పరిశ్రమలకు బెస్ట్‌.. ఏపీ  | CM YS Jagan Comments At Ramco Cements In opening ceremony | Sakshi
Sakshi News home page

పరిశ్రమలకు బెస్ట్‌.. ఏపీ 

Published Thu, Sep 29 2022 3:52 AM | Last Updated on Thu, Sep 29 2022 4:48 AM

CM YS Jagan Comments At Ramco Cements In opening ceremony - Sakshi

నంద్యాల జిల్లా కల్వటాలలో రామ్‌కో సిమెంట్స్‌ను ప్రారంభిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌. చిత్రంలో మంత్రులు, రామ్‌కో ప్రతినిధులు, ప్రజా ప్రతినిధులు తదితరులు

విస్తృతంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ‘గ్రీన్‌ ఎనర్జీ’పై ప్రత్యేకంగా దృష్టి పెట్టాం. రాయలసీమ ప్రాంతం ఇందుకు అనుకూలంగా ఉంది. ప్రస్తుతం రూ.72,188 కోట్ల పెట్టుబడులతో ఈ పరిశ్రమలకు అనుమతులు ఇచ్చాం. ఇప్పుడు ఇంకో అడుగు ముందుకు వేస్తూ రైతులు గ్రూపుగా ముందుకొస్తే వారి పొలాల్లో విండ్, సోలార్‌ యూనిట్లు ఏర్పాటు చేసే దిశగా ప్రణాళికలు రూపొందిస్తున్నాం. ఏటా ఎకరానికి రూ.30 వేల చొప్పున ప్రభుత్వం లీజు చెల్లిస్తుంది. తద్వారా రైతులకు నికర ఆదాయంతో పాటు వారి పిల్లలకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి.  
– సీఎం వైఎస్‌ జగన్‌

సాక్షి ప్రతినిధి, కర్నూలు: పారిశ్రామిక అభివృద్ధి, తద్వారా ఉద్యోగ అవకాశాల కల్పనపై ప్రభుత్వం నిర్దిష్ట ప్రణాళికతో ముందుకెళుతోందని, పరిశ్రమల ఏర్పాటుకు రాష్ట్రం అన్ని విధాలా అనుకూలమని సీఎం వైఎస్‌ జగన్‌ స్పష్టం చేశారు. ఇందులో భాగంగా ప్రతి అంశంలో ‘ఇండస్ట్రీ ఫ్రెండ్లీ’గా అడుగులు వేస్తూ.. గ్రీన్‌ ఎనర్జీ ప్రాజెక్టుల ఏర్పాటుకు సహకరిస్తోందన్నారు.

నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలం కల్వటాలలో ఏర్పాటైన ‘రామ్‌కో సిమెంట్స్‌’ కర్మాగారాన్ని బుధవారం ఆయన ప్రజల సమక్షంలో బజర్‌ నొక్కి ప్రారంభించారు. అంతకు ముందు ఫ్యాక్టరీలోని పరికరాలు, టెక్నాలజీ, ఉత్పత్తి తదితర అంశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రామ్‌కో ఇండస్ట్రీ వల్ల మన ప్రాంతానికి, మనకు మంచి జరుగుతుందన్నారు.

మన పిల్లలు ఎక్కడికో వెళ్లాల్సిన పరిస్థితి లేకుండా ఇక్కడే ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని చెప్పారు. ఈ ప్రాంతంలో లైమ్‌ స్టోన్‌ మైన్స్‌ ఉన్నప్పటికీ గతంలో ఎలాంటి పరిశ్రమలు లేవని.. ప్రస్తుతం ఇక్కడ 2 మిలియన్‌ టన్నుల క్లింకర్, 1.5 మిలియన్‌ టన్నుల గ్రైండింగ్‌ సామర్థ్యంతో ప్లాంట్‌ ఏర్పాటైందన్నారు. తద్వారా 3 మిలియన్‌ టన్నుల సిమెంట్‌ ఉత్పత్తి అవుతుందని, ఇది తొలి దశ మాత్రమేనని.. రాబోయే రోజుల్లో యాజమాన్యం దీన్ని విస్తరిస్తుందని అన్నారు.

తద్వారా ఈ ప్రాంతంలో మెరుగైన వసతులు వస్తాయని, సీఎస్‌ఆర్‌ (కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్స్‌బులిటీ – సామాజిక బాధ్యత) వల్ల చుట్టుపక్కల గ్రామాలకు మంచి జరుగుతుందని తెలిపారు. 75 శాతం స్థానికులకే ఉద్యోగ అవకాశాలు ఉండాలని చట్టం చేయడం వల్ల మన పిల్లలకు మంచే జరుగుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో సీఎం జగన్‌ ఇంకా ఏమన్నారంటే..

తొలిదశలో వెయ్యి మందికి ఉద్యోగాలు         
► మన ప్రాంతంలో రామ్‌కో సిమెంట్‌ను స్థాపించిన వెంకట్రామరాజా అన్నకు మనస్ఫూర్తిగా అభినందనలు. రూ.2,500 కోట్ల పెట్టుబడితో స్థాపించిన ఈ ప్లాంటులో తొలి దశలో వెయ్యి మందికి ఉద్యోగ అవకాశాలు రానున్నాయి. 2019లో మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్ది నెలల్లోనే ఈ ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభమైంది. పనులు వేగంగా పూర్తి చేసింది. 

► గొప్ప మార్పునకు ఈ ఫ్యాక్టరీ నిదర్శనం. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌కు దీనికంటే మరొక ఉదాహరణ అవసరం లేదు. ఎమ్మెల్యే, కలెక్టర్‌ నుంచి నా వరకు అందరి సహకారంతో ఎలాంటి జాప్యం జరగకుండా 30 నెలల్లో ప్రాజెక్టు పూర్తి చేశారు. 

► 1961లో రామ్‌కో సిమెంట్స్‌ ప్రస్థానం మొదలైంది. రోజుకు 200 టన్నులు అంటే ఏటా 0.4 మిలియన్‌ టన్నుల సామర్థ్యంతో మొదలు పెట్టిన ప్లాంటు ఈ రోజు 20 మిలియన్‌ టన్నుల సామర్థ్యం దాకా అడుగులు వేసింది. ప్రతిచోటా వీరి యూనిట్లు బాగా పని చేస్తున్నాయి. 5 చోట్ల ఉత్పత్తి యూనిట్లు.. మరికొన్ని చోట్ల గ్రైండింగ్‌ యూనిట్లు.. మొత్తం 11 యూనిట్లు ఉన్నాయి. అన్నిచోట్ల సామర్థ్యాన్ని పెంచుతూ పోతున్నారు. ఇక్కడ ప్రారంభమైన ప్లాంట్‌కు ఇకపై కూడా మనందరి సహకారం అందిస్తే త్వరితగతిన మరింత అభివృద్ధి, విస్తరణకు దోహద పడుతుంది. 

► కొద్ది రోజుల కిందట గ్రీన్‌కో 5,400 మెగావాట్ల సామర్థ్యంతో సౌర, పవన విద్యుత్‌ ఉత్పత్తి, పంప్‌డ్‌ స్టోరేజ్‌తో చేపట్టిన రెన్యువబుల్‌ ఎనర్జీ ప్లాంటుకు పునాది రాయి వేశాను. ఈ ప్రాజెక్టు వల్ల కర్నూలు జిల్లాలో 2,600 ఉద్యోగాలు వస్తాయి. మన పిల్లలకు మేలు జరుగుతుంది. 

ప్రభుత్వ సహకారం బావుందని వాళ్లే చెబుతున్నారు..
► ప్రతి అంశంలో ‘ఇండస్ట్రీ ఫ్రెండ్లీ’గా రాష్ట్రం అడుగులు వేస్తోంది. ఇది చాలా కీలకం. ఈ మధ్య కాలంలో ‘ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌’లో రాష్ట్రం వరుసగా మూడో ఏడాది కూడా దేశంలో మొదటి స్థానంలో నిలిచింది. పరిశ్రమల నిర్వాహకులతో ఇక్కడి పరిస్థితులపై అభిప్రాయాలు తీసుకుని మార్కులు వేస్తున్నారు. ప్రత్యేకంగా ఎంఎస్‌ఎంఈలకు ఇస్తున్న సహాయం, ప్రోత్సాహకాలు కలిపి పరిశ్రమలకు రాష్ట్రం బాగా సహకరిస్తోందని పారిశ్రామికవేత్తలు చెబుతున్నారు. 

► మన రాష్ట్రం, ప్రభుత్వం ఇస్తున్న మద్దతు గురించి, చేయి పట్టుకుని నడిపిస్తున్న తీరు గురించి పారిశ్రామికవేత్తలు సంతృప్తిగా ఉన్నారు. కాబట్టి మనకు మొదటి స్థానం వచ్చింది. ఇది సువర్ణాక్షరాలతో లిఖించదగింది. 2021–22లో దేశంలో అత్యధిక గ్రోత్‌రేట్‌ 11.43 శాతంతో మనం మొదటి స్థానంలో ఉన్నాం. ఇది గొప్ప మార్పునకు అవకాశం. రాష్ట్రంలో పారిశ్రామిక రంగానికి మనమంతా మద్దతు ఇస్తున్నాం కాబట్టే ఇంతగా మంచి జరుగుతోంది. 

రూ.1000 కోట్లతో గ్రాసిమ్‌ ఇండస్ట్రీ 
► రాష్ట్రంలో ఇటీవలే రూ.1000 కోట్లతో గ్రాసిమ్‌ ఇండస్ట్రీని ప్రారంభించాం. దీనిని కుమార మంగళం బిర్లా ఏర్పాటు చేశారు. 1,150 ఉద్యోగాలు వచ్చాయి. అలాగే 10 వేల మందికి ఉద్యోగ అవకాశాలు ఇచ్చే అపాచీ ఫ్యాక్టరీని రూ.700 కోట్లతో చిత్తూరు, పులివెందులలో చేపట్టాం. 

► దాదాపు రూ.1,700 కోట్ల పెట్టుబడితో టీసీఎల్‌ ప్యానల్‌ ఉత్పత్తి చేపడుతోంది. 3,100 మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. విశాఖలో ఏటీసీ టైర్స్‌ దాదాపు రూ.2,200 కోట్ల పెట్టబడితో ఏర్పాటు చేస్తున్నారు. దాదాపు 2 వేల మందికి ఉపాధి అవకాశాలు వస్తాయి. రామాయపట్నం పోర్టుకు పునాది రాయి వేశాం.  
ప్రతి 50 కిలోమీటర్లకు ఒక హార్బర్‌ లేదా పోర్టు

► ఇప్పటిదాకా రాష్ట్రంలో నాలుగు ప్రాంతాల్లో ఆరు పోర్టులు ఉన్నాయి. ఈ మూడేళ్లలో మరో నాలుగు  పోర్టులు (రామాయపట్నం, మచిలీపట్నం, కాకినాడ, భావనపాడు) నిర్మించేందుకు వేగంగా అడుగులు వేస్తున్నాం. తొమ్మిది ఫిషింగ్‌ హార్బర్‌లు తీసుకొస్తున్నాం. ప్రతి 50 కిలోమీటర్లకు ఒక హార్బర్, పోర్టు ఉండేలా.. తద్వారా ఎగుమతులు పెంచేలా ప్రణాళికలు రచిస్తున్నాం. 

► 2021–22లో రాష్ట్రం నుంచి రూ.1.70 లక్షల కోట్ల ఎగుమతులు ఉన్నాయి. దీన్ని రాబోయే ఐదేళ్లలో రూ. 3.40 లక్షల కోట్లకు పెంచేలా లక్ష్యంగా నిర్దేశించుకుని అడుగులు వేగంగా వేస్తున్నాం. దేశంలో ఎక్కడా జరగని విధంగా మూడు పారిశ్రామిక కారిడార్‌లు.. వైజాగ్‌–చెన్నై, చెన్నై–బెంగళూరు, హైదరాబాద్‌– బెంగళూరును అభివృద్ధి చేస్తున్నాం.

► వైఎస్సార్‌ జిల్లా కొప్పర్తిలో మెగా ఇండస్ట్రియల్‌ పార్క్, ఎలక్ట్రానిక్‌ మాన్యుఫాక్చరింగ్‌ యూనిట్, తిరుపతిలో మరో ఎలక్ట్రానిక్‌ మాన్యుఫాక్చరింగ్‌ యూనిట్‌ ప్రారంభిస్తున్నాం. ఇవన్నీ పూర్తయితే మన పిల్లలకు ఉద్యోగావకాశాలు విస్తృతమయ్యే పరిస్థితి వస్తుంది. మరిన్ని పరిశ్రమలు మన రాష్ట్రం వైపే చూసే పరిస్థితి వస్తుందని ఆశిస్తున్నా. పారిశ్రామికవేత్తలకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా అందుబాటులో ఉంటాం. పూర్తి సహకారం అందిస్తాం.

► ఈ కార్యక్రమంలో మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, గుడివాడ అమర్నాథ్, అంజాద్‌ బాషా, ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్సీలు గుంగుల ప్రభాకర్‌రెడ్డి, చల్లా భగీరథరెడ్డి, ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి, కలెక్టర్‌ మనజీర్‌ జిలానీ శామూన్‌ పాల్గొన్నారు. 

భూమికి లీజు.. పిల్లలకు ఉద్యోగాలు
గ్రీన్‌ డోసాల్, ఆర్సిలర్‌ మిట్టల్, అరవిందో, అదానీ వాళ్లకు రూ.72,188 కోట్ల విలువైన ప్రాజెక్టులకు అనుమతులు ఇచ్చాం. 3–4 ఏళ్లలో ఆ ప్రాజెక్టులు పూర్తయితే 20 వేల ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయి. వీటికి తోడు.. రైతులు ముందుకొస్తే ఎకరాకు ఏడాదికి రూ.30 వేల చొప్పున లీజు ఇచ్చేలా ప్రభుత్వం ఒప్పందం చేసుకుంటుంది. 30.. 50.. ఎన్ని ఏళ్లయినా ఏటా లీజు డబ్బులు ఇస్తాం. మూడేళ్లకోసారి 5 శాతం లీజు పెంచుతాం.

ఈ మేరకు అగ్రిమెంట్లు చేసుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఎమ్మెల్యేలు చొరవ తీసుకుని ఒక ప్రాంతంలో కనీసం 1,500 నుంచి 2 వేల ఎకరాలు ఒక క్లస్టర్‌గా అందుబాటులో ఉండేలా చూస్తే.. రైతులు, గ్రామాలు ముందుకొస్తే ఆ భూముల్లో సోలార్, విండ్‌ పవర్‌ ప్రాజెక్టులు చేపడతాం. తద్వారా రైతులకు మేలు జరగడంతో పాటు వారి పిల్లలకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయి.

మరింత అభివృద్ధి చేస్తాం
ఇక్కడ సిమెంట్‌ పరిశ్రమ ఏర్పాటుకు కలెక్టర్‌ నుంచి ముఖ్యమంత్రి వరకు పూర్తిగా సహకరించారు. వేగంగా పనులు పూర్తి చేసి ఉత్పత్తి ప్రారంభిస్తున్నాం. ఈ సందర్భంగా అందరికీ కృతజ్ఞతలు. ప్రభుత్వ సహకారంతో ప్లాంటును మరింత అభివృద్ధి చేస్తాం. ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పనలో మా వంతుగా సహకారం అందిస్తాం.  
– వెంకట్రామ రాజా, రామ్‌కో ఎండీ 

ల్యాండ్‌ ఆఫ్‌ ఆపర్చునిటీస్‌..
పారిశ్రామికంగా రాష్ట్రం మంచి పురోగతి సాధిస్తోంది. రానున్న రోజుల్లో మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తాం. రాష్ట్రంలో పరిశ్రమలు ఎలాంటి వాతావరణంలో నడుస్తున్నాయో చెప్పేందుకు ‘ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌’లో మనం ప్రథమ స్థానంలో ఉండటమే నిదర్శనం. ఏపీ ‘ల్యాండ్‌ ఆఫ్‌ ఆపర్చునిటీస్‌’ రాష్ట్రంగా ఉంది.  

సముద్రతీరం, జాతీయ రహదారులు, పోర్టుల కనెక్టివిటీ లాంటి అంశాలు పరిశ్రమల రాక, అభివృద్ధికి దోహదపడుతున్నాయి. వీటన్నిటికీ తోడు గొప్ప ముఖ్యమంత్రి అండగా ఉండటం మన అదృష్టం. అనకాపల్లి నియోజకవర్గంలో కూడా రామ్‌కో ప్లాంటు ఉంది. ఇక్కడ మూడో ప్లాంట్‌ ప్రారంభోత్సవానికి రావడం పట్ల ఆనందంగా ఉంది.  
– గుడివాడ అమర్నాథ్, రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement