డిసెంబర్‌లో పెరిగిన వినియోగం
పెట్రోల్ అమ్మకాలు 10% అధికం
న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్ వినియోగం డిసెంబర్ నెలలో గణనీయంగా పెరిగింది. క్రితం ఏడాది ఇదే నెలలోని వినియోగంతో పోల్చి చూస్తే, పెట్రోల్ అమ్మకాలు (ప్రభుత్వరంగ సంస్థల) 10 శాతం పెరిగి 2.99 మిలియన్ టన్నులుగా ఉన్నాయి. ప్రభుత్వరంగ ఆయిల్ కంపెనీలు బీపీసీఎల్, ఐవోసీఎల్, హెచ్‌పీసీఎల్ ద్వారా 90 శాతం ఇంధన విక్రయాలు నడుస్తుంటాయి. క్రితం ఏడాది డిసెంబర్ నెలలో పెట్రోల్ అమ్మకాలు 2.72 మిలియన్ టన్నులుగా ఉన్నాయి.
డీజిల్ అమ్మకాలు సైతం 4.9 శాతం పెరిగి 7.07 మిలియన్ టన్నులకు చేరాయి. నవంబర్ నెలలోనూ పెట్రోల్, డీజిల్ వినియోగం క్రితం ఏడాది ఇదే నెల గణాంకాలతో పోల్చి చూసినప్పుడు 8.3 శాతం, 5.9 శాతం చొప్పున పెరగడం గమనార్హం. వరుసగా రెండో నెలలోనూ వృద్ధి నమోదైంది. డిసెంబర్‌లో క్రిస్‌మస్ సెలవుల సందర్భంగా పర్యటనలు పెరగడం, ఖరీఫ్ సాగు సందర్భంగా యంత్రాలకు ఇంధన వినియోగం పెరగడం వినియోగంలో వృద్ధికి దారితీసింది.
ఇక ఈ ఏడాది నవంబర్ నెల విక్రయాలతో పోల్చి చూస్తే డిసెంబర్‌లో పెట్రోల్ అమ్మకాలు 3.6 శాతం, డీజిల్ అమ్మకాలు 1.7 శాతం చొప్పున తక్కువగా ఉండడం గమనార్హం. దేశ ఇంధన మార్కెట్లో 40 శాతం డీజిల్ రూపంలోనే వినియోగం అవుతుంటుంది. ముఖ్యంగా 70 శాతం డీజిల్‌ను రవాణా రంగం వినియోగిస్తుంటుంది. ఆ తర్వాత వ్యవసాయ రంగంలో డీజిల్ వినియోగం ఎక్కువగా ఉంటుంది. ఇక విమానయాన ఇంధనం (ఏటీఎఫ్) అమ్మకాలు డిసెంబర్ నెలలో క్రితం ఏడాది ఇదే నెలతో పోల్చితే 6.8 శాతం పెరిగి 6,96,400 టన్నులుగా ఉన్నాయి. వంటగ్యాస్ (ఎల్‌పీజీ) వినియోగం 5 శాతానికి పైగా పెరిగి 2.87 మిలియన్ టన్నులకు చేరింది.
Comments
Please login to add a commentAdd a comment