న్యూఢిల్లీ: బీపీసీఎల్ ప్రైవేటీకరణ మరింత ఆలస్యమవుతోంది. బీపీసీఎల్‌లో వాటాను కొనుగోలు చేసే సంస్థలు ఆసక్తి వ్యక్తీకరణ (ఈఓఐ) దరఖాస్తులను సమర్పించే తేదీని కేంద్రం మరోసారి పొడిగించింది. ఈ గడువును నవంబర్ 16 వరకూ పొడిగిస్తున్నట్లు కేంద్రం వెల్లడించింది. గడువు పొడిగించడం ఇది నాలుగోసారి. మొదటి గడువు మే 2 కాగా, ఆ తర్వాత జూన్ 13కు, అటు పిమ్మట జూలై 31కు, ఆ తర్వాత సెప్టెంబర్ 30కు, తాజాగా నవంబర్ 16కు గడువును పొడిగించింది. ఆసక్తి గల సంస్థల విన్నపం మేరకు, కరోనా కల్లోలం కారణంగా గడువును పొడిగిస్తున్నామని డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్‌మెంట్ (దీపమ్) వెల్లడించింది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాల విక్రయం ద్వారా రూ.2.1 లక్షల కోట్లు సమీకరించాలని కేంద్రం లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఈ లక్ష్యాన్ని చేరడం కోసం బీపీసీఎల్‌లో వాటాను త్వరిత గతిన విక్రయించాలని ప్రభుత్వం భావిస్తోంది. కానీ ఈ గడువుల పొడిగింపు కారణంగా ఈ వాటా విక్రయం ఈ ఆర్థిక సంవత్సరంలో పూర్తయ్యే అవకాశాలు అంతంతమాత్రంగానే ఉన్నాయి. ఈ వాటా విక్రయం ద్వారా ప్రభుత్వానికి రూ. 40,000 కోట్ల మేర నిధులు వస్తాయని అంచనా. ఈ కంపెనీలో కేంద్ర ప్రభుత్వం తనకున్న పూర్తి (52.98 శాతం)వాటాను విక్రయించనున్నది. గడువు పొడిగింపు వార్తల నేపథ్యంలో బీఎస్‌ఈలో బీపీసీఎల్ షేరు 9 శాతం నష్టంతో రూ. 353 వద్ద ముగిసింది.
బీపీసీఎల్ బిడ్ గడువు నాలుగోసారి పొడిగింపు
Published Fri, Oct 2 2020 5:45 AM | Last Updated on Fri, Oct 2 2020 5:45 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment