని గ్లోబల్ కంపెనీతో డీల్‌ను కుదుర్చుకున్నట్లు రామ్‌కో సిస్టమ్స్ తాజాగా వెల్లడించింది. ఒప్పందంలో భాగంగా లాజిస్టిక్స్ కంపెనీకి చెందిన అంతర్జాతీయ పేరోల్ నిర్వహణలో ఆధునీకరణ, ట్రాన్స్‌ఫార్మేషన్‌కు వీలుగా ఐటీ సేవలు అందించనున్నట్లు తెలియజేసింది. మధ్యప్రాచ్యం, ఆఫ్రికా దేశాలలో గల పేరోల్ కార్యకలాపాలను లాజిస్టిక్స్ కంపెనీ ఏకీకృతం చేస్తున్నట్లు తెలియజేసింది. ఈ నేపథ్యంలో రామ్‌కో సిస్టమ్స్ షేరు ఎన్‌ఎస్‌ఈలో 5 శాతం అప్పర్ సర్క్యూట్‌ను తాకింది. అమ్మేవాళ్లు కరువుకావడంతో రూ. 425 సమీపంలో ఫ్రీజయ్యింది. ఇది 52 వారాల గరిష్టంకావడం విశేషం!
Comments
Please login to add a commentAdd a comment