
ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ సంస్థ భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL) ద్విచక్ర వాహనదారుల కోసం అద్భుతమైన ఆఫర్ తీసుకొచ్చింది. ఈ సంస్థ ప్రారంభించి 45 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఫౌండేషన్ డే ఫెస్ట్ నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ప్రత్యేక ఆఫర్‌ను ప్రకటించింది. ఈ ఆఫర్ కింద టూ వీలర్లకు ఉచితంగా పెట్రోల్‌తోపాటు (Free Petrol) క్యాష్ కూపన్ అందిస్తోంది.
ఫౌండేషన్ డే ఫెస్ట్ ఆఫర్
ఫౌండేషన్ డే ఫెస్ట్ ఆఫర్‌ను భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ నిర్వహిస్తుంది. ఎంపిక చేసిన బీపీసీల్ రిటైల్ అవుట్‌లెట్‌ల నుండి పెట్రోల్‌తో పాటు కనీసం ఒక ప్యాక్ మ్యాక్ 4టీ (MAK 4T) లూబ్రికెంట్‌ను కొనుగోలు చేసే కస్టమర్‌లు ఈ ఆఫర్‌లో పాల్గొనడానికి అర్హులు. ఈ పథకం ద్విచక్ర వాహన కస్టమర్లకు మాత్రమే. ఇందులో పాల్గొని రూ. 75 విలువైన పెట్రోల్‌ను ఉచిత పొందొచ్చు. జనవరి 24నే మొదలైన ఈ ఆఫర్ ఫిబ్రవరి 28 వరకు కొనసాగనుంది.
బీపీసీఎల్ డీలర్లు, పంపిణీదారులు, ఛానల్ భాగస్వాములు, ప్రకటనల ఏజెన్సీల ఉద్యోగులు, సర్వీస్ ప్రొవైడర్లు, ఈవెంట్ మేనేజర్లు మొదలైన ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు ఈ ఆఫర్‌లో పాల్గొనడానికి అర్హులు కారు. అలాగే వాహనదారులకు ఒకసారి మాత్రమే ఈ ఆఫర్‌ను వినియోగించుకునేందుకు అవకాశం ఉంటుంది. అంటే ఒకసారి రిజిస్ట్రేషన్‌కు వినియోగించిన మొబైల్ నంబర్ మరోసారి ఉపయోగించేందుకు వీలు లేదు.
ఆఫర్ ప్రయోజనాలు
ఫౌండేషన్ డే ఫెస్ట్ ఆఫర్ కింద మ్యాక్ 4టీ (MAK 4T) ల్యూబ్రికెంట్ ఆయిల్ కొనుగోలు చేశాక తక్షణమే రూ. 75 విలువైన పెట్రోల్ ఉచితంగా లభిస్తుంది. లూబ్రికెంట్ల ప్యాక్‌లో రూ. 1000 వరకు విలువ చేసే క్యాష్ కూపన్ ఉంటుంది. దీనిని రిటైల్ అవుట్‌లెట్‌లోనే కౌంటర్‌లో నగదుగా మార్చుకోవచ్చు. క్యూఓసీ యంత్రాన్ని ఉపయోగించి మ్యాక్ క్విక్ కియోస్క్‌లో ఆయిల్ చేంజ్ ఉచితంగా చేసుకోవచ్చు. ఆర్‌ఓ డీలర్ హలో బీపీసీఎల్ యాప్‌ని ఉపయోగించి కూపన్ క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి, ఆ మొత్తాన్ని కస్టమర్‌కు అక్కడికక్కడే అందజేస్తారు. కస్టమర్ హలో బీపీసీఎల్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని, నిర్ణీత కేవైసీ ప్రక్రియను అనుసరించిన తర్వాత కూపన్‌ను స్వయంగా స్కాన్ చేయవచ్చు.